సోనియా గాంధీ స్ఫూర్తితో ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం

by Sridhar Babu |
సోనియా గాంధీ స్ఫూర్తితో ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం
X

దిశ,ఇల్లందు : సోనియాగాంధీ స్ఫూర్తితో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సోనియాగాంధీ ప్రకటించిన విధంగా 6 గ్యారంటీలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజులలోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఆరోగ్యశ్రీని ఐదు లక్షల నుండి 10 లక్షలకు పెంచడం జరిగిందన్నారు. నేడు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో 500 కే గ్యాస్, 200 యూనిట్ల ఉచిత కరెంటు పథకాలను ప్రారంభించినట్టు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగానే ఆరు గ్యారంటీలను

అతి త్వరలో ప్రవేశపెట్టి రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సహకారంతో ఇల్లందు నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానన్నారు. మాజీ సీఎం కేసీఆర్ పోడు రైతులకు పట్టాలిస్తానని చెప్పి అడవుల పేరుతో పోడు భూములలో చెట్లను నాటించి అన్యాయం చేశారన్నారు. పోడు రైతుల సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని, అతి త్వరలోనే పోడు రైతులకు పట్టాలి ఇప్పిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు, డానియల్, సుదర్శన్ కోరి, జానీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed