దేశంలో లౌకికత్వానికి ప్రమాదం ఏర్పడింది

by Naresh |
దేశంలో లౌకికత్వానికి ప్రమాదం ఏర్పడింది
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: దేశంలో లౌకికత్వానికి ప్రమాదం ఏర్పడిందని, నియంత పాలనను అడ్డుకోకపోతే భవిష్యత్ తరాలు మనల్ని క్షమించరని మహబూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక సాయి కృష్ణ ఫంక్షన్ హాల్ సీపీఐ పార్టీ మండల స్థాయి కార్యదర్శులు సమావేశంలో ఆయన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాల నరసింహలతో కలిసి ప్రసంగించారు. గడచిన పదేళ్ళ బీజేపీ పాలనలో పేదలు పేదలుగా, ధనవంతులు మరింత ధనవంతులుగా మారారని అందుకే సమసమాజ స్థాపనకై కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు.

కమ్యూనిస్టులకు గ్రామస్థాయి నుంచి సమస్యలు తెలిసినవారని, అందుకే ప్రజాసమస్యల మ్యానిఫెస్టో రూపొందించామని, ఇంటింటికీ తెలపాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. మనందరి ముందున్న ఏకైక లక్ష్యం దేశ సమగ్రతని, దాని కోసం సిద్ధాంతపరంగా ఒకే భావజాలం కలిగిన కమ్యూనిస్టులు కాంగ్రెస్ కలిసి చిత్తశుద్ధితో పనిచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాల నరసింహ మాట్లాడుతూ మరోసారి ప్రధానమంత్రిగా మోదీ అయితే భారత రాజ్యాంగాన్ని మారుస్తారని, ఈ విషయమై ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని పిలుపిచ్చారు.

లౌకికత్వానికి వ్యతిరేకంగా కుల మతాల మధ్య చిచ్చు రేపి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని, ఇది దేశానికి ఎంత ప్రమాదకరమో ప్రజలు ఆలోచించాలని ఆయన కోరారు. మోదీ పాలనలో మేధావులు, మహిళలు, బడుగు బలహీన వర్గాలకు రక్షణ లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హిందువులందరికీ దేవుడంటే భక్తి భావమే ఉంటుందని, దాన్ని ఆసరాగా చేసుకుని మత విద్వేషాలను రెచ్చగొట్టి ఉన్మాదం వైపు దేశాన్ని తీసుకెళ్ళుతున్నారని ఇందుకు మణిపూర్ సంఘటనే సాక్ష్యం అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశం ప్రశాంతంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీకే తమ ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబెదుల్లా కొత్వాల్, సీపీఐ నాయకుడు బృంగి బాలకిషన్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed