Byju’s: క్షమించండి.. వారంలో కొంత జీతం చెల్లిస్తాం: బైజు రవీంద్రన్

by Harish |
Byju’s: క్షమించండి.. వారంలో కొంత జీతం చెల్లిస్తాం: బైజు రవీంద్రన్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ప్రముఖ ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్ గత కొంత కాలంగా తన ఉద్యోగులకు కనీసం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం సంస్థ వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్ నుంచి కీలక ప్రకటన వచ్చింది. విద్యార్థులకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులకు ఈ వారంతం చివరలో పెండింగ్‌లో ఉన్న జీతంలో కొంత మొత్తాన్ని చెల్లిస్తామని తెలిపారు. ఈ మేరకు ఈ విషయాన్ని వారికి ఈ మెయిల్ ద్వారా తెలియజేశారు.

సెప్టెంబరు 21న ఉపాధ్యాయులకు పంపిన ఈమెయిల్‌లో, రవీంద్రన్ జీతాల చెల్లింపులలో ఆలస్యం గురించిన కారణాలను వివరించాడు. ఆర్థిక అనిశ్చితి వలన అనుకున్న సమయానికి జీతాలు ఇవ్వలేకపోయాము. దానికి నేను క్షమాపణలు కోరుతున్నాను. జీతాల కోసం చాలా కాలం వెయిట్ చేశారు. ఇలా చేయడం సరైంది కాదు. అందుకే మీరు నన్ను నిజంగా క్షమించాలని ఆయన కోరారు. సవాళ్లు ఉన్నప్పటికీ, ఉపాధ్యాయులు దృఢంగా ఉండాలి. మీరు క్లాస్‌లు తీసుకున్నారు, సందేహాలను పరిష్కరించారు, కంటెంట్‌ని సృష్టించారు, విద్యార్థులకు అన్ని వేళలా అందుబాటులో ఉన్నారు. బైజు ఆర్థిక పరిస్థితి పుంజుకున్న తర్వాత మరింత ఎక్కువ చెల్లింపులు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

జీతాలు రాకపోవడంతో చాలా మంది ఉపాధ్యాయులు కష్టాలు అనుభవిస్తున్నారు. ఏప్రిల్, మే నెలలకు పాక్షిక-వేతన చెల్లింపులు చేసినట్లు సమాచారం ఉన్నప్పటికీ ఫిబ్రవరి, మార్చితో సహా మునుపటి నెలలకు సంబంధించిన పూర్తి చెల్లింపులను కంపెనీ ఇంకా చేయలేదు.

Next Story

Most Viewed

    null