రైతు రాజ్యంలో కరెంట్.. వచ్చేదెప్పుడో.. పోయేదెప్పుడో.. ఎంత సేపు ఉంటదో..?

by Mahesh |   ( Updated:2023-02-08 06:56:34.0  )
రైతు రాజ్యంలో కరెంట్.. వచ్చేదెప్పుడో.. పోయేదెప్పుడో.. ఎంత సేపు ఉంటదో..?
X

దిశ, కోరుట్ల రూరల్: అయ్యా కరెంట్ వచ్చేదెప్పుడో.. పోయేదెప్పుడో.. ఎంత సేపు ఉంటదో.. తెల్తలేదు. ఎన్ని గంటలు ఉంటదో ఎవరికీ తెల్వది. పొద్దంతా పొలంకాన్నే పడిగాపులు పడ్తున్నం.. కరెంట్ రాక కోసం ఎదురు చూసి రాగానే పంపు చాలు జేస్తే కొద్ది సేపటికే కరెంటు పోవట్టే.. మళ్లా వచ్చేదాక ఆన్నే ఎదురుచూస్తున్నాం. సద్దిగాడికే వత్తున్నది.. గాన్నే తినుడు.. గాన్నే పండుడు.. మా బతుకు గిట్లయింది.

రైతు రాజ్యం అంటున్నారు మరి గీ రైతురాజ్యంలనే కరెంటు గోసలుంటే మేము బతుకుడు ఎట్లయ్యా.. ఒక పక్క ఎండలు మండవట్టే.. పంటలేమో గిప్పుడే పెరుగుడు చాలైంది.. గిటుజూత్తే కరెంటు కష్టాలు.. ఈ పంట చేతికచ్చేదాకా మాకు ఘడియ తిరంబడ్తలేదు ... జెరా కరెంటు ఇయ్యున్రి అంటూ మండలంలోని అయిలాపూర్ గ్రామ రైతులు బుధవారం అయిలాపూర్ - కోరుట్ల రహదారిపై బైటాయించారు.

ఉదయం 6 నుండి సాయంత్రం 6 దాకా నాణ్యమైన త్రీ ఫేజు కరెంటు ఇస్తే సాలు.. 24 గంటలు మాకు అక్కర్లేదు.. మా పంటలు ఎండకుండా ఉండాలంటే కరెంట్ ఇయ్యాల్సిందే, పైనోళ్లు.. కిందోళ్లు ముచ్చట్లు మా పంటకు నీళ్లు ఇయ్యవు.. జెర గా పైనోళ్లకు మా గోస మీరే జెప్పి కరెంటు ఉండేటట్టు జెయ్యుర్రి అని మొరపెట్టుకున్నారు. ధర్నా విషయాన్ని స్థానిక అధికారులు పై అధికారులు తెలియజేశారు.

కోరుట్ల ఏడీఈ ఆంజనేయులు రైతులతో మాట్లాడి కరెంట్ సరఫరాకు ఉన్నతాధికారులతో మాట్లాడి సక్రమంగా జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. అప్పటికే ధర్నా వల్ల చాలా వాహనాలు నిలిచిపోవడంతో కోరుట్ల ఎస్సై చిర్ర సతీష్ ఆధ్వర్యంలో పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed