ITDA Project Officer : విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు తప్పనిసరి..

by Sumithra |
ITDA Project Officer : విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు తప్పనిసరి..
X

దిశ, పాల్వంచ : గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుపుతున్న క్రీడా పాఠశాలలో విద్యార్థులకు చదువుతో పాటు ఇష్టమైన క్రీడలలో శిక్షణ ఇచ్చి రాష్ట్ర స్థాయి, జాతీయస్థాయిలో పథకాలు సాధించే విధంగా సంబంధిత కోచ్ లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు. శుక్రవారం పాల్వంచ మండల పరిధిలోని కిన్నెరసాని క్రీడా పాఠశాలను సందర్శించారు. విద్యార్థులు వారికి నచ్చిన క్రీడలకు సంబంధించిన క్రీడలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ చదవాలంటే కేవలం పుస్తకాలతో కుస్తీ పట్టడం కాదు... బాలల సంపూర్ణ ఎదుగుదలకు బాటలు పరిచే ఆటలు ఆడటం ద్వారా బృంద స్ఫూర్తి, సహనం, చురుకుదనం, ఏకాగ్రత, పోరాట పటిమ, క్రమశిక్షణ, కొత్తగా ఆలోచించడం వంటి లక్షణాలను విద్యార్థులను పెంపొందిస్తాయన్నారు.

కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్ విభాగాలలో విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని, సంబంధిత కోచులు, క్రీడల అధికారి విద్యార్థులు వారికి ఇష్టమైన క్రీడల్లో పాల్గొన్నప్పుడు వారి నైపుణ్యాలను పరిశీలించాలని తెలిపారు. క్రీడల్లో పాల్గొనే విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికమైన ఆహారాన్ని ప్రతిరోజు అందించాలని సూచించారు. ఆర్చరీ విభాగంలో పిల్లలు కాస్త వెనుకబడి ఉన్నారని, వారిని కూడా ఆర్చరీలో రాటుదేలేలా సంబంధిత కోచ్ లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పేర్కొన్నారు. అనంతరం కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్ క్రీడాకారులకు పలు సూచనలు, సలహాలు ఇస్తూ ప్రతి క్రీడను సీరియస్ గా తీసుకొని ఆడాలని, తప్పనిసరిగా ఈ క్రీడల్లో విజయం సాధిస్తానని మనసులో పట్టుదల పెంచుకొని జాతీయస్థాయిలో పాల్గొని పథకాలు సాధించే విధంగా దృక్పథాన్ని విద్యార్థులకు సూచించారు. వివిధ క్రీడలకు సంబంధించిన పరికరాలు తప్పనిసరిగా అందిస్తానని ఆయన విద్యార్థులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో క్రీడల అధికారి గోపాలరావు, వాలీబాల్ కోచ్ వాసు, అథ్లెటిక్ కోచ్ రాంబాబు, ఆర్చరీ కోచ్ ప్రసాద్, కబడ్డీ కోచ్ కల్తీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed