బదనాం చేసే పని చేస్తే... ఎంత మాత్రం ఉపేక్షించేది లేదు : అలీ షబ్బీర్

by Kalyani |
బదనాం చేసే పని చేస్తే... ఎంత మాత్రం ఉపేక్షించేది లేదు : అలీ షబ్బీర్
X

దిశ భిక్కనూరు : ప్రభుత్వాన్ని బదనాం చేసే విధంగా విధులు నిర్వర్తిస్తే, ఎంత మాత్రం ఉపేక్షించేది లేదని, రైతులకు కావలసిన అన్ని రకాల ఎరువులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. మంగళవారం ఆయన భిక్కనూరు మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షులు జాంగారి గాల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశానికి ఆయన ప్రత్యేక ఆహ్వానితునిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా అధికారులతో జరిగిన రివ్యూ సమావేశంలో వ్యవసాయ సమీక్ష పై ఏవో రాధా మాట్లాడుతూ… రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రైతులకు కావలసిన జీలుగా విత్తనాలను, ఎరువులను సరఫరా చేయడం జరిగిందని వివరించారు. వెంటనే మైక్ అందుకున్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ… వడగండ్ల వానతో గాని, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పూర్తి పరిహారం అదేవిధంగా చూడాలన్నారు. మీరు ఇచ్చే రిపోర్టులో ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకుండా చూడాలని సూచించారు. విధులలో బాధ్యతగా వ్యవహరించకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం ఎంత మాత్రం ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు.

ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా సీరియస్ గా ఉన్నారన్నారు. రైతు ప్రభుత్వం కాబట్టి రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. వర్షాలు కురవకపోవడం వల్ల, పంటల సాగు కోసం రైతులు బోర్లపై ఆధారపడతారని, దీని దృష్టిలో ఉంచుకొని వ్యవసాయానికి కరెంటు సరఫరాలో ఇబ్బందులు కలగకుండా చూడాలని ట్రాన్స్ కో ఏఈలు శ్రీనివాస్, రామలక్ష్మి ను ఆదేశించారు. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు ఏ విధంగా వసూలు చేస్తున్నారని, మండల విద్యాధికారి ఎల్లయ్యను ప్రశ్నించారు. ఫీజులకు సంబంధించిన నోటీస్ బోర్డులను స్కూళ్ళలో ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రైవేట్ స్కూళ్లను తరచూ విజిట్ చేయాలని ఆదేశించారు.

మండల కేంద్రంలోని దళితవాడలో రోడ్డు నడిబొడ్డున ఉన్న కరెంటు స్తంభాన్ని తొలగించేందుకు ప్రతిపాదనలు పంపామని, ఇందుకు 13 వేల రూపాయలకు పైగా ఖర్చు అవుతుందని ట్రాన్స్ కో ఏఈలు షబ్బీర్ అలీ దృష్టికి తీసుకురాగా, 13 వేల రూపాయల సొంత డబ్బులను ట్రాన్స్ కో ఏఈలకు మహమ్మద్ అలీ షబ్బీర్ అందజేశారు. నాలుగు రోజుల్లో రెండు లక్షల రుణమాఫీ అమలు కానుందని, ఇందుకోసం కావలసిన విధి విధానాలు కూడా పూర్తయ్యాయన్నారు. ప్రభుత్వం ద్వారా ప్రతి ఒక్కరికి మేలు జరగాలని, ఎన్నికలప్పుడే పార్టీలని, ఆ ఆ తర్వాత డెవలప్ మెంట్ పై ఫోకస్ పెట్టానని, అభివృద్ధి కోసం, సమస్యల పరిష్కారం కోసం అన్ని పార్టీల నాయకులు తనను కలవవచ్చని, వారికోసం దర్వాజాలు తెరిచే ఉంటాయని షబ్బీర్ అలీ వివరించారు.

ఎంపీపీ ఎంపీటీసీలకు సన్మానం...

నేటితో పదవీకాలం ముగుస్తున్న ఎంపీపీ అధ్యక్షులు జాంగారి గాల్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యులను ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ జ్ఞాపికను అందజేసి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. వారితోపాటు ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, కార్యాలయంలో పనిచేసే సిబ్బందితోపాటు, తహసీల్దార్ శివప్రసాద్ ను శాలువా కప్పి సత్కరించారు. అంతకుముందు మహమ్మద్ అలీ షబ్బీర్ ను ఎంపీపీ పాలకవర్గం పక్షాన సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story