MLA Adi : సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై ప్రభుత్వం దృష్టి

by Kalyani |
MLA Adi : సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై ప్రభుత్వం దృష్టి
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై ముఖ్యమంత్రి, మంత్రులు ప్రత్యేక దృష్టి సారించారని, త్వరలోనే సమస్యలన్నీ పరిష్కారమవుతాయని ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పద్మశాలి కళ్యాణ మండపంలో పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘ కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపి, కార్యవర్గంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఆకాంక్షించారు. వస్త్ర పరిశ్రమ అంటే గుర్తుకు వచ్చేది సిరిసిల్లానే అని, మారుతున్న నాగరికత అనుగుణంగా కొత్త పుంతలతో నేతన్నలు ముందుకు రావాలన్నారు. 197 కోట్ల బతుకమ్మ చీరల బకాయిలు ప్రభుత్వం చెల్లించిందని, త్వరలో మరో నాలుగు కోట్ల నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు.

సిరిసిల్లలో త్వరలో యారణ్ డిపో ఏర్పాటు చేయబోతున్నామని, 10 హెచ్పి ల ఉచిత కరెంటును, 20 హెచ్పి ల వరకు పెంచబోతున్నామన్నారు. నేతన్నలకు 8 కోట్ల మీటర్ల బట్ట ఆర్డర్లు ఇచ్చి, 1 కోటి 30 లక్షల పొదుపు సంఘాల మహిళలకు ఏడాదికి రెండు చీరలు ఇవ్వబోతున్నామని స్పష్టం చేశారు. త్వరలో ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్య అయ్యర్ సిరిసిల్లకు వచ్చి, నేతన్నల సమస్యలపై నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందజేయబోతున్నారని తెలిపారు. తమిళనాడు తిరుప్పూర్ వస్త్ర పరిశ్రమ తరహాలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను తీర్చిదిద్దేలా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అనంతరం నూతన పాలకవర్గాన్ని శాలువాతో ఘనంగా సత్కరించారు.

శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం

నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తి దారుల సంఘం కార్యవర్గానికి మంత్రి పొన్నం ఫోన్లో శుభాకాంక్షలు తెలిపారు. తాను కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావలసి ఉండగా రాష్ట్రపతి పర్యటన వల్ల రాలేదని వెల్లడించారు. నేత కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, తాను కూడా తన వంతు కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed