తెలంగాణలో తిరిగి TDP సత్తా ఏంటో చూపిస్తాం: సామ భూపాల్ రెడ్డి

by Satheesh |
తెలంగాణలో తిరిగి TDP సత్తా ఏంటో చూపిస్తాం: సామ భూపాల్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ సత్తా చూపిస్తామని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సామ భూపాల్ రెడ్డి స్పష్టం చేశారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా పార్టీ శ్రేణులు, ప్రజలు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఘనస్వాగతం పలుకనున్నారన్నారు. గురువారం ఎన్టీఆర్ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ బడుగు, బలహీనవర్గాల పార్టీ అన్నారు. తెలంగాణ ప్రాంతంలో చరిత్రాత్మకమైన కార్యక్రమాలను అమలు చేసిన ఘనత ఎన్‌టీఆర్‌, చంద్రబాబు నాయుడుకు ఉందన్నారు. చంద్రబాబు నాయకత్వంలో పార్టీ రాష్ట్రంలో తిరిగి పూర్వవైభవం సంతరించుకుని బడుగు, బలహీనవర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేసేందుకు కృషి చేస్తాం అన్నారు.

రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి నెల్లూరి దుర్గాప్రసాద్‌, సూర్యదేవరలతలు మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చర్చలు పాజిటీవ్‌ వేవ్‌లో జరుగుతాయని ఆశిస్తున్నామన్నారు. దేశంలో మొదటి రెండు స్థానాలలో ఉండాలని రెండు రాష్ట్రాలు ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు. గతంలో పార్టీ ఫిరాయింపుల విషయంలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ గతంలో ప్రారంభించిన చెడు సాంప్రదాయానికి ఇప్పుడు ఆయన పార్టీయే బలైపోతున్న పరిస్థితిని చూస్తున్నామని, టీడీపీ వైపు కూడా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు చూస్తున్నారన్నారు. టీడీపీ నుంచి వెళ్లిన వారిని తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తున్నామన్నారు. ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసి మొట్టమొదటిసారిగా హైదరాబాద్‌కు వస్తున్నందుకు పార్టీ శ్రేణుల్లో పండగ వాతావరణం నెలకొందని, ఘనస్వాగతం పలుకనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్‌ ఏ.ఎస్‌. రావు, నాయకుడు కడియాల రాజేందర్‌ పాల్గొన్నారు.

Advertisement

Next Story