బీజేపీ vs బీఆర్ఎస్.. హుజూరాబాద్‌లో సోషల్ వార్..

by Mahesh |
బీజేపీ vs బీఆర్ఎస్.. హుజూరాబాద్‌లో సోషల్ వార్..
X

దిశ, హుజూరాబాద్ : హుజూరాబాద్ రాజకీయాల్లో సోషల్ వార్ దుమారం రేపుతోంది. బీఆర్ఎస్, బీజేపీ ప్రజాప్రతినిధులు, నాయకులను టార్గెట్ చేస్తూ ఫేస్ బుక్ వేదికగా రెండు గ్రూప్ లో చేస్తున్న పోస్టులు వైరల్ అవుతున్నాయి. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల అవినీతి, అక్రమాలపై ఓ సోషల్ మీడియా ఫేస్ బుక్ లో మెసేజ్ లు పోస్టు చేస్తుండగా మరో మీడియా బీజేపీని టార్గెట్ చేస్తున్నది. మూడు నెలలుగా జరుగుతున్న ఈ కోల్డ్ వార్ లో వస్తున్న కొన్ని పోస్టులు ఆసక్తికరంగా ఉంటున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పిస్తున్న ఈ రెండు సోషల్ మీడియాలు స్థానిక రాజకీయాలను కూడా ప్రభావితం చేస్తున్నాయి.

కాగా ఇటీవల మున్సిపాలిటీలో చోటు చేసుకున్న పరిణామాలపై ఫేస్ బుక్ వేదికగా ప్రత్యర్థి పార్టీ నాయకులతో పాటు ఒకే పార్టీలో కొనసాగుతున్న వారి అక్రమాలపై స్పందిస్తూ చేస్తున్న విమర్శలపై ప్రజల్లో చర్చ సాగుతున్నది. భూ కబ్జాలు, ఇండ్ల ఆక్రమణలతో పాటు ప్రభుత్వ పథకాల మంజూరు అంశాలను లేవనెత్తుతున్నారు. అంతటితో ఆగకుండా ఆ గ్రూపుల్లో అసభ్య పదజాలం కూడా వాడుతున్నారు. అయితే ఈ పోస్టులు కొందరికి కాలక్షేపాన్ని కలిగిస్తుండగా మరికొందరు మాత్రం పట్టణంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు బయట పడితే శుభ పరిణామమే కదా అని చర్చించుకుంటున్నారు. అయితే ఈ ఫేస్ బుక్ వార్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎటు దారి తీస్తుందోనని అనుకుంటున్న వారు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed