మూడెకరాల ప్రభుత్వ భూమి హాంఫట్.. సీతారాంపూర్‌లో ఓపెన్ సీక్రెట్

by Disha Web Desk 1 |
మూడెకరాల ప్రభుత్వ భూమి హాంఫట్.. సీతారాంపూర్‌లో ఓపెన్ సీక్రెట్
X

దిశ బ్యూరో, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో గడచిన పదేళ్ల కాలంలో ఖాళీ జాగా కనపడిందో చాలు కబ్జా చేశారు.కొంతమంది అధికార పార్టీ నేతలతో కలిసి అధికారులే అక్రమ దందాలకు తెరలేపారు. అధికార పక్షం, ప్రతిపక్షం తేడా లేకుండా పనిచేసిన అధికారులు ప్రభుత్వ భూములకు పట్టాలు ఇచ్చి పంచేశారు. అధికారులే అండగా ఉండడంతో రియల్ మాఫియా రూ.కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను ప్లాట్లు చేసి అమ్మేశారు. ప్రభుత్వం భూరికార్డుల్లో దొర్లిన తప్పిదాలను సవరించేందుకు తీసుకొచ్చిన ధరణి వెబ్‌సైట్‌లోని లోపాలను అడ్డుపెట్టుకుని అక్రమాలకు తెరలేపిన అధికారులు కోట్ల రూపాయల విలువ చేసే 2 ఎకరాల 30 గుంటల భూమిని దర్జాగా ప్లాట్లు చేసి విక్రయించారు. తాజాగా పోలీసులు భూ మాఫియా‌పై ఉక్కుపాదం మోపి కొరడా ఝుళిపించడంతో కొంతమంది బాధితులు పోలీసులను ఆశ్రయించేందుకు సిద్ధం కావడంతో సీతారాంపూర్ సర్వే నెం.16‌లో ఏం జరిగింది అనే విషయం ఇప్పుడు జిల్లాలో చర్చానీయాంశంగా మారింది.

కరీంనగర్ జిల్లా కేంద్రాన్ని ఆనుకుని ఉన్న సీతారాంపూర్‌లోని సర్వే నెం.16‌లో ప్రభుత్వ భూమి వ్యవహారం ఇక్కడ ఓపెన్ సీక్రెట్. జిల్లా కేంద్రానికి ఆనుకోని ఉండటం, శరవేగంగా నగరం అభివృద్ది చెందడం అదునుగా తీసుకున్న కొంతమంది అప్పటి అధికార పార్టీ నేతలు అధికారులతో కలసి కబ్జా చేసేందుకు ప్లాన్ చేశారు. ప్రభుత్వ భూమిని కొట్టేయాలంటే అదే సర్వే నంబరులో ఉన్న ప్రైవేట్ భూమిని అడ్డుపెట్టుకుని పని కానిచ్చేందుకు పథకం రచించారు. అందుకు అధికార పార్టీ నేతలు ఉంటే అడ్డు ఉండదని భావించిన అధికారులు కొంతమంది రియల్ మాఫియాతో చేతులు కలిపి ప్లాన్ వేశారు.

అందుకు అదే సర్వేనంబరు‌లో ఉన్న కొంత ప్రైవేట్ భూమిని పట్టాదారుడితో విక్రయించి దానిని ఆనుకోని ఉన్న 2 ఎకరాల 30 గుంటల ప్రభుత్వ భూమిని ప్లాట్లు చేసి అమ్మేశారు. అయితే అప్పుడు అధికార పార్టీ నేతల అండదండలు పుష్కలంగా ఉండటంతో స్థానిక గ్రామ పంచాయతీ పాలకవర్గాన్ని పావనం చేసుకుని ఇంటి నంబర్లు సృష్టించిన రియల్టర్లు అప్పనంగా అమ్మేసి కోట్లు గడించారు. అప్పుడు పర్మిషన్లు ఇచ్చిన గ్రామ పంచాయతీ పాలకవర్గం కొంతమంది పర్మిషన్లు రద్దు చేయడం, కొంతమందివి కొనసాగించడం పెద్ద దుమారమే రేపింది. మోసపోయిన బాధితులు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు.

ఈ క్రమంలో తాజాగా భూ దందాలపై పోలీసులు కోరడా ఝుళిపించడంతో బాధితులు చేసిన ప్రయత్నంలో తీగలాగితే డొంక కదిలిన చందంగా వారు విక్రయించిన భూమి ప్రభుత్వ భూమిగా వెలుగులోకి వచ్చింది. అయితే ప్లాట్లు చేసి అమ్మిన రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లో కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే ఉండటం, అందుకు అప్పటి అధికార పార్టీ నేత అండదండలు పుష్కలంగా ఉండటం చేత బాధితులు ఏమి ఆలోచించకుండా విక్రయించినట్టు తెలుస్తుంది. కాగా పూర్తిస్థాయిలో విచారణ చేపట్టినట్లయితే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం లేకపోలేదు.


Next Story

Most Viewed