రాజకీయాలను పక్కనపెట్టి.. మర్రి ని ఓదార్చిన ఎమ్మెల్యే రాజేష్

by Aamani |
రాజకీయాలను పక్కనపెట్టి.. మర్రి ని ఓదార్చిన ఎమ్మెల్యే రాజేష్
X

దిశ ప్రతినిధి, నాగర్‌కర్నూల్ : రాజకీయాలు రాజకీయాలే.. వ్యక్తిగతం వ్యక్తిగతమే అన్న నానుడిని నిజం చేస్తూ తన ప్రత్యేకతను చాటుకున్నారు నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి. రాజకీయాలకు అతీతంగా నాయకుల ఇండ్లల్లో జరిగే శుభాశుభ కార్యక్రమాలకు హాజరయ్యే ఆయన తన రాజకీయ ప్రత్యర్థి, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో తనతో పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిని కూడా కలిశారు. గత అసెంన్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి మర్రి జనార్దన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి డాక్టర్ రాజేష్ రెడ్డిలు తలపడ్డారు. ఎన్నికల ప్రచారంలో ఒకరిపై ఒకరు మాటలతో యుద్ధం చేశారు. అనంతరం వెలువడిన ఫలితాల్లో రాజేష్ రెడ్డి గెలుపొంది ఎమ్మెల్యేగా ఎన్నికవగా ఓడిన మర్రి మాజీ అయ్యారు. ఆ తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో ఇరువురు నేతలు రాజకీయ విమర్శలు చేసుకున్నారు.

ఈ క్రమంలో రాజకీయంగా ఇద్దరి మధ్య, రెండు పార్టీల శ్రేణుల్లోనూ ఉప్పు నిప్పు అన్న పరిస్థితి నెలకొని ఉంది. అయితే రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితం ఆ తర్వాత వ్యక్తిగత ద్వేషాలకు తావులేదని ఈ ఇద్దరు నేతలు సంకేతాలు ఇస్తున్నారు. తన కొడుకు వివాహానికి మర్రి జనార్దన్ రెడ్డి ఆహ్వానించగా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఇటీవల మర్రి తండ్రి జంగి రెడ్డి చనిపోవడంతో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలతో అంత్యక్రియలకు హాజరు కాలేకపోయినా ఫోన్‌లో మర్రితో మాటాడి విషయం తెలుసుకున్నారు. ఇక రెండు రోజుల తర్వాత సోమవారం మర్రిని స్వయంగా కలిసిన ఎమ్మెల్యే తన సానుభూతిని వ్యక్తం చేయడం విశేషం. తనను పరామర్శించేందుకు వచ్చిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డిని కూడా మర్రి ఆప్యాయంగా ఆహ్వానించారు. ఇద్దరూ కలిసి మాట్లాడుకొన్నారు. ఈ ఇద్దరు నాయకులు మాట్లాడుకుంటుండటాన్ని అక్కడున్న నాయకులు చూస్తూ ఉండిపోయారు.

రాజకీయాల్లో ఒకరంటే ఒకరికి గిట్టని ఈ నాయకులు ఆ తర్వాత కాలంలో వ్యక్తిగత విద్వేషాలకు తావు లేదనేలా ఇలా కలుసుకోవడం పట్ల మేధావులు, సీనియర్ నాయకులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలను ఎన్నికల వరకే పరిమితం చేయాలన్న మంచి విషయాన్ని ఇలాంటి సంఘటనలతో గ్రామస్థాయిలో నాయకులు, కార్యకర్తలు స్ఫూర్తిగా తీసుకోవలసిన అవసరం ఉంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ రాజకీయాల్లో ఇది మంచి పరిణామంగా భావిస్తున్నారు.

Advertisement

Next Story