Manmohan Singh : భారత ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్

by M.Rajitha |   ( Updated:2024-12-26 17:45:11.0  )
Manmohan Singh : భారత ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్
X

దిశ, వెబ్ డెస్క్ : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Former PM Manmohan singh) కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన మృతికి ప్రధాని మోడీతో సహా రాజకీయ ప్రముఖులందరూ నివాళులు అర్పిస్తున్నారు. కాగా భారతదేశానికి 14వ ప్రధానమంత్రిగా పని చేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్.. భారత ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా గుర్తింపు పొందారు.

మన్మోహన్ సింగ్ జననం, విద్యాభ్యాసం, పదవులు..

మన్మోహన్ సింగ్ సెప్టెంబర్ 26, 1932న పశ్చిమ పంజాబ్‌లోని గాహ్ గ్రామంలో(ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉంది) జన్మించారు. చండీగఢ్‌లోని పంజాబ్ విశ్వవిద్యాలయం 1952లో నుంచి ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్ చేశారు. అలాగే ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి 1962లో డాక్టరేట్ పొందారు. సింగ్ ప్రభుత్వ సేవలో సుదీర్ఘమైన అనుభవం కలిగి ఉన్నారు. ఇందిరా గాంధీ హయాంలో 1971లో విదేశీ వాణిజ్య మంత్రిత్వ శాఖకు ఆర్థిక సలహాదారుగా బాధ్యతలు చేపట్టారు. 1972లో ఆర్థిక మంత్రిత్వ శాఖలో ముఖ్య ఆర్థిక సలహాదారుగా నియమితులయ్యారు. 1976 వరకు ఆ పదవిలో ఉన్నారు.

1976-1980 మధ్య మన్మోహన్ సింగ్ సింగ్ అనేక కీలక పదవులు చేపట్టారు. వీటిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) డైరెక్టర్‌గా, ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ డైరెక్టర్‌గా, మనీలాలోని ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌లో భారతదేశానికి ప్రత్యామ్నాయ గవర్నర్, ఆల్టర్నేట్‌గా ఉన్నారు. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్‌స్ట్రక్షన్ అండ్ డెవలప్‌మెంట్(IBRD) బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌లో భారతదేశానికి గవర్నర్‌గా.. అలాగే ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా.. అటామిక్ ఎనర్జీ కమిషన్, స్పేస్ కమిషన్ రెండింటిలోనూ సభ్యుడు(ఫైనాన్స్) గా కూడా పదవులు చేపట్టారు.

1991లో రాజ్యసభ సభ్యునిగా ఎన్నుకోబడి, పీవీ నరసింహరావు కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా పనిచేసి, భారత ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా గుర్తింపు పొందారు. దేశం ఆర్థిక చిక్కుల్లో ఉన్న ఆ సమయంలో ఆర్థిక సంస్కరణలు అమలు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇక 2004లో నాటి యూపీఏ ప్రభుత్వ హయాంలో మన్మోహన్ సింగ్ దేశ ప్రధానిగా బాధ్యతలు చేట్టారు. దాదాపు దశాబ్దం పాటు ఆయన ఆ పదవిలో కొనసాగారు. మే 22, 2004న ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సింగ్.. మే 26, 2014 వరకు వరుసగా రెండు పర్యాయాలు ఆ పదవిలో బాధ్యతలు చేపట్టారు. మొత్తం 3,656 రోజుల పాటు కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్(UPA) ప్రభుత్వానికి నాయకత్వం వహించి, అత్యధిక కాలం పనిచేసిన మూడో ప్రధానిగా నిలిచారు.

Read More..

Manmohan singh : మన్మోహన్ సింగ్ కన్నుమూత.. ఢిల్లీ బయల్దేరిన కాంగ్రెస్ అగ్రనేతలు

Advertisement

Next Story

Most Viewed