రాష్ట్ర సమగ్ర అభివృద్ధి ప్రజా ప్రభుత్వ లక్ష్యం

by Sridhar Babu |
రాష్ట్ర సమగ్ర అభివృద్ధి ప్రజా ప్రభుత్వ లక్ష్యం
X

దిశ, మధిర : తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఖమ్మం పట్టణంలో ప్రైవేట్ ఆసుపత్రిని ప్రారంభించిన అనంతరం మధిర నియోజకవర్గంలోని చింతకాని, మధిర మండలంలోని పలు గ్రామాల్లో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి డిప్యూటీ సీఎం మాట్లాడారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలను తమ ప్రభుత్వం అమలు చేస్తుందని వివరించారు. రాష్ట్ర సంపద రాష్ట్ర ప్రజలకు చెందాలని తమ ప్రభుత్వం ఈ గ్యారెంటీలను తీసుకువచ్చింది అన్నారు. గత దశాబ్ద పాలనలో అప్పుల పాలైన తెలంగాణను

ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కిస్తున్నామని చెప్పారు. సంపదను సృష్టించి, సృష్టించిన సంపదను ప్రజలకు పంచుతామన్నారు. ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వంలో మహిళలను మహారాణులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఇందిరమ్మ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించామన్నారు. ఆర్థికంగా ఎదగడానికి క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతను అప్పగించామన్నారు. తెలంగాణలోని అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేయబోతున్న మీ సేవ సెంటర్ల నిర్వహణ కూడా మహిళలకు అప్ప చెప్తామని చెప్పారు. మహిళలు ఆర్థిక స్వావలంబన కొరకై తమ ప్రభుత్వం మహిళ స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహిస్తుందని వివరించారు.

మంత్రికి ఘన స్వాగతం

హైద్రాబాద్ ప్ర‌జాభ‌వ‌న్ నుంచి ఉద‌యం 7 గంట‌ల‌కు రోడ్డు మార్గాన ఖమ్మంకు చేరుకున్న డిప్యూటి సీఎం మల్లు భట్టివిక్రమార్క కు జిల్లా అధికార యంత్రాగం, పార్టీ జిల్లా నాయకులు , శ్రేణులు ఘన స్వాగ‌తం ప‌లికారు. ఉద‌యం 11 గంట‌ల‌కు ఆర్‌సీఎం చ‌ర్చ్ ఎదురుగా స్థంబాద్రి హాస్పిట‌ల్‌ ను రాష్ట్ర వ్యవసాయ శాఖ , మార్కెటింగ్ , సహకార , చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో కలిసి ప్రారంభించారు. ఆసుపత్రి మూడవ అంతస్తులో క్యాత్ ల్యాబ్ ను డిప్యూటీ సీఎం ప్రారంభించారు.

చింతకాని, మధిర మండలాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

మధిర నియోజకవర్గం పరిధిలోని చింతకాని, మధిర మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క శంకుస్థాపనలు చేశారు. ఖమ్మం నుండి చింత‌కాని మండ‌లం గాంధీన‌గ‌ర్ కు చేరుకొని రూ.175 ల‌క్ష‌ల‌తో గాంధీన‌గ‌ర్ నుంచి బొప్పారం వ‌ర‌కు రోడ్డు ప‌నుల‌కు శంకుస్థాప‌న చేశారు. ఆ త‌రువాత మ‌ధిర మండ‌లం వంగ‌వీడు గ్రామానికి చేరుకొని రూ. 30 కోట్ల‌తో బోన‌క‌ల్లు- అల్లపాడు- వంగ‌వీడు గ్రామాల వరకు బీటీ రోడ్డు విస్త‌ర‌ణ ప‌నుల‌కు శంకుస్థాప‌న చేశారు. చిలుకూరు గ్రామంలోని శివాల‌యం వ‌ద్ద రూ.70 ల‌క్ష‌ల‌తో బీటీ రోడ్డు

నిర్మాణ ప‌నుల‌కు, రూ.285 ల‌క్ష‌ల‌తో చిలుకూరు నుంచి దొడ్డ‌దేవ‌ర‌పాడు బీటీ రోడ్డు నిర్మాణ ప‌నుల‌కు శంకుస్థాప‌న చేశారు. మధిర మండ‌లం మ‌ర్ల‌పాడు గ్రామానికి చేరుకొని రూ.275 ల‌క్ష‌ల‌తో మ‌ర్ల‌పాడు నుంచి పెనుగొల‌ను- సిద్దినేని గూడెం వరకు బీటీ రోడ్డు నిర్మాణ ప‌నుల‌కు శంకుస్థాప‌న చేశారు. అనంతరం కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఆ త‌రువాత మాటూరు గ్రామానికి చేరుకొని రూ.500 ల‌క్ష‌ల‌తో మాటూరు నుంచి ముస్లిం కాల‌నీ బీటీ రోడ్డు ప‌నుల‌కు శంకుస్థాప‌న చేసిన ఆనంత‌రం స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన కార్యక్ర‌మంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దారి పొడవున ఆయా గ్రామాల ప్రజలు , మహిళల కోలాటం నృత్యాలు డప్పు వాయిద్యాలు తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వైరా శాసనసభ్యులు రామదాసు నాయక్, రాష్ట్ర గిడ్డంగులు సంస్థ చైర్మన్ రాయల్ నాగేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరావు, అదనపు కలెక్టర్ డి.మధుసూదన్ నాయక్, ఎస్ఈపీఆర్ చంద్రమౌలేశ్వరరావు, ఖమ్మం ఆర్డిఓ జి.గణేష్, పీఆర్ ఈఈ వెంకటరెడ్డి, మిషన్ భగీరథ ఈఈ వాణిశ్రీ, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం

తెలంగాణ సరిహద్దు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలంలో వేంచేసి ఉన్న శ్రీ గోపయ్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారిని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దర్శించుకున్నారు. ఆలయ ఈవో రమేష్ నాయుడు వేదపండితులు సాదరంగా ఆహ్వానం పలికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం శాలువాతో సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు.

Next Story

Most Viewed