గురుకులాల్లో కోడింగ్ కోర్సులు.. ఆర్పీఎఫ్–యూకే ఫౌండేషన్ తో అగ్రిమెంట్

by Mahesh |
గురుకులాల్లో కోడింగ్ కోర్సులు.. ఆర్పీఎఫ్–యూకే ఫౌండేషన్ తో అగ్రిమెంట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఏ రంగంలో రాణించాలన్న సాంకేతిక నైపుణ్యం అనేది కీలకం. దీంతో పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు చదువుతోపాటు సాంకేతిక విద్యను అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. గురుకులాల్లో చదువుతున్న స్టూడెంట్స్ కోసం కోడింగ్ కోర్సులను అందుబాటులోకి తీసుకు వస్తుంది. ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు కోడింగ్ పై ట్రైనింగ్ ఇచ్చేందుకు అంతా సిద్ధం చేసింది. ప్రస్తుత విద్యా సంవత్సరం ఒకే చోట దీన్ని అమలు చేయగా.. రానున్న విద్యా సంవత్సరం నుంచి రెండు వందలకు పైగా పాఠశాలల్లో దీన్ని విస్తరించనుంది. ఇందుకోసం ఆర్పీఎఫ్–యూకే ఫౌండేషన్ తో ప్రభుత్వం ఐదేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నది.

238 స్కూళ్లలో ట్రెయినింగ్..

ప్రస్తుత విద్యా సంవత్సరంలో కేవలం ఒక్క మొయినాబాద్ పాఠశాలలో మాత్రమే విద్యార్థులకు కోడింగ్ శిక్షణ ఇచ్చారు. 2025 -26 విద్యా సంవత్సరం నుంచి 238 గురుకుల పాఠశాలల్లో దీన్ని విస్తరించనున్నారు. ఇందుకోసం లండన్ కు చెందిన ఆర్పీఎఫ్ (రాస్పాబెరీ పీఐ ఫౌండేషన్)తో ఐదేళ్లకు గురుకుల సంస్థ ఒప్పందం కుదుర్చుకున్నది. దీనిలో భాగంగా విద్యార్థులకు కావాల్సిన నైపుణ్య శిక్షణ, పాఠ్య ప్రణాళిక, కార్యాచరణ, పర్యవేక్షణ, భోధన వంటి అంశాలలో ఫౌండేషన్ వారి సారథ్యంలో ఈ శిక్షణ కొనసాగనున్నది.

రెగ్యులర్ సబ్జెక్టుగా..

గురుకులాల్లో ఏఐ, కోడింగ్, మెషీన్‌ లెర్నింగ్, రోబోటిక్స్ వంటి అంశాలను బోధించేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందుకోసం పైలట్ ప్రాజెక్టుగా ప్రతి పాఠశాలలో ఐదుగురు విద్యార్థులను ఎంపిక చేసి ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ఫలితాలు మెరుగ్గా రావడంతో ఆర్పీఎఫ్ ఫౌండేషన్ ద్వారా రానున్న విద్యా సంవత్సరం నుంచి కంప్యూటింగ్ పాఠ్యాంశాలను రెగ్యులర్ సబ్జెక్టుగా ప్రవేశపెట్టనున్నారు. విద్యార్థులకు రెండు గంటలు ప్రాజెక్ట్ వర్క్ చేయిస్తారు. ఆర్పీఎఫ్ ఫౌండేషన్ రూపొందించిన అంతర్జాతీయ పాఠ్యాంశాల ప్రకారం విద్యార్థులకు పుస్తకాలను అందజేయనున్నారు. దీని ద్వారా 1.50 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. కాగా, కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు. కోడింగ్, ఏ ఐ అండ్ ఎంఎల్ శిక్షణతో పాటు ప్రతి ఏడాది దాదాపు 250 మంది విద్యార్థులు ఒక లైవ్ ప్రాజెక్టులో పని చేసే అవకాశాన్ని పొందనున్నారు. విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించడం గురుకుల చరిత్రలోనే మొట్టమొదటి సారి కావడం విశేషం.

స్టూడెంట్స్‌కు కోడింగ్ మెంటార్స్ గా శిక్షణ

ఇప్పటికే రాష్ట్రంలోని 238 ఇనిస్టిట్యూట్స్ లో మొత్తం 1,190 మంది విద్యార్థులకు కోడింగ్ మెంటార్స్ గా శిక్షణ ఇచ్చారు. ఇక ప్రతి ఒక్క మెంటార్ మరో 15 మందికి శిక్షణ ఇవ్వనున్నారు. ఈ తరహాలో పిల్లలకు కోడింగ్ సాంకేతిక విద్యను అందించడం గురుకుల చరిత్రలోనే మొట్టమొదటిసారిగా. ఈ కోడింగ్ శిక్షణ, బోధనకు తగ్గట్లు పాఠశాలల్లో అత్యాధునిక కంప్యూటర్ లేబొరెటరీలను అందుబాటులోకి తెస్తున్నట్లు టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ కార్యదర్శి డాక్టర్ వీఎస్ అలుగు వర్షిణి తెలిపారు.



Next Story

Most Viewed