రోజు రోజుకు వేడెక్కుతున్న అలంపూర్ రాజకీయాలు..

by Hamsa |
రోజు రోజుకు వేడెక్కుతున్న అలంపూర్ రాజకీయాలు..
X

దిశ, ఉండవల్లి: ఎన్నికలకు సమయం ఉన్నా.. అధికారం కోసం రాబోయే ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశ్యంతో ఆయా ప్రధాన పార్టీల నాయకులు ఎవరికి వారుగా అలంపూర్‌లో పర్యటిస్తున్నారు. దీంతో అలంపూర్ నియోజకవర్గంలో రోజురోజుకు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రాబోయే ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకుని ఆయా పార్టీలకు చెందిన నాయకులు అలంపూర్ అభివృద్ధి విషయంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. అయితే గత వారం రోజులుగా కాంగ్రెస్ పార్టీ హాత్ సే హాత్ జోడో పాదయాత్రలో భాగంగా ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ నియోజకవర్గంలోని ఆయా గ్రామాలలో పర్యటించి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించిస్తున్నారు.

అందులో భాగంగానే తుమ్మిళ్ళ గ్రామంలో పర్యటించగా.. అక్కడ రైతులు నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని పలు సమస్యలను ఆయన దృష్టితీసుకెళ్లారు. దీంతో ఆయన తుమ్మిల్ల లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా పంట పొలాలకు నీళ్లు ఇచ్చి సకాలంలో రైతులను ఆదుకోకపోతే పెద్ద ఎత్తున రైతుల సమక్షంలో ధర్నా చేస్తామని హెచ్చరించారు. అదే రోజు అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అబ్రహం కర్నూలు జిల్లా ఇరిగేషన్ అధికారితో ఫోన్లో మాట్లాడి కేసి కెనాల్ ద్వారా అందే 1000 క్యూ సెక్కుల నీటిని తగ్గించుకొని అందులో నాలుగు వందల క్యూసెక్కుల నీరు అందిస్తే అలంపూర్ ప్రాంతాల రైతులకు ఇబ్బందులు రాకుండా తమ పంటలు ఎండిపోకుండా కాపాడుకోవచ్చని తెలపడంతో.. ఆయన చొరవతో ఆర్డీఎస్ అధికారులకు మోటర్లు ఆన్ చేసుకునే విధంగా అనుమతి ఇచ్చారు.

ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకులు మేము ధర్నా చేయడం వల్ల ప్రభుత్వం దిగివచ్చి, రైతులకు నీళ్లు అందే విధంగా చర్యలు తీసుకున్నారని హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొందరు కాంగ్రెస్ పార్టీని విమర్శలు చేస్తూ.. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ఎమ్మెల్యే అబ్రహం ప్రత్యేక చొరవ తీసుకోవడం వల్లే అధికారులు తుమ్మిళ్ల నీళ్లు ఇచ్చారని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. బీఎస్పీ పార్టీ నాయకులు మేం గతంలో తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద రైతు సమస్యల గురించి మాట్లాడి పంటలు ఎండిపోతున్న క్రమంలో నీళ్లు ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్ చేయడం వల్లే ఈరోజు నీళ్లు వచ్చాయని ఎవరికివారు ఇలా చెప్పుకుంటూ.. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. సాగు నీళ్ళే కాదు కొన్ని గ్రామాలకు బస్ సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, ఆర్టీసీ డిఎంకి వినతిపత్రాన్ని అందజేసి ఆ సమస్య కూడా తీర్చామని చెప్పుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా వీటిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని పలువురు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ సారి అలంపూర్ రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయే పరిస్థితి నెలకొందని పలువురి రాజకీయ నాయకుల అంచనా.. ప్రజలు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story