బాబూమోహన్‌కు తలొగ్గిన బీజేపీ అధిష్టానం

by Naresh |   ( Updated:2023-11-02 10:28:41.0  )
బాబూమోహన్‌కు తలొగ్గిన బీజేపీ అధిష్టానం
X

దిశ, అందోల్‌: మాజీ మంత్రి పీ.బాబూమోహన్‌‌ను బీజేపీ అధిష్టానం అందోలు అభ్యర్థిగా ప్రకటించింది. గురువారం బీజేపీ పార్టీ 35 మందితో కూడిన మూడో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో అందోల్ బీజేపీ అభ్యర్థిగా బాబూమోహన్‌ను ఖారారు చేసింది. సినీ నటుడుగా ఉన్న బాబూమోహన్‌ అందోలు నియోజకవర్గానికి జరిగిన 1998 ఉప ఎన్నికలతో రాజకీయ ఆరంగ్రేటం చేశారు. ఆ ఉప ఎన్నికలో టీడీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 1999లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి, చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత జరిగిన 2004, 2009 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2014లో కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరి మూడోసారీ గెలుపోందారు. 2018 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ టిక్కెట్‌ నిరాకరించడంతో బీజేపీలో చేరిన ఆయన పోటీ చేసి క్రాంతికిరణ్‌ చేతిలో ఓటమిపాలయ్యారు.

వద్దన్నా...టిక్కెట్‌ ఖారారు:

తొలిజాబితాలో బాబూమోహన్‌ పేరు లేకపోవడంతో కలత చెందిన ఆయన బీజేపీ టిక్కెట్‌ నాకొద్దూ....ఈ ఎన్నికల్లో పోటీ చేయనంటూ ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ ప్రకటించడం సంచలనంగా మారింది. బాబూమోహన్‌ ప్రకటించిన ఐదు రోజులకు అధిష్టానం విడుదల చేసిన మూడో జాబితాలో ఆయన కే టిక్కెట్‌ను ఖారారు చేయడం గమనార్హం. బాబూమోహన్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి అధిష్టాన పెద్దలపై విమర్శలు చేయడం వల్లనే బీజేపీ అధిష్టానం తలొగ్గి ఆయనకే టిక్కెట్‌ను ఖారారు చేశారని నియోజకవర్గ వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు.

ఉదయ్, బాలయ్యలకు దక్కని టిక్కెట్‌:

తొలిజాబితాలో బాబూమోహన్‌ పేరు లేకపోవడంతో ఆయన తనయుడు ఉదయ్‌బాబుకు టిక్కెట్‌ వస్తుందని నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరిగింది. కొన్ని టీవీ ఛానెళ్లలోనూ ఉదయ్‌కే టిక్కెట్‌ వస్తుందని ప్రసారాలు కూడా వచ్చాయి. బాబూమోహన్‌ వెంట బీజేపీలో చేరిన ఉదయ్‌ బాబు, బండి సంజయ్‌ పాదయాత్ర ఏర్పాట్లలో కీలకంగా వ్యవహరించారు. టిక్కెట్‌ను ఆశించిన బీజేపీలో చేరిన ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మాసన్నగారి బాలయ్యకు నిరాశే ఎదురైంది. బాలయ్య పార్టీలో చేరికతో అందోలు బీజేపీలో గ్రూపు రాజకీయాలకు తెరలేపారు. అప్పటి నుంచి రెండు వర్గాలుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు చీలిపోయి, ఎవరికి వారుగా కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చారు. టికెట్‌ తనకేనంటూ బాలయ్యతో పాటు ఆయన వర్గీయులు జోరుగా ప్రచారం చేసిన ఫలితం దక్కలేదు.

Advertisement

Next Story

Most Viewed