మమతా బెనర్జీ అరాచకాలను వ్యాప్తి చేస్తోంది: బీజేపీ చీఫ్ నడ్డా విమర్శలు

by samatah |
మమతా బెనర్జీ అరాచకాలను వ్యాప్తి చేస్తోంది: బీజేపీ చీఫ్ నడ్డా విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి దొరికిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలపై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సీఎం మమతా బెనర్జీపై విమర్శలు గుప్పించారు. టీఎంసీ ప్రభుత్వం రాష్ట్రంలో అరాచకాన్ని వ్యాప్తి చేస్తోందని ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘బెంగాల్‌లో మహిళల గౌరవాన్ని కాపాడేందుకు వెళ్లిన దర్యాప్తు సంస్థల అధికారులపై దాడి జరిగింది. సందేశ్‌ఖాలీలో జరిపిన సోదాల్లో విదేశీ రివాల్వర్లు బుల్లెట్లు, కాట్రిడ్జ్‌లను సీబీఐ స్వాధీనం చేసుకుంది. దీంతో బెంగాల్‌లో అరాచకాలను ఎలా వ్యాప్తి చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. దీనికి రాబోయే ఎన్నికల్లో మమతా బెనర్జీకి ప్రజలు తగిన సమాధానం ఇస్తారు’ అని వ్యాఖ్యానించారు.

తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేస్తోందని ఆరోపించారు. కాబట్టి లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ భారీ విజయం సాధించడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. ప్రజల మద్దతుతో రాష్ట్రాన్ని కాపాడుతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 35లోక్ సభ స్థానాల్లో విజయం సాధిస్తామని నొక్కి చెప్పారు. మరోవైపు సీఎం మమతా బెనర్జీని అరెస్ట్ చేయాలని, టీఎంసీని నిషేధించాలని మేదినీపూర్ బీజేపీ అభ్యర్థి అగ్నిమిత్ర పాల్ అన్నారు. సందేశ్‌ఖాలీలో సీబీఐ జరిపిన దాడుల్లో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకోవడంతో టీఎంసీ, బీజేపీల మధ్య మాటల యుద్ధం మొదలైన విషయం తెలిసిందే. టీఎంసీని ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని బీజేపీ వ్యాఖ్యానించగా..స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా కేంద్ర ఏజెన్సీ దాడులు నిర్వహించాయని మమతా బెనర్జీ ఆరోపించారు.

Advertisement

Next Story