‘రాముడ్ని కాపాడండి’.. CM రేవంత్‌కు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక రిక్వెస్ట్

by Satheesh |
‘రాముడ్ని కాపాడండి’.. CM రేవంత్‌కు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక రిక్వెస్ట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: 9, 10 షెడ్యూల్ ప్రకారం ఏ రాష్ట్రంలో ఆస్తులు ఉంటే అదే రాష్ర్టంకు చెందుతాయని చెప్తుందని, రెండు రాష్ట్రాల మధ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం చేసుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ భవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి రాజధాని పదేళ్లు అయిపోయిందని, ఏపీ, తెలంగాణ సీఎంల సమావేశం ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేయడం సంతోషకరం అన్నారు. ఎన్డీయే ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు కీలకమైన వ్యక్తి అని, ఇప్పుడే పరిష్కరించుకోవాలన్నారు. తెలంగాణ, ఏపీ ప్రజల మధ్య మళ్లీ విభేదాలు లేకుండా ఈ సమావేశం కొనసాగాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. విభజన చట్టం ప్రకారం నడుచుకోవాలని, రాముడ్ని కాపాడుకోవాలని కోరుతున్నట్లు వెల్లడించారు.

ఇద్దరు ముఖ్యమంత్రులు సహచరులు కాబట్టి విభజన అంశాలు కొలిక్కి వస్తాయని అందరూ భావిస్తున్నారన్నారు. భద్రాచలంలో పార్కింగ్ పెడుతాం అంటే స్థలం లేదు, డంపింగ్ యార్డ్‌కు స్థలం లేదన్నారు. ఏపీలో కలిపిన ఏడు మండలాలను తిరిగి తెలంగాణకు తీసుకొచ్చే ప్రయత్నం సీఎం రేవంత్ రెడ్డి చేయాలన్నారు. కృష్ణా నది, గోదావరి నదులపై కూడా చర్చించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. రెండు రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరే విధంగా ఇతర రాష్ట్రాల నుంచి రావాల్సిన వాటా పై కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో చిన్న చిన్న తప్పులు జరుగుతుంటాయని వాటిని సరిచేయడం ప్రభుత్వం బాధ్యత అన్నారు. బీఆర్ఎస్ నిర్మించిన ప్రాజెక్టులతో ఇవాళ దేశంలోనే అత్యధిక వరి ధాన్యం పండించడం జరిగిందన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ఎంతో మంది వలసపోయేవారని.. అవి ఇవాళ వాపసు వచ్చాయన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేసిందన్నారు. కార్పొరేషన్ ఆదాయం తింటున్నారు కానీ అప్పులు కట్టడం లేదని మండిపడ్డారు. జిల్లా కార్యాలయాలలో కూడా ఏపీకి వాటా ఉంది అని వితండవాదం చేయడం కరెక్ట్ కాదని సూచించారు. ఆస్తుల విషయంలో, ఆర్టీసీ, దిల్ వంటి సంస్థ లపై విభజన హామీలు అమలు చేయాలని కోరారు.

Next Story

Most Viewed