సిరిసిల్లలో స్మార్ట్ టాయిలెట్స్ కు ఏమైంది.. మూన్నాళ్లకే మూతపడ్డ వైనం

by Nagam Mallesh |
సిరిసిల్లలో స్మార్ట్ టాయిలెట్స్ కు ఏమైంది.. మూన్నాళ్లకే మూతపడ్డ వైనం
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: జిల్లా కేంద్రంలో బహిరంగ మల, మూత్ర విసర్జనను అరికట్టేందుకు నిర్మించిన స్మార్ట్ టాయిలెట్స్ నిరుపయోగంగా మారాయి. నిర్వహణ లేక రోజురోజుకూ గలీజుగా తయారవుతున్నాయి. సిరిసిల్ల మున్సిపల్ పాలకవర్గ నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపంతో ప్రజారోగ్య పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రతే లక్ష్యంగా లక్షలు వెచ్చించి నిర్మించిన స్మార్ట్ మరుగుదొడ్లు మరుగున పడుతున్నాయి. ఈ స్మార్ట్ టాయిలెట్స్ నిర్మాణం వల్ల సిరిసిల్లకు కేంద్రం నుంచి స్వచ్ఛ సిరిసిల్ల అవార్డు వచ్చింది కానీ, ప్రారంభమైన మూడు నాళ్లకే అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. దాదాపు 15 నెలల నుంచి అవి వాడకంలో లేవు.

2020 స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా అందించిన స్వచ్ఛ సిరిసిల్ల అవార్డుకు సిరిసిల్ల పట్టణం ఎంపిక కావడానికి సరిపడ పబ్లిక్ టాయిలెట్ సిరిసిల్ల పట్టణంలో లేవు. దాంతో జనాభా ప్రాతిపదికన ఉండవలసిన మరుగుదొడ్ల కంటే తక్కువగా ఉన్నాయని.. 2020లో సిరిసిల్ల మున్సిపల్ ఆధ్వర్యంలో స్మార్ట్ టాయిలెట్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అధునాతనమైన సామాగ్రితో అతి తక్కువ సమయంలో నిర్మించడానికి హైదరాబాదులోని ఎక్సోరా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చారు. పట్టణంలోని బతుకమ్మ ఘాట్, కొత్త బస్టాండ్, జిల్లా ప్రధాన ఆసుపత్రి, కొత్త బండ్ చెరువు ప్రాంతంలో ఈ స్మార్ట్ టాయిలెట్లను నిర్మించారు. ఒక్కో టాయిలెట్ నిర్మాణానికి రూ.9.50 లక్షలు, మొత్తం 38 లక్షల రూపాయల మున్సిపల్ నిధులను ఈ టాయిలెట్ల నిర్మాణానికి మంజూరు చేశారు. 2020 ఆగష్టు నెలలో వాటిని అప్పటి మంత్రి కేటీఆర్ అట్టహాసంగా ప్రారంభించారు. దాంతో జిల్లా కేంద్రంలో మొత్తం ఈ నాలుగింటితో కలుపుకొని 13 మరుగుదొడ్లుకు చేరాయి.

2021 నుండి మహిళా సంఘాల నిర్వహణ

2021వ సంవత్సరం నుండి ఈ స్మార్ట్ టాయిలెట్ల నిర్వహణను మహిళా సంఘాలకు అప్పగించారు. గత మూడేళ్లుగా సిరిసిల్లలోని సర్నిమ, స్పందన, సిరిసిల్ల పట్టణ స్లమ్ సమైక్య సంఘాలు ఈ టాయిలెట్ల నిర్వహణ చేస్తున్నాయి. ఈ టాయిలెట్ల నిర్వహణకు స్లమ్ సమైక్య సంఘాలకు ప్రతి నెల మున్సిపల్ శాఖ నుండి నిధులను మంజూరు చేస్తున్నారు. ఒక్క టాయిలెట్ కు 10 వేల చొప్పున పట్టణంలో ఉన్న నాలుగు స్మార్ట్ టాయిలెట్లకు 40 వేల రూపాయలు ప్రతి నెల సిరిసిల్ల మున్సిపల్ చెల్లిస్తోంది. కానీ కొద్ది కాలంగా మహిళా స్లమ్ సమైక్య సంఘాలకు మున్సిపల్ మెయింటెనెన్స్ డబ్బులు చెల్లించకపోవడంతో వారు వాటిని పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.

మూన్నాళ్ళ ముచ్చటే..

సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఈ స్మార్ట్ టాయిలెట్స్ ప్రారంభమైనప్పటికీ, అనాదికాలంలోనే శిథిలావస్థకు చేరుకోని మూన్నాళ్ళ ముచ్చటగా మురిపించాయి. గత ఏడాదిన్నర నుంచి వాటిని పట్టించుకునే నాథుడే లేకపోవడంతో అధ్వానంగా తయారయ్యాయి. టాయిలెట్స్ లలో ఎంతో విలువైన సామాగ్రి సరియైన నిర్వహణ లేక పాడైపోయింది. ఇప్పటికైనా మున్సిపల్ పాలకవర్గం, అధికారులు స్పందించి వాటికి మరమ్మతులు చేసి వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని పట్టణ, జిల్లా ప్రజలు కోరుతున్నారు.

అందుబాటులోకి తీసుకువస్తాం

మీర్జా ఫసహాత్ అలీ బెగ్, మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్

ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాగానే, స్మార్ట్ టాయిలెట్లకు మరమ్మతు పనులు నిర్వహించి, పాడైపోయిన సామాగ్రిని రిపేర్ చేయించి, మెరుగైన వాటిలా తీర్చిదిద్దుతాం. మహిళా సంఘాలు, మరెవరైనా స్వచ్ఛందంగా ముందుకు వస్తే, స్మార్ట్ టాయిలెట్ లపై భాగస్వామ్యం కలిగించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తాం.

Advertisement

Next Story