శ్మశాన‌వాటికను కబ్జా చేసి చెత్త డంపింగ్ ఏర్పాటు.. హైడ్రాకు ఫిర్యాదు

by D.Reddy |   ( Updated:2025-04-09 06:08:15.0  )
శ్మశాన‌వాటికను కబ్జా చేసి చెత్త డంపింగ్ ఏర్పాటు.. హైడ్రాకు ఫిర్యాదు
X

దిశ, తెలంగాణ బ్యూరో/అల్వాల్ : అల్వాల్ మండలం మచ్చ బొల్లారంలోని మోతుకుల కుంట చెరువుకు చేరువుగా ఉన్న హిందూ స్మశాన‌వాటికను రాంకీ సంస్థ కబ్జా చేసినట్టు హైడ్రా గుర్తించింది. అందులో భాగంగానే మంగ‌ళ‌వారం హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌ పరిశీలించారు. హిందూ స్మశాన‌వాటిక‌ను రాంకీ సంస్థ క‌బ్జా చేసి చెత్త డంపింగ్ చేయ‌డంతో పరిసరాలు దుర్గంధబరితంగా మారాయని మ‌చ్చబొల్లారం రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేష‌న్ జాయింట్ యాక్షన్ క‌మిటీ హైడ్రాకు ఫిర్యాదు చేసిన నేప‌థ్యంలో హైడ్రా క‌మిష‌న‌ర్ క్షేత్రస్థాయిలో ప‌ర్యటించారు.

స‌ర్వే నంబ‌ర్ 199లో మొత్తం 15.19 ఎక‌రాల స్థలాన్ని హిందూ స్మశాన‌వాటిక‌కు కేటాయించ‌గా ఆ స్థలంలో రాంకీ సంస్థ చెత్త డంపింగ్ చేయ‌డాన్ని, అనుమ‌తులు లేకుండా చేప‌ట్టిన నిర్మాణాల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ ప‌రిశీలించారు. ఇదే విషయంపై స్థానిక ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్, ఎమ్మెల్యే రాజ‌శేఖ‌ర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంప‌ల్లి హ‌నుమంత‌రావు నుంచి ఫిర్యాదులు అందిన‌ నేప‌థ్యంలో ఈ సమస్యను పరిశీలించి, పరిష్కార మార్గాలు చూపాల‌ని తనతో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, మంత్రి శ్రీధర్ బాబు చెప్పారని రంగనాథ్ మీడియాకు తెలిపారు. రాంకీ సంస్థకు రెండు ఎక‌రాల స్థలం కేటాయించిన‌ట్టు త‌మ దృష్టికి వ‌చ్చింద‌ని, అయితే ఇక్కడున్న ప్రభుత్వ భూమి మూడు, నాలుగు ఎక‌రాల వ‌ర‌కూ ఆక్రమించి నిర్మాణాలు చేప‌డుతున్నట్టు వ‌చ్చిన ఫిర్యాదుల‌ను ప‌రిశీలించామని చెప్పారు.

నిర్మాణాలు ఆపాలి: హైడ్రా

త‌క్షణ‌మే నిర్మాణాల‌ను ఆపేయాల‌ని రాంకీ సంస్థను ఆదేశించినట్టు రంగనాథ్ తెలిపారు. ప్రభుత్వ భూమి కబ్జా కాకుండా చూస్తామన్నారు. చెత్త డంపింగ్ యార్డును త‌ర‌లించాల‌ని స్థానికులు చేస్తున్న ప్రతిపాద‌న‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామ‌ని క‌మిష‌న‌ర్ చెప్పడంతో స్థానికులు హ‌ర్షం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, ఉదయ్ కుమార్, సుధాకర్, వీరేందర్ రావు, డోలి రమేశ్, అనిల్ కిషోర్ గౌడ్, ఢిల్లీ పరమేశ్, పవన్, అజయ్ రెడ్డి, మాచర్ల శ్రీనివాస్, మోయి సుజాత పాల్గొన్నారు.


Next Story