సీఎంఆర్ రికవరీ పై కమ్ముకున్న నీలినీడలు

by Sridhar Babu |
సీఎంఆర్ రికవరీ పై కమ్ముకున్న నీలినీడలు
X

దిశ, ఖమ్మం సిటీ : లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ప్రభుత్వం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో చాలా అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఖమ్మం జిల్లాలో రైస్ మిల్లర్ల వద్ద సుమారు కోట్ల విలువ చేసే ధాన్యం ఉందని గుర్తించారు. జిల్లాలోని 66 పైగా రైసు మిల్లర్లు వీరిలో సగానికి పైగా డిఫాల్టర్లుగా చూపుతున్నప్పటికీ ధాన్యంను మర ఆడించకుండానే అమ్ముకున్నారని తేటతెల్లమైంది. జిల్లా అధికార యంత్రాంగంతో పాటు రాష్ట్ర విజిలెన్స్, ఎఫ్ సీఐ అధికారుల తనిఖీల్లో జిల్లాలోని ఆరోపణలు ఎదుర్కొంటున్న రైసుమిల్లులో తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10 వేల కోట్ల ధాన్యం రైస్ మిల్లర్స్ వద్దే ఉందని ప్రభుత్వానికి సమాచారం రావడంతో సోదాలు చేస్తే ధాన్యం కానీ, రైస్ కానీ కనబడటం లేదని తనిఖీ చేసిన అధికారులు తెలుపుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఖమ్మం జిల్లాలో ఓ మిల్లర్ రింగు

మాస్టర్ అవతారం ఎత్తినట్లు సమాచారం. తనకున్న రాజకీయ పలుకుబడి ద్వారా ఎఫ్సీఐ కి అందించాల్సిన బియ్యాన్ని అందించకుండా రాజకీయాన్ని వాడుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బియ్యంలో మాయాజాలం చేస్తూ ప్రభుత్వాన్ని బురిడీ కొట్టిస్తూ సివిల్ సప్లయ్ లో పనిచేస్తున్న అధికారి సహకారంతో వ్యవహారం చక్క దిద్దుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. ఎఫ్‌సీఐకి అందించాల్సిన కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) విషయంలో మిల్లర్లు మాయాజాలం చేసినట్లు వాదనలు లేకపోలేదు. జిల్లాలోని చాలా రైసు మిల్లుల్లో సీఎంఆర్‌ కింద ఇవ్వాల్సిన కోటాకు, అందుబాటులో ఉన్న బియ్యం నిల్వలకు చాలా తేడా ఉన్నట్లు ఎఫ్‌సీఐ తనిఖీల్లో తేలింది. ఎఫ్‌సీఐకి సీఎంఆర్‌ కింద పంపాల్సిన బియ్యానికి సంబంధించిన వానాకాలం ధాన్యం నిల్వలు చాలా మిల్లుల్లో లేనట్లు ఎఫ్‌సీఐ తనిఖీల్లో బయటపడినట్లు సమాచారం. దీంతో మిల్లుల వారీగా సీఎంఆర్‌ కోసం ఆ మిల్లు ఎంత ధాన్యం తీసుకుంది..?, ఆ ధాన్యాన్ని మిల్లింగ్‌ చేయడం ద్వారా ఎంత బియ్యం వచ్చాయి.?

అందులో ఎఫ్‌సీఐకి ఎంత పంపించాయి? ఇంకా ఎంత బియ్యం పంపించాల్సి ఉంది ? వాటికి సంబంధించి మిల్లుల్లో నిల్వ ఉన్న ధాన్యం వివరాలు సరిపోతున్నాయా..? లేదా? … ఈ విషయాలపై ఎఫ్‌సీఐ అధికారులు తనిఖీల్లో ప్రధానంగా దృష్టి సారించినట్లు సమాచారం. కొన్ని రైసు మిల్లులు వానాకాలం ధాన్యాన్ని అధిక ధరకు అమ్ముకున్నట్లుగా తెలిసింది. తాజాగా యాసంగిలో కొనుగోలు చేసిన ధాన్యాన్నే ఖరీఫ్‌ (వానాకాలం) ధాన్యంగా లెక్కలు చూపిస్తున్నారని ఎఫ్‌సీఐ అధికారులు తేల్చినట్లు తెలుస్తుంది. ఎఫ్‌సీఐకి మిల్లర్లు ఈ ఏడాది ఖరీఫ్‌ సీఎంఆర్‌ బియ్యాన్ని ఈ ఏడాది మే 31 లోగా ఇవ్వాల్సి ఉంది. మిల్లర్లు ఇంతవరకు బియ్యాన్ని అప్పగించలేదని లెక్కలు చెబుతున్నాయి. సీఎంఆర్‌ బియ్యం అప్పగింత గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించలేదు. గడువు ముగిసినా ఇప్పటి వరకు జిల్లాలోని అధిక శాతం మిల్లులు ఎఫ్‌సీఐకి ధాన్యం ఇవ్వలేదని సమాచారం.

గత సీజన్‌కు సంబంధించిన సీఎంఆర్‌ ఇంకా పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. దీంతో మిల్లర్లు చూపిస్తున్న ధాన్యం ఖరీఫ్‌ సీజన్‌దా.. ? లేక రబీ సీజన్‌దా..? తేల్చే పనిలో ఎఫ్‌సీఐ అధికారులు నిమగ్నమయ్యారు. ఇందుకు సాంకేతిక బృందం సాయం తీసుకోనున్నారు.మరోవైపు చాలా రైసు మిల్లులు నేరుగా రైతుల దగ్గరనుంచే ఈ ఏడాది పెద్ద ఎత్తున కనీస మధ్దతు ధరకన్నా తక్కువగా ధాన్యాన్ని కొనుగోలు చేశాయి. ఇది చాలదన్నట్లు తాలు, ఇసుక తదితర కారణాలతో క్వింటాల్‌కు పది కిలోల వరకు కోత పెట్టాయి. ఈ ధాన్యాన్ని అంతా మిల్లింగ్‌ చేసి బయట అమ్ముకుంటున్నట్లు రైసు మిల్లులపై ఆరోపణలు ఉన్నాయి. ఈ ఏడాది సీఎంఆర్‌ బియ్యం అప్పగించే గడువు దాటినా కూడా మిల్లులు ఎఫ్‌సీఐకి బియ్యాన్ని అప్పగించలేదు. రేషన్‌ బియ్యాన్ని కూడా రీసైక్లింగ్‌ చేస్తూ పెద్ద ఎత్తున మిల్లులు అక్రమాలకు పాల్పడుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.

Next Story

Most Viewed