కిడ్నాప్ కేసును ఛేదించిన సిరిసిల్ల పోలీసులు

by Kalyani |   ( Updated:2024-08-27 15:43:29.0  )
కిడ్నాప్ కేసును ఛేదించిన సిరిసిల్ల పోలీసులు
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : జిల్లాలో ఒక కిడ్నాప్ కేసును ఛేదించి, ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు, నిందితులలో ఇద్దరు మాజీ నక్సలైట్ ఉన్నారని, మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. జిల్లాలోని రుద్రంగి మండలం మానాల గ్రామానికి చెందిన బోయినపల్లి మండలం బూరుగుపల్లి గ్రామానికి చెందిన కమటం వంశీకృష్ణ ప్రేమించుకుని 2022లో పెళ్లి చేసుకున్నారన్నారు.

ఈ పెళ్లి ధరణి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవడంతో ధరణి మనసు మార్చడానికి కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన గొట్టే పద్మ, గొట్టే మనోహర్ అనే మాజీ నక్సలైట్లతో ఐదు లక్షల రూపాయలకు ఒప్పందం కుదురుచుకున్నారన్నారు. ధరణిని కిడ్నాప్ చేయడానికి ఒక సంవత్సరం నుండి పథకం వేసుకొని ధరణి అమ్మ లక్ష్మి, అన్న రాజశేఖర్ లు కత్తి రాము, ఎక్కడ దేవి బాలకిషన్, టిల్లు, జగదీష్ అనే ముగ్గురి సహాయంతో ఒక కారు కిరాయి తీసుకుని ఈ నెల 22న ధరణిని కిడ్నాప్ చేశారన్నారు. ధరణి ఆడపడుచు ఆపడానికి ప్రయత్నం చేయగా వారి కళ్ళల్లో పెప్పర్ స్ప్రే కొట్టి ధరణిని బలవంతంగా కామారెడ్డి, నిజామాబాద్, చండూరు, నాందేడ్, ప్రాంతాలకు తీసుకెళ్లి మనసు మార్చే ప్రయత్నం చేశారని తెలిపారు.

బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ లో ధరణి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి వేములవాడ ఎస్పీ శేషాద్రిని రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేశారన్నారు. తిరిగి బూరుగుపల్లి గ్రామ శివారులో ధరణి విడిచిపెట్టగా ధరణి పోలీస్ స్టేషన్ లో జరిగిన విషయం చెప్పిందన్నారు. దాంతో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించామని, టిల్లు, జగదీష్ అనే ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

మాజీలమంటూ సెటిల్మెంట్లు

జిల్లాలోని కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన గొట్టే మనోహర్ అతని భార్య పద్మ ఇద్దరు ప్రస్తుతం కామారెడ్డిలో ఉంటూ మాజీ నక్సలైట్ల పేరుతో సెటిల్మెంట్లు చేస్తున్నారని ఎస్పీ తెలిపారు. సమస్యలు ఉంటే పరిష్కరిస్తామని అమాయక ప్రజల వద్ద అధిక మొత్తంలో డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నారన్నారు. వీరిద్దరిపై గతంలో కూడా సిరిసిల్ల, కామారెడ్డి, జగిత్యాల జిల్లాలలో పలు కేసులు కూడా నమోదు అయ్యాయన్నారు. వీరిద్దరికి సంబంధించిన బాధితులు ఎవరైనా ఉంటే సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. అంతేకాకుండా మాజీ నక్సలైట్ల పేరుతో ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే పోలీసులకు సమాచారం అందించాలని, బెదిరింపులకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎస్పీ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed