రేషన్ బియ్యం పక్కదారి.. దందాలో డీలర్లే కీలకం

by Sumithra |
రేషన్ బియ్యం పక్కదారి.. దందాలో డీలర్లే కీలకం
X

దిశ, వనపర్తి టౌన్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకోసం రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తుండగా సివిల్ సప్లై అధికారులు, రేషన్ డీలర్లు కుమ్మకై పక్కదారి పట్టిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. టాస్క్ ఫోర్స్ అధికారులు సైతం నామమాత్ర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రతి నెల మొదటి తేదీలోగా సివిల్ సప్లై గోదాముల ద్వారా నిర్దేశిత రేషన్ షాపులకు పీడీఎస్ బియ్యం సరఫరా అవుతుంది. అయితే స్టాక్ ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన రెవెన్యూ అధికారులు అటు వైపు కన్నెత్తి కూడా చూడడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి నెలా 1వ తేదీ నుంచి 21వ తేదీ వరకు లబ్ధిదారుల చౌక దుకాణాల ద్వారా రేషన్ బియ్యం ఇవ్వాల్సి ఉండగా డీలర్లు కొందరు బియ్యం అక్రమ వ్యాపారం చేసే వారితో కుమ్మక్కై రేషన్ షాపుల్లో అక్రమార్కుల సహాయంతో వేలిముద్రలు పొంది ఆటోల ద్వారా తమ అడ్డాకు తరలిస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో పీడీఎస్ రైస్ అక్రమ దందా జోరుగా సాగుతోంది. కొన్ని షాపులో రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారని ఫిర్యాదులు వెళ్లిన అధికారులు పట్టించుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది.

జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి...

జిల్లాలో 1.54 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. అయితే 324 రేషన్ షాప్ ల ద్వారా 2510 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. రేషన్ షాపుల నుంచి బియ్యం ప్రైవేట్ వ్యాపార చేతులకు మారుతుంది. కొంతమంది లబ్ధిదారుల తమ తీసుకున్న బియ్యాన్ని రూ.13 వరకు గ్రామాలలో, జిల్లా కేంద్రంలో డీలర్లకి అమ్మేస్తున్న పరిస్థితి. రేషన్ మధ్యవర్తుల ద్వారా రైస్ మిల్లర్లకు, దళారులకు బ్లాక్ మార్కెట్లో తరలిస్తున్నారు. ఇటీవల కాలంలో రేషన్ షాప్ నుంచి నేరుగా రైస్ మిల్లుకు పంపడంతో సీసీఎస్ పోలీసులు నిఘా పెట్టి పట్టుకొని కేసు నమోదు చేశారు. అలాగే జిల్లా కేంద్రంలోని పలు రేషన్ షాప్ డీలర్ కార్డు హోల్డర్ లతో మాట్లాడి వారి నుంచి వేలిముద్రలు వేయించుకొని పంపిణీ చేసినట్లు రిజిస్టర్ చేసి కిలోకు రూ. 15 నుంచి 20 చొప్పున బయటి వాళ్లకు అమ్మేస్తున్నారు. కొన్ని కొన్ని సందర్భాల్లో రేషన్ బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు కూడా తరలిస్తూ పట్టుబడ్డ దాఖలాలు కూడా ఉన్నాయి.

48(6ఏ) కేసులతో సరి...

జిల్లాలో పీడీఎస్ బియ్యం పక్కదారి పడుతున్నా అధికారులు మొద్దు నిద్ర వీడడం లేదు. జిల్లా కేంద్రంతో పాటు వివిధ మండలాల్లో పీడీఎస్ రైస్ ను పట్టుకొని 48(6ఏ ) కేసులతో సరిపెట్టారు. పీడీఎస్ రైస్ రీసైకిల్, రేషన్ డీలర్లు చేస్తున్న అవకతవకలపై అధికారులు కనీసం నిఘా కూడా పెట్టడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే రైస్ మిల్లర్లకు కొమ్ముకాస్తున్నారని ప్రజలు బాహటంగా విమర్శలు గుప్పిస్తున్న అధికారుల్లో చలనం రావడం లేదు. రేషన్ డీలర్లు సివిల్ సప్లై కార్యాలయానికి వెళ్లి అధికారులతో మంతనాలు చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ, సివిల్ సప్లై అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తే కొంతమేరకైనా ప్రజా పంపిణీ వ్యవస్థ పారదర్శకంగా అమలవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా, రేషన్ దందాపై వివరణ కోరేందుకు సివిల్ సప్లై అధికారికి ‘దిశ’ ప్రతినిధి ఫోన్ చేస్తే కనీసం స్పందించకుండా దాటవేసే ధోరణి లో మాట్లాడారు. ఇప్పటికైనా పీడీఎస్ బియ్యం పక్కదారి పట్టకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed