Congress: ఈ అంశాలను కూడా చేర్చండి.. ఎంపీ శశిథరూర్‌కు ఐఏఎస్ అధికారి రిక్వెస్ట్

by Ramesh Goud |
Congress: ఈ అంశాలను కూడా చేర్చండి.. ఎంపీ శశిథరూర్‌కు ఐఏఎస్ అధికారి రిక్వెస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: పరిమిత పని గంటలతో పాటు ఆమోదయోగ్యమైన భాషను మాట్లాడే ప్రోటోకాల్ లను కూడా చేర్చాలని ఐఏఎస్ స్మితా సబర్వాల్ అన్నారు. పని ఒత్తిడితో మరణించిన అన్నా సెబాస్టియన్ అనే ఉద్యోగి పట్ల కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ పరిమిత పని గంటలపై పార్లమెంట్ సమావేశాల్లో చర్చకు లేవనెత్తుతామని చెప్పారు. దీనికి తెలంగాణ విభాగానికి చెందిన ఐఏఎస్ స్మితా సబర్వాల్ రిప్లై ఇస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో సర్, దయచేసి ఆమోదయోగ్యమైన భాష విషయంలో కూడా ప్రోటోకాల్‌లను పాటించే అంశాలను చేర్చండి అని కోరారు. అలాగే అధికార శ్రేణిలో అసమతుల్యత కారణంగా.. కొన్ని వేధింపులు భావోద్వేగంగా ఉండవచ్చని, ఉద్యోగులను ఆత్మహత్య ఆలోచలకు గురిచేసే దుర్మార్గపు ఉన్నతాధికారులను చూడటం సర్వసాధారణం అయ్యిందని తెలిపారు. అంతేగాక ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారులలో ఇది మరింత సాధారణంగా మారిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాగా శశిథరూర్ ట్విట్టర్ లో.. ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌లో రోజుకు 14 గంటల చొప్పున తీవ్ర ఒత్తిడి మధ్య నాలుగు నెలలపాటు పని చేసిన అన్నా సెబాస్టియన్ గుండెపోటుతో మరణించిందని, ఆమె తండ్రి సిబి జోసెఫ్‌ని పరామర్శించడానికి వెళ్లినప్పుడు తీవ్ర భావోద్వేగంతో కూడిన హృదయ విదారక సంభాషణ జరిగిందని తెలిపారు. ఆ సమయంలో అతడు సూచించిన ఆలోచన తనకు ఆమోదయోగ్యంగా అనిపించిందని అన్నారు. ఈ సందర్భంగా ప్రైవేట్, పబ్లిక్ రంగాల్లోని అన్ని కార్యాలయాల్లో రోజుకు ఎనిమిది గంటలు, వారానికి ఐదు రోజుల చొప్పున వారంలో 40 గంటలు మాత్రమే పని సమయాలు ఉండేలా స్థిరమైన క్యాలెండర్‌ను చట్టబద్ధం చేసే అంశాన్ని తాను లేవనెత్తాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అలాగే కార్యాలయంలో అమానవీయత చట్టబద్ధం చేయబడాలని, నేరస్థులకు కఠినమైన శిక్షలు, జరిమానాలు విధించబడాలని, పని ప్రదేశాల్లో మానవ హక్కులకు విఘాతం కలిగించకూడదని చెప్పారు. ఇక ఈ అంశాన్ని వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో తొలి అవకాశంలోనే లేవనెత్తుతామని కాంగ్రెస్ ఎంపీ స్పష్టం చేశారు.

Next Story

Most Viewed