పార్టీ ఫిరాయింపుల వేళ BRS ఎమ్మెల్యేలకు కేసీఆర్ కీలక సూచన

by Satheesh |
పార్టీ ఫిరాయింపుల వేళ BRS ఎమ్మెల్యేలకు కేసీఆర్ కీలక సూచన
X

దిశ,తెలంగాణ బ్యూరో: రాజకీయ ఒత్తిళ్లకు భయపడొద్దు.. దైర్యంగా ఉండాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు. రెండోరోజూ బుధవారం పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. మంగళవారం హాజరుకాని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. వీరంతా పార్టీ మారతారనే విస్తృత ప్రచారం గత కొంతకాలంగా జరుగుతుంది. అయితే కేసీఆర్‌తో భేటీ కావడంతో ప్రచారానికి తెరపడినట్లయింది. తాజా రాజకీయ పరిస్థితులపై సుధీర్ఘంగా చర్చించినట్లు సమాచారం.

పార్టీ మార్పు ప్రచారంపైనా కేసీఆర్ అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది. పార్టీ మారిన ప్రయోజనం ఉండదని, రాబోయేది బీఆర్ఎస్ పార్టీయేనని భరోసా కల్పించారు. ప్రభుత్వంలో ఉన్న వారు రకరకాలుగా ఇబ్బందులు పెడతారని, పార్టీ మారాలని ఒత్తిళ్లు కూడా చేస్తారని, వారికి భయపడితే రాజకీయ భవిష్యత్ ఉండదన్నారు. ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలంతా ప్రజాకార్యక్రమాలతో బిజీగా ఉన్నారని, నిత్యం ప్రజల్లోనే ఉండాలని సూచించారు. కష్టకాలంలో పార్టీకి ఎమ్మెల్యేలంతా అండగా ఉండాలని కోరారు. ఈ సమావేశంలో బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, గిడ్డంగుల మాజీ చైర్మన్ దివంగత నేత సాయిచంద్ భార్య రజిని, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed