KTR: అవినీతిని ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ సర్కార్.. కేటీఆర్ సంచలన ట్వీట్

by Shiva |   ( Updated:2024-09-22 04:44:19.0  )
KTR: అవినీతిని ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ సర్కార్.. కేటీఆర్ సంచలన ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరాభివృద్ధి సంస్థ (HMDA)లో పలు ఫైళ్లు నత్తనడకన నడుస్తున్నాయని ఇటీవల మీడియాలో వార్తలు వస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా కొందరు అధికారులు బిల్డింగ్, లేఅవుట్ అనుమతుల ఫైళ్లను నెలల తరబడి వారి దగ్గరే పెట్టుకోవడంతో పర్మీషన్ల జారీలో తీవ్ర జాప్యం ఏర్పడి ప్రభుత్వానికి వచ్చే ఆదాయంపై ప్రభావం చూపుతోందని కొందరు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా వివిధ అనుమతుల కోసం దరఖాస్తు ఫీజు పూర్తిగా చెల్లించినప్పటికీ నెలల తరబడి దరఖాస్తుదారులు ప్లానింగ్ విభాగం చుట్టూ తిరుగుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే అదే అంశంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ట్విట్టర్ (Twitter) వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government)రాగానే లంచావతారాలు చెలరేగుతున్నారని మండిపడ్డారు.

కార్యాలయాల్లో కీలక ఫైళ్లు నత్తనడకన నడుస్తున్నాయని ఆరోపించారు. సాక్షాత్తూ సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) వద్దే ఉన్న మున్సిపల్ శాఖ (Municipal Department) పరిధిలోని హెచ్ఎండీఏ (HMDA)లో భారీ ఎత్తున పేరుకుపోతున్న ఫైళ్లు దేనికి సంకేతమో చెప్పాలన్నారు. ఎలాంటి కారణాలు లేకుండానే కొందరు అధికారులు ఫైళ్లను తమ వద్దే ఎందుకు తొక్కిపెడుతున్నారని ప్రశ్నించారు. ఆ కుట్ర వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో ప్రజలు తెలుసుకోవాలని అన్నారు. బిల్డింగ్ (Building), లే‌అవుట్ (Layout) అనుమతుల్లో అవినీతిని నిరోధించేందుకు కేసీఆర్ ప్రభుత్వం (KCR Government) టీఎస్ బీపాస్‌ (TS BPASS)ను తీసుకొచ్చిందని తెలిపారు. అంతటి పారదర్శక విధానాన్ని కాంగ్రెస్ సర్కార్ (Congress Government) తుంగలో తొక్కి నేడు విచ్చలవిడి అవినీతిని ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. అమ్యామ్యాల కోసమే సామాన్య ప్రజలను కాంగ్రెస్ సర్కార్ ముప్పుతిప్పలు పెడుతోందని కేటీఆర్ (KTR) ట్వీట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed