Jaishankar : నేటి భారత్ చూస్తూ ఊరుకోదు.. ఉగ్రదాడులు జరిగితే స్పందించి తీరుతాం : జైశంకర్

by Hajipasha |
Jaishankar : నేటి భారత్ చూస్తూ ఊరుకోదు.. ఉగ్రదాడులు జరిగితే స్పందించి తీరుతాం : జైశంకర్
X

దిశ, నేషనల్ బ్యూరో : దేశ వాణిజ్య రాజధాని ముంబై(Mumbai)పై 2008 సంవత్సరంలో జరిగిన 26/11 ఉగ్రదాడికి ఆనాటి ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్(Jaishankar) మండిపడ్డారు. దేశ భద్రతను సవాల్ చేస్తూ అలాంటి దాడులు జరిగినప్పుడు తప్పకుండా తగిన ప్రతిస్పందన ఉండి తీరాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఆదివారం ముంబైలో విలేకరులతో మాట్లాడుతూ ఎస్.జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇప్పుడు భారత్ (India) మారింది. దాని ఆలోచన మారింది. ఉగ్రదాడులు జరుగుతుంటే చూస్తూ కూర్చునే భారత్ కాదు ఇది’’ అని ఆయన స్పష్టం చేశారు. దేశంలో 26/11 తరహా ఉగ్రదాడులు మళ్లీ జరగొద్దని తాము మనసారా కోరుకుంటున్నామని చెప్పారు. ‘‘ఉగ్రవాదంపై భారత్ రాజీలేని రీతిలో పోరాటం చేస్తోంది. ఈవిషయంలో ప్రపంచదేశాలకు మనం ఆదర్శప్రాయం. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ సభ్యదేశంగా ఉన్న టైంలో.. 26/11 ఉగ్రదాడి జరిగిన ముంబైలోని హోటల్‌లోనే ఉగ్రవాద నిరోధక కమిటీ సమావేశాన్ని నిర్వహించింది. అది భారత్ సత్తా’’ అని విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. ఉదయం వేళ నీతులు చెబుతూ.. రాత్రి కాగానే ఉగ్రవాదులకు స్పాన్సర్ చేస్తున్న దేశాలను నేటి భారత్ ఉపేక్షించదన్నారు.

పదేళ్లలో పెట్టుబడులన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాలకు రాలేదు

గత పదేళ్లలో పెట్టుబడులు, అభివృద్ధి ప్రాజెక్టులన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాలకే దక్కాయనడం సరికాదని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ అన్నారు. పెట్టుబడులు ఏ రాష్ట్రంలో పెట్టాలనేది ఇన్వెస్టర్ల వ్యూహాత్మక నిర్ణయమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభించే విధానాలు, వనరుల లభ్యత వంటి అంశాల ఆధారంగా ఇన్వెస్టర్లు పెట్టుబడి నిర్ణయాలను తీసుకుంటారని ఆయన తెలిపారు. పెట్టుబడులు రాకపోయినా.. కేంద్ర ప్రభుత్వాన్ని విపక్ష పాలిత రాష్ట్రాలు విమర్శించడం సరికాదని జైశంకర్ పేర్కొన్నారు. కేంద్ర సర్కారు విధానాల వల్లే మహారాష్ట్ర నుంచి గుజరాత్‌కు ఇన్వెస్టర్లు వలస వెళ్తున్నారనేది ముమ్మాటికీ తప్పుడు ప్రచారమని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ సారథ్యంలో డబుల్ ఇంజిన్ సర్కారు మళ్లీ ఏర్పడేలా అసెంబ్లీ ఎన్నికల్లో తీర్పు ఇవ్వాలని మహారాష్ట్ర ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.

Advertisement

Next Story