బేకరీ లోని తినుబండారాల్లో బొద్దింకల సంచారం

by Aamani |
బేకరీ లోని తినుబండారాల్లో బొద్దింకల సంచారం
X

దిశ, జడ్చర్ల : బాలనగర్ మండల కేంద్రంలోని బేకరీలో పరిశుభ్రత పూర్తిగా లోపించింది.‌ కొన్ని బేకరీల యాజమాన్యాలు కస్టమర్ల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. బాలనగర్ మండల కేంద్రంలోని న్యూ లక్ష్మీ బెంగళూరు బేకరీ లోని తినుబండారాలపై బొద్దింకలు సంచరిస్తూ దర్శనమిచ్చాయి ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మరి కొన్ని, బేకరీలలో పరిశుభ్రత లేకపోవడం, నిల్వ ఉంచిన పదార్థాలను కస్టమర్లకు అందిస్తున్నారు. అయితే బేకరీలో నిత్యం తనిఖీ చేయాల్సిన ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం ప్రజల భద్రతను పూర్తిగా గాలికి వదిలేశారు. బాలనగర్ మండల కేంద్రంలోని న్యూ లక్ష్మీ బెంగళూరు బేకరీ లో తినే పదార్థాలను కొనడానికి వెళ్లిన కొందరు కస్టమర్లకు బేకరీలోని దూద్ పేడ, దిల్ పర్సన్ వంటి వాటిపై బొద్దింకలు సంచరిస్తూ కనిపించాయి. ఇది గమనించిన కస్టమర్లు వాటిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు .అపరిశుభ్రమైన తినుబండారాలు అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం సరైనది కాదని, బేకరీ యజమానిని కస్టమర్లు నిలదీయగా, తమ వద్ద ఇలానే ఉంటాయని మీకు ఇష్టం ఉంటే కొనండి లేకపోతే మానేయండి అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడని పలువురు కస్టమర్లు ఆరోపించారు.

కాగా ఇదే బేకరీలో రెండు రోజుల క్రితం జన్మదిన వేడుకల కొరకు కేకు కొనుక్కొని వెళ్లగా కేక్ కట్ చేసి చూస్తే కుళ్ళిపోయిన దశలో కేక్ ఉందని దాన్ని వెంటనే పారేయాల్సిన పరిస్థితి నెలకొందని మరో కస్టమర్ వెల్లడించారు. ఈ విషయమై స్థానిక విలేకరులు బేకరీ యజమానిని వివరణ కోరగా బొద్దింకలు పురుగులు రావడం సహజమేనని ఇది మీరు గమనించారు కాబట్టి మీకు కనిపించాయని అవి రోజు ఇలానే తిరుగుతాయని వాటిని తొలగించి కస్టమర్లకు అమ్మడం జరుగుతుందని ఇది సహజంగా జరిగే ప్రక్రియ అని నిర్లక్ష్యంగా బేకరీ యజమాని సమాధానం ఇచ్చాడు. ఈ ఘటనపై ఫిర్యాదు చేసేందుకు జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ ను ఫోన్ లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదని ఇలా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న బేకరీల పై దాడులు చేపట్టి అపరిశుభ్రంగా ఉన్న ఆహార పదార్థాలను అమ్మకుండా చూస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించిన యాజమాన్యంపై చర్యలు చేపట్టాలని మండల ప్రజలు సంబంధిత శాఖ అధికారులను కోరుతున్నారు. ఇప్పటికైనా ఫుడ్ సేఫ్టీ అధికారులు మండలంలో పర్యటించి ఇలాంటి బేకరీ లపై దాడులు నిర్వహించే చర్యలు చేపడతారో లేదో చూడాల్సిన పరిస్థితి నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed