హస్తంలో టికెట్ లొల్లి..మళ్లీ నాకే టికెట్ అంటున్న అడ్లూరి..

by samatah |   ( Updated:2023-07-12 02:59:27.0  )
హస్తంలో టికెట్ లొల్లి..మళ్లీ నాకే టికెట్ అంటున్న అడ్లూరి..
X

స్వపక్షంలోనే విపక్షం అన్నట్లుగా తయారైంది ధర్మపురిలో కాంగ్రెస్ పరిస్థితి. కాంగ్రెస్ టికెట్ ఎప్పుడు ఆయనకేనా? మరి మా పరిస్థితి ఏంటి? అంటూ సొంత పార్టీలోనే మరో ఇద్దరు నాయకులు తిరుగుబావుటా ఎగరవేశారు. ఈసారి ఎలాగైనా లోకల్ క్యాండిడేట్స్‌కే అవకాశం ఇవ్వాలంటూ పట్టుబడుతున్నారు. దీంతో ధర్మపురిలో విభేదాలు చాప కింద నీరులా విస్తరిస్తున్నాయి. ఒకసారి అవకాశం ఇస్తే గెలిచి చూపిస్తామంటూ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. వాల్ రైటింగ్స్‌తో ప్రచారం సైతం మొదలుపెట్టారు. అయితే గత ఎన్నికలల్లో కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ దాదాపు గెలిచినంత పని చేశారు. మరోసారి అవకాశం ఇస్తే కచ్చితంగా గెలుస్తాననే ఆశతో నియోజకవర్గాన్ని వదలకుండా ఉన్నారు. అడ్లూరికి ఇప్పటికే ఈ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు అవకాశం ఇచ్చారు కాబట్టి ఈసారి మాత్రం స్థానిక నాయకులకే అవకాశం ఇవ్వాలనే డిమాండ్లను అధిష్టానం ముందు ఉంచుతున్నారు. ధర్మపురి గడ్డపై ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని చూస్తున్న హైకమాండ్‌కు ఈ గ్రూపు రాజకీయాలు కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయని చర్చ నడుస్తోంది.

దిశ, జగిత్యాల ప్రతినిధి/పెగడపల్లి : స్వపక్షంలోనే విపక్షం అన్నట్లుగా తయారైంది ధర్మపురిలో కాంగ్రెస్ పరిస్థితి. కాంగ్రెస్ టికెట్ ఎప్పుడు ఆయనకేనా? మరి మా పరిస్థితి ఏంటి? అంటూ సొంత పార్టీలోనే మరో ఇద్దరు నాయకులు తిరుగుబావుటా ఎగరవేశారు. ఈసారి ఎలాగైనా లోకల్ క్యాండిడేట్స్‌కే అవకాశం ఇవ్వాలంటూ పట్టుబడుతున్నారు. దీంతో ధర్మపురిలో విభేదాలు చాప కింద నీరులా విస్తరిస్తున్నాయి. గత ఎన్నికలల్లో కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ దాదాపు గెలిచినంత పని చేశారు. మరోసారి అవకాశం ఇస్తే కచ్చితంగా గెలుస్తాననే ఆశతో నియోజకవర్గాన్ని వదలకుండా ఉన్నారు. నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ మీద పోటీ చేస్తున్న అడ్లూరికి ప్రతి సారి నిరాశే మిగిలింది. అయితే గత ఎన్నికల్లో అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థి, ప్రభుత్వ విప్‌గా ఉన్న కొప్పుల ఈశ్వర్‌ను దాదాపు ఒడించినంత పని చేశాడు. అయితే వచ్చే ఎన్నికల్లో ఎలా అయినా గెలవాలని పట్టుదలతో ఉన్న అడ్లూరి అందుకు అనుగుణంగా వ్యూహరచన చేస్తూ వస్తున్నారు. ఓటమిపాలైనా నిరాశ చెందకుండా ఆశతో మరో ప్రయత్నం చేయాలని చూస్తున్నారు. నియోజకవర్గంలో అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు ప్రభుత్వ వైఫల్యాలు ఏజెండాగా ముందుకు సాగుతున్నారు. తన ఓటమికి కౌంటింగ్‌లో జరిగిన అవకతవకలు కారణమని ఆరోపిస్తూ ఫైట్ చేస్తున్నారు. నాలుగేళ్లుగా ఈ విషయంలో ఫైట్ చేస్తున్న అడ్లూరి నియోజకవర్గంలో సింపతి గేయిన్ చేయడంతోపాటు వైడ్ పబ్లిసిటీ పొందడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. మరోసారి బరిలో నిలిచేందుకు అధిష్టానం నుంచి తనకు స్పష్టమైన హామీ ఉందని కాన్ఫిడెంట్‌గా చెప్తున్నారు.

మేము లోకల్.. మా పరిస్థితి ఏంటి?

ఇదే నియోజకవర్గానికి చెందిన మరో ఇద్దరు కాంగ్రెస్ లీడర్లు మేము లోకల్ టికెట్ మాకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అందులో ధర్మారం మండలానికి చెందిన మద్దెల రవీందర్‌తోపాటు పెగడపల్లి మండలానికి చెందిన గజ్జెల స్వామి ఉన్నారు. గత ఎన్నికల్లో టికెట్ రేసులో చివరి వరకు ఉండి నిరాశ చెందిన రవీందర్ ఈసారి టికెట్‌పై ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు గజ్జల స్వామి రాష్ట్రస్థాయి నేతలతో ఉన్న పరిచయాల కారణంగా టికెట్ కోసం గట్టి ప్రయత్నమే చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. టికెట్ ఆశిస్తున్న ఈ ఇద్దరు నేతలు గ్రౌండ్ లెవెల్‌లో ప్రచారాన్ని సైతం మొదలుపెట్టినట్లు సమాచారం. అందులో భాగంగా ఒకరు శుభకార్యాలు అశుభకార్యాలకు అటెండ్ అవుతూ మద్దతు కూడపెడితే మరొక లీడర్ ఏకంగా మంత్రికి పోటాపోటీగా వాల్ రైటింగ్స్ రాయిస్తూ ఆర్థిక సాయం చేస్తూ ప్రజలకు దగ్గర ప్రయత్నం చేస్తున్నారు. లక్ష్మణ్ కుమార్ ధర్మపురి నుంచి ఇప్పటికే నాలుగుసార్లు ఓడిపోయారని, కాబట్టి అధిష్టానం ఈసారి తమకు అవకాశం ఇస్తుందనే ధీమాలో ఇద్దరు నాయకులు ఉన్నట్లుగా స్పష్టమవుతోంది.

క్యాడర్‌లో కన్ఫ్యూషన్..

ఎలక్షన్స్‌కు టైం దగ్గర పడుతుండడంతో కాంగ్రెస్‌లో ఉన్న గ్రూప్ రాజకీయాలు తెరమీదకి వస్తున్నాయి. సోషల్ మీడియాను వేదికగా చేసుకొని కొందరు కాంగ్రెస్ లీడర్లు పరస్పర విమర్శలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. టికెట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్న వారిలో ఓ లీడర్‌కు అసలు పార్టీలో డిజిటల్ సభ్యత్వమే లేదని, సదరు నేత హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతుగా నిలిచారని పార్టీకి చెందిన ఓ మండల స్థాయి నాయకుడు ఆరోపిస్తున్నాడు. అయితే అదంతా అసత్య ప్రచారమని కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం చివరిదాకా ప్రయత్నం చేశానని, సదరు లీడర్ ఆరోపణలు కొట్టి పారేస్తున్నాడు. అడ్లూరి పార్టీ కార్యక్రమాలకు శ్రేణులను తరలిస్తూ వారి బాగోగులు చూడడం లేదని, టికెట్ ఆశిస్తున్న మరో నాయకుడి వర్గం సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంది తమ నాయకుడే అంటూ చెప్తున్నారు. టికెట్ దక్కని వారు పార్టీ కోసం పని చేస్తారా? లేక రెబల్‌గా మారతారా? అన్న ప్రశ్న ఆ పార్టీ కార్యకర్తలను వేధిస్తోంది. గత ఎన్నికల్లో దగ్గర వరకు వచ్చి చతికిల పడ్డ కాంగ్రెస్‌కు కలిసికట్టుగా పని చేస్తే విజయ అవకాశాలు మరింత మెరుగవుతాయని రాజకీయ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed