కాటన్ పరిశ్రమకు మహర్దశ..

by Sumithra |
కాటన్ పరిశ్రమకు మహర్దశ..
X

కాటన్ వస్త్ర ఉత్పత్తికి సిరిసిల్ల పెట్టింది పేరు. నేత కళాకారుల ఖిల్లాగా పిలువబడే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ గత ఏడేళ్ల వరకు సజావుగానే సాగింది. గత ప్రభుత్వం పాలిస్టర్ బతకమ్మ చీరెల ఆర్డర్లను తీసుకురావడంతో కాటన్ పరిశ్రమ పాలిస్టర్ కుదేలైన విషయం తెలిసిందే. నేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపడానికి తీసుకొచ్చిన ఆ పథకంతో నేత కార్మికుల బతుకులు మారడం దేవుడెరుగు. కనీసం కార్మికులకు ఏడాదిలో నాలుగు నెలలు ఉపాధి కల్పించడంలో గత ప్రభుత్వం విఫలమైంది. దీంతో దాని అనుబంధ పరిశ్రమలు కూడా క్రమంగా అంతరించిపోయాయి. ప్రస్తుతం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ నేతన్నలకు సంవత్సరం పొడుగునా చేతినిండా పని కల్పించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సుమారు 60 లక్షల మీటర్ల కాటన్, పాలిస్టర్ రెండింటితో కలిసిన నాణ్యమైన స్కూల్ యూనిఫామ్ బట్ట తయారీ ఆర్డర్లను సిరిసిల్ల నేతన్నలకు ఇచ్చింది. దీంతో పాటు పోలీస్ శాఖకు సంబంధించిన బట్ట ఆర్డర్లను సైతం సిరిసిల్ల నేతన్నలకు ఇవ్వనుంది. అంతేకాక మహిళా పొదుపు సంఘాల్లోని 63 లక్షల మంది మహిళలకు ఏటా నాణ్యమైన రెండు చీరలు అందించే పథకానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈ క్రమంలోనే వేములవాడలో యారన్ (నూలు) డిపో ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పై నేతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : కాటన్ వస్త్ర ఉత్పత్తికి సిరిసిల్ల పెట్టింది పేరు. అలాంటి కాటన్ పరిశ్రమ పాలిస్టర్ బతుకమ్మ చీరెల పథకంతో కుదేలైన విషయం తెలిసిందే. దీంతో దాని అనుబంధ పరిశ్రమలు కూడా క్రమంగా అంతరించిపోయాయి. ప్రస్తుతం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ నేతన్నలకు సంవత్సరం పొడుగునా చేతినిండా పని కల్పించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అయితే ప్రభుత్వం మహిళలకు కాటన్, పాలిస్టర్‌తో మిళితమైన చీరెలు ఇచ్చి, కాటన్ పరిశ్రమలను కాపాడాలని కాటన్ పరిశ్రమ అనుబంధ సంఘాల ఐక్యవేదిక జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ పోరాటం చేస్తోంది. అధికారులు ప్రభుత్వానికి తప్పుడు నివేదిక అందించారని వారు ఆరోపిస్తున్నారు. కాటన్ వస్త్ర ఉత్పత్తితోనే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమల మనుగడ కొనసాగుతుందని వాదిస్తున్నారు. లేదంటే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు తీరని ముప్పు వాటిల్లే పరిస్థితులు నెలకొంటాయని వారు వాపోతున్నారు.

బతుకమ్మ చీరలతో ఆగం...

నేత కళాకారుల ఖిల్లాగా పిలువబడే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ గత ఏడేళ్ల వరకు సజావుగానే సాగింది. గత ప్రభుత్వం పాలిస్టర్ బతకమ్మ చీరల ఆర్డర్లను తీసుకొచ్చి నేతన్నలను ఆగం చేసిన విషయం జగమెరిగిన సత్యం. నేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపడానికి తీసుకొచ్చిన బతుకమ్మ చీరెల పథకంతో నేత కార్మికుల బతుకులు మారడం దేవుడెరుగు. కనీసం కార్మికులకు ఏడాదిలో నాలుగు నెలలు ఉపాధి కల్పించడంలో గత ప్రభుత్వం విఫలమైంది. అంతేకాకుండా అధికారులు అత్యుత్సాహంతో బలవంతంగా సాంఛాలకు ఉన్న కాటన్ బీములు తొలగించి పాలిస్టర్ భీములను అమర్చారు. దీంతో కాటన్ పరిశ్రమతో పాటు దాని అనుబంధ పరిశ్రమలు దెబ్బతిన్నాయి. సుమారు 150 వరకు ఉన్న అద్దకం, డైయింగ్ పరిశ్రమలు 30 కి చేరాయి. 35 వరకు ఉన్న సైజింగ్ పరిశ్రమలు కేవలం 10 మాత్రమే మిగిలాయి. వారితో పాటు ఇతర అనుబంధ పరిశ్రమలు పూర్తిగా మూతపడ్డాయి. దానివల్ల ప్రత్యక్షంగా 2వేల మంది కార్మికులు, పరోక్షంగా మరో 1000 మంది కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది.

పాలిస్టర్ చీరలలో నాణ్యత కరువు...

గత ప్రభుత్వం బతుకమ్మ చీరెల పేరుతో కేవలం పాలిస్టర్ చీరలకు మాత్రమే ఆర్డర్లు ఇచ్చింది. అయితే అవి నాణ్యత లేకపోవడంతో చాలామంది మహిళలు స్టీలు పాత్రలకు ఆ చీరలను అమ్ముకున్నారు. అంతేకాకుండా కొంతమంది రైతులు తమ పంట పొలాలకు బెదురు తీగలుగా చీరలను కట్టారు. ఇంకా కొంతమంది గృహిణులు తమ ఇండ్లలో గోడలకు తెరలుగా కట్టుకున్నారు. అందువల్ల ఇకముందు ప్రభుత్వం మహిళలకు అందించబోయే చీరెలను కాటన్, పాలిస్టర్ మిక్స్‌తో తయారు చేయించి ఇస్తే అవి నాణ్యతతో ఉండి లబ్దిదారులకు ఉపయోగపడతాయి. అందరికీ ఉపయోగపడే విధంగా కాటన్ చీరలను ఉత్పత్తి చేయించాలని కాటన్ వస్త్ర పరిశ్రమ జేఏసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతోంది.

పరిశ్రమ మహర్దశకు ప్రభుత్వ ప్రణాళికలు..

సంక్షోభంలో ఉన్న సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను గట్టెక్కించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సుమారు 60 లక్షల మీటర్ల కాటన్, పాలిస్టర్ రెండింటితో కలిసిన నాణ్యమైన స్కూల్ యూనిఫామ్ బట్ట తయారీ ఆర్డర్లను సిరిసిల్ల నేతన్నలకు ఇచ్చింది. దీంతోపాటు పోలీస్ శాఖకు సంబంధించిన బట్ట ఆర్డర్లను సైతం సిరిసిల్ల నేతన్నలకు ఇవ్వనుంది. అంతేకాకుండా, గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన రూ.270 కోట్ల బకాయిలో సుమారు రూ.200 కోట్లు దఫాల వారీగా చెల్లించింది. ఇంకా సిరిసిల్ల నేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేలా, వారికి చేతినిండా పని కల్పించాలనే సదుద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళా పొదుపు సంఘాల్లోని 63 లక్షల మంది మహిళలకు ఏటా నాణ్యమైన రెండు చీరలు అందించే పథకానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. అందులో భాగంగానే ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కృషితో రూ.50 కోట్ల నిధులతో వేములవాడలో యారన్ (నూలు) డిపో ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

కాటన్ వస్త్ర పరిశ్రమను కాపాడాలి..

కాటన్ వస్త్ర ఉత్పత్తితోనే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమల మనుగడ కొనసాగుతుంది. మరోవైపు అధికారులు పాలిస్టర్ యజమానులతో కుమ్ముక్కై ప్రభుత్వానికి తప్పుడు నివేదిక అందించినట్లు సమాచారం. ప్రభుత్వం పాలిస్టర్ చీరెల ఆర్డర్లు ఇస్తే మళ్లీ అదే కొంతమంది యజమానులే లబ్ధి పొందుతారు. దానివల్ల అసలైన ఆసాములు, కార్మికులు లబ్ధి పొందే అవకాశం ఉండదు. దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేసి కాటన్, పాలిస్టర్ రెండింటితో కూడిన చీరల తయారీకి సిరిసిల్ల నేతన్నలకు ఆర్డర్లు ఇచ్చి కాటన్ పరిశ్రమను కాపాడాలి. దీంతో కాటన్ పరిశ్రమతోపాటు దాని అనుబంధ పరిశ్రమలపై ఆధారపడిన కార్మికులకు లబ్ధి చేకూరుతుంది.

- సురేష్, జేఏసీ కన్వీనర్.

యారన్ డిపో ఏర్పాటు హర్షనీయం..

సిరిసిల్లకు ప్రభుత్వం యారన్ (నూలు) డిపోను మంజూరు చేయడం హర్షనీయం. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల కాటన్, పాలిస్టర్ రెండింటితో కలిసిన నాణ్యమైన స్కూల్ యూనిఫామ్ బట్ట తయారీకి ఆర్డర్లు ఇచ్చింది. దానివల్ల విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్ బట్టను అందించాం. దీంతో విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు కూడా ఉండవు. అలాగే ప్రభుత్వం మహిళా సంఘం సభ్యులకు ఇచ్చే చీరెలో కూడా కాటన్, పాలిస్టర్ రెండు కలిసిన చీరలు తయారు చేసేలా ఆర్డర్లు ఇవ్వాలి. దీంతో మహిళలకు ఇచ్చే చీరలు నాణ్యతగా ఉంటాయి.

- అనిల్, టెక్స్‌టైల్ పార్క్ అధ్యక్షుడు

Advertisement

Next Story

Most Viewed