బీసీ సంక్షేమ శాఖలో వసూళ్ల పర్వం

by Sridhar Babu |
బీసీ సంక్షేమ శాఖలో వసూళ్ల పర్వం
X

దిశ, ఎడ్యుకేషన్ ఖమ్మం : ఖమ్మం వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న బీసీ సంక్షేమ హాస్టల్​లో పర్యవేక్షణ అధికారిగా ఉన్న ఖమ్మం డివిజన్ అధికారిపై పలు ఆరోపణలు వస్తున్నారు. తన పరిధిలో ఉన్న ప్రతి విద్యార్థి నుంచి 30 రూపాయల చొప్పున నెలకు వసూలు చేస్తున్నట్లు ప్రచారమవుతుంది. ఖమ్మం డివిజన్ పరిధిలో సుమారు 13 సంక్షేమ బీసీ హాస్టళ్లు ఉన్నాయి. వీటికి డివిజన్ అధికారిగా ఉన్న ఆఫీసర్ హాస్టల్ వార్డెన్లను ఇబ్బందులకు గురిచేస్తూ ప్రతి విద్యార్థిపై 30 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నట్టు ప్రచారం అవుతుంది.

ఈ డివిజన్ మొత్తాన్ని ఆ అధికారే పర్యవేక్షించి, సమస్యలను జిల్లా అధికారి దృష్టికి తీసుకుపోవాల్సి ఉంటుంది. కానీ వసూళ్లకు పాల్పడుతూ ఇది అనాదిగా వస్తున్న సంప్రదాయమని సెలవిస్తున్నట్టు వార్డెన్లు వాపోతున్నారు. ఈ పరిస్థితి వల్ల ఏం చేయాలో తెలియక ఖమ్మం డివిజన్లో ఉన్న వార్డెన్లు తల పట్టుకుంటున్నారు. అసలే బిల్లులు రాక వార్డెన్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీనికి తోడు ప్రతి నెలా విద్యార్థులకు ఆహారం, ఇతర పదార్థాలు, స్నాక్స్, హాస్టల్లో వివిధ సామాగ్రి తెచ్చేందుకు అప్పులు తెస్తున్నట్టు వారు వాపోతున్నారు. ఇలా ఖర్చు పెట్టిన డబ్బులు సంవత్సరాలుగా ఎదురు చూసినా రావడం లేదని పేర్కొంటున్నారు.

జిల్లా అధికారి దృష్టి సారించేనా

ఇంత జరుగుతున్నా జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి చర్యలకు వెనకాడడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఖమ్మం జిల్లా పరిధిలో ప్రధానంగా ఖమ్మం, కల్లూరు, సత్తుపల్లి డివిజన్లు ఉన్నాయి. వీటి పరిధిలో 32 సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయి. ఈ 32 సంక్షేమ హాస్టళ్ల పరిధిలో సుమారు 2753 మంది విద్యార్థులు వసతి గృహంలో ఉంటూ విద్యను అభ్యసిస్తున్నారు. వీటిలో పోస్ట్ మెట్రిక్స్ లో 1064 మంది విద్యార్థులు, ప్రీ మెట్రిక్ హాస్టల్లో 1689 మంది ఉన్నారు. ప్రతి విద్యార్థి నుంచి 30 రూపాయల చొప్పున మూడు డివిజన్ల అధికారులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

Advertisement

Next Story