పార్లమెంట్ ఎన్నికల్లో… కాంగ్రెస్, బీజేపీలకు కర్ర కాల్చి వాత పెట్టాలి

by Disha Web Desk 22 |
పార్లమెంట్ ఎన్నికల్లో… కాంగ్రెస్, బీజేపీలకు కర్ర కాల్చి వాత పెట్టాలి
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఎంపీ ఎన్నికల్లో కర్ర కాల్చి వాత పెట్టిన చందానా బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తేనే హామీలు అమలవుతాయని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కొండ మల్లయ్య గార్డెన్‌లో బీ‌ఆర్‌ఎస్ పార్టీ ఎంపీ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ… సిద్దిపేట వెటర్నరీ కాలేజీను కొడంగల్‌కు తరలించి, అభివృద్ధిని అడ్డుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, సిద్దిపేట అభివృద్ధి పై విధ్వేషం చిమ్మే బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు.

పెన్షన్ రూ.4 వేలకు పెంపు, రూ. 2 లక్షల రుణమాఫీ, ఆడబిడ్డలకు రూ.2500 సాయం, రైతుబంధు రూ.15 వేలకు పెంపు ఇలా ఏ ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకుండా మోసం చేశారని మండిపడ్డారు. ఈ విషయాలను ప్రజల్లో చర్చకు పెట్టాలని బీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతుల గోస పుచ్చుకున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేవుని పేరిట రాజకీయాలు చేస్తుందన్నారు. కొందరు కాంగ్రెస్ నేతలు ఓటమి భయంతో పోటీ నుంచి తప్పుకున్నారని ఎద్దేవ చేశారు. జుటమాటలో ఎమ్మెల్యేగా గెలిచిన బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. సిద్దిపేట జిల్లా పై అవగాహన ఉన్న విద్యావంతుడు, పార్లమెంట్ లో గళం వినిపించే సమర్ధుడు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిని వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

అక్రమ కేసులతో వేధిస్తుండ్రు..

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారం అడ్డం పెట్టుకుని అక్రమంగా కేసులు పెట్టి రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, కేరళ సీఎం కూతురు పై, మాజీ సీఎం కేసీఆర్ కూతురు కవిత పైన ఇలా ప్రతిపక్ష పార్టీల నాయకులను కేసుల పేరిట వేధిస్తూ, బలహీన పరిచే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

పార్టీకి ద్రోహం చేసిన వారిని క్షమించే ప్రసక్తే లేదు

కన్నతల్లి లాంటి పార్టీకి ద్రోహం చేసి ఇతర పార్టీలో చేరిన నాయకులను క్షమించే ప్రసక్తే లేదని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. నాయకులను బెదిరించి, ప్రలోభాలకు గురి చేసి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుపోతారు కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కొనలేరన్నారు. పార్టీ ద్వారా పదవులు పొంది ద్రోహం చేసినవాళ్లను తిరిగి బీఆర్ఎస్‌లోకి చేర్చుకునే ప్రసక్తే లేదన్నారు.

నియోజకవర్గానికో...ఫంక్షన్ హాల్ కట్టిస్తా.. 100కోట్లతో ట్రస్ట్ పెడుతా..

వంద కోట్లతో పీవీఆర్ ట్రస్టు ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు చదువుల కోసం సహాయ సహకారాలు అందిస్తామని బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి పీ. వెంకట్రామిరెడ్డి అన్నారు. అదే విధంగా పార్లమెంట్ పరిధిలోని ప్రతి నియోజకవర్గంలో రూ.2 కోట్లతో ఫంక్షన్ హల్ నిర్మించి, ఒక్క రూపాయి కిరాయి తీసుకొని మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సారధ్యంలో ప్రతి కార్యకర్తకు అండా నిలుస్తా అన్నారు. ఉద్యోగిగా ఉమ్మడి మెదక్ జిల్లాలో సేవ చేసినట్లు గుర్తు చేశారు. ఎంపీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఆశీర్వదించాలని కోరారు. అంతకుముందు మాజీ ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్, పార్టీ నాయకులు మాట్లాడారు.


Next Story