మహిళలు అన్ని రంగాల్లో మరింత రాణించాలి

by Sridhar Babu |
మహిళలు అన్ని రంగాల్లో మరింత రాణించాలి
X

దిశ, వైరా : మహిళలు అన్ని రంగాల్లో రాణించి మరింత ఆర్థిక అభివృద్ధి సాధించాలని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాములు నాయక్ మాట్లాడారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని మహిళలు అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని వివరించారు. ఆడబిడ్డలకు ఆర్థికంగా అండగా ఉండేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కళ్యాణ లక్ష్మి పథకాన్ని అమలు చేస్తుందని పేర్కొన్నారు. కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ఆడబిడ్డ వివాహానికి ప్రభుత్వం 100116 రూపాయల ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించే ఆడపిల్లలకు 13 వేల రూపాయల ఆర్థిక సాయంతో పాటు కేసీఆర్ కిట్టు ను ఉచితంగా ప్రభుత్వం అందిస్తుందని వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం కృత నిశ్చయంతో పని చేస్తుందని చెప్పారు. స్వరాష్ట్రంలో మహిళలకు సముచిత స్థానం లభిస్తుందన్నారు. వైరా నియోజకవర్గంలోని మహిళలకు ఆయన అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఒకప్పుడు మహిళలు వంటింటికే పరిమితమయ్యేవారని గుర్తు చేశారు. ప్రస్తుత ఆధునిక యుగంలో ఆకాశంలో సగమైన మహిళలు అన్ని రంగాల్లో కూడా సగభాగానికి చేరుకున్నారని వివరించారు. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించే విషయం నుంచి సాఫ్ట్వేర్ తో పాటు అన్ని ఉద్యోగ రంగాల్లో, వ్యాపార రంగాల్లో మహిళలు రాణిస్తున్నారని చెప్పారు. మహిళా దినోత్సవం సందర్భంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా సీఎం కేసీఆర్ ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మహిళలు అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్న సీఎం కేసీఆర్ కు మహిళాలోకం అండగా ఉండి ఆశీర్వదించాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed