క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లకు కాళేశ్వరం కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్

by Y. Venkata Narasimha Reddy |
క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లకు కాళేశ్వరం కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్
X

దిశ, వెబ్ డెస్క్ : కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. శనివారం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో క్వాలిటీ కంట్రోల్ ఇంజినీర్లుగా పనిచేసిన ఈఈ, సీఈ, ఎస్ఈ లు నీటిపారుదల శాఖ ప్రధాన కార్యాలయం జలసౌధలో కమిషన్ ముందు హాజరయ్యారు. వారిని కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ మూడు బ్యారేజీలలో క్వాలిటీ కంట్రోల్ వింగ్ పోషించిన పాత్రపై అధికారులను కమిషన్ ప్రశ్నించింది. ఆనకట్టల నిర్మాణ పనుల్లో నాణ్యత, నిర్మాణ సమయంలో నాణ్యతా తనిఖీలు, సంబంధిత అంశాలపై జస్టిస్ ఘోష్ వారిని ప్రశ్నిస్తున్నారు. కమిషన్ ప్రశ్నలకు క్వాలిటీ కంట్రోల్ అధికారులు విభిన్న సమాధానాలు చెప్పడం చర్చనీయాంశమైంది. బ్యారేజీల సైట్ విజిట్ ఎన్ని రోజుల కొకసారి చేసేవారని అధికారులను కమిషన్ ప్రశ్నించింది. రెండు మూడు నెలలకొకసారని ఒకరు, అసలు సైట్ విజిట్ చేయలేదని మరొకరు పొంతన లేని సమాధానాలిచ్చినట్లు తెలిసింది. గతంలో వారు దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా వారిని జస్టిస్ పీసీ ఘోష్ క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. అన్నారం బ్యారేజ్ డిజైన్ సరిగా లేదని అన్నారం బ్యారేజ్ ఈఈ కమిషన్ కు చెప్పారు. వరదకు తగ్గట్టుగా అన్నారం బ్యారేజ్ డిజైన్ లేదని తెలిపారు. తక్కువ వరదకు డిజైన్ చేస్తే ఎక్కువ వరద వస్తోందన్నారు. ఎత్తిపోతలకు బ్యారేజ్ అనుగుణంగా లేదని సమాధానమిచ్చారు.

Next Story

Most Viewed