నిండు కుండలా ఎల్ఎండి..కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదల..

by Aamani |
నిండు కుండలా ఎల్ఎండి..కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదల..
X

దిశ,తిమ్మాపూర్ : తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండి జలాశయం పూర్తి స్థాయి లో జలకళను సంతరించుకొని నిండు కుండను తలపిస్తుంది. గత కొద్ది రోజులుగా కురిసిన వర్షాలతో పాటు మిడ్ మానేరు జలాశయం నుంచి ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరుతుండడంతో ఎల్ఎండి పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. ఈ తరుణంలో ఎస్సారెస్పీ అధికారులు సోమవారం ఉదయం ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.అనంతరం గంట సేపటి తర్వాత అధికారులు మళ్ళీ గేట్లను మూసివేశారు.

24 టీఎంసీలకు చేరువలో నిల్వ..

ఎల్ఎండి ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 24.030 టీఎంసీలు కాగా 30 రోజుల క్రితం వరకు కూడా ప్రాజెక్టులో కేవలం 5 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉన్న పరిస్థితి ఉండగా మిడ్ మానేరు జలాశయం నుంచి ఆశించిన స్థాయిలో నీరు రావడంతో పాటు గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రాజెక్టులో ప్రస్తుతం నీటి నిల్వ 24 టీఎంసీలకు చేరువలో ఉంది.

రెండు గేట్ల ఎత్తివేత..మళ్ళీ మూసివేత..

మిడ్ మానేరు జలాశయం నుంచి ఎల్ఎండి జలశయానికి 3500 క్యూసెక్కుల వరకు నీరు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. సోమవారం ఉదయం 6 గంటల సమయంలో ప్రాజెక్టులోకి మిడ్ మానేరు నుంచి 3500 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటికే ప్రాజెక్టు పూర్తి స్థాయి లో నిండుతుండగా అధికారులు మిడ్ మానేరు నుంచి వస్తున్న నీటిని 2 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేసిన అనంతరం గంట తర్వాత గేట్లను మూసివేశారు. కాకతీయ కాలువ ద్వారా 2000 క్యూసెక్కుల నీటిని దిగువ ఆయకట్టుకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed