తహశీల్దార్ల ఎన్నికల బదిలీలు వెంటనే చేపట్టాలి: మంత్రి పొంగులేటిని కోరిన ట్రెసా

by Shiva |
తహశీల్దార్ల ఎన్నికల బదిలీలు వెంటనే చేపట్టాలి: మంత్రి పొంగులేటిని కోరిన ట్రెసా
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో తహశీల్దార్ల ఎన్నికల బదిలీలు వెంటనే చేపట్టకపోవడం వల్ల ఉద్యోగులు కుటుంబాలకు దూరమై తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చింది. శనివారం సచివాలయంలో మంత్రితో జరిగిన సమావేశంలో ట్రెసా అధ్యక్ష, కార్యదర్శులు వంగ రవీందర్‌రెడ్డి, కే.రామకృష్ణ నేతృత్వంలో బృందం పలు డిమాండ్లను మంత్రి ముందు పెట్టింది. గ్రామ స్థాయిలో ఒక రెవెన్యూ అధికారిని నియమించాలని, వీఆర్వోల ద్వారా భర్తీ చేయాలని విన్నవించారు. నూతన మండలాలకు, డివిజన్ కార్యాలయాలకు కేడర్ స్ట్రెంత్ మంజూరు చేయకపోవడం వల్ల చాలాకాలంగా వారికి జీతాలు రాక ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తు చేశారు.

రెవెన్యూ ఉద్యోగులకు చట్టాలు, నిబంధనలపై అవగాహన పెంపొందించుకునేందుకు రెవెన్యూ అకాడమీని ఏర్పాటు చేయాలని కోరారు. ధరణి కంప్యూటర్ ఆపరేటర్లను రెగ్యులరైజ్ చేయాలన్నారు. జీవో నెం.317తో బ‌దిలీ అయిన అన్ని కేడర్లను ఉద్యోగులను సొంత జిల్లాలకు బదిలీ చేయాలని కోరారు. ఇతర శాఖలకు పంపిన వీఆర్వో, వీఆర్ఏలను తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకోవాలని అన్నారు. ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్, తహశీల్దార్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయకుండా పోలీసు శాఖకు ఆదేశాలు జారీ చేయాలని తెలిపారు. తహశీల్దార్ల ఎన్నికల బదిలీలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.గౌతమ్ కుమార్‌లతో పాటు అసోసియేట్ అధ్యక్షుడు రాజ్‌కుమార్, ఉపాధ్యక్షులు బాణాల రాంరెడ్డి, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు రమణ్‌రెడ్డి, మేడ్చల్ జిల్లా కార్యదర్శి వంగ రామకృష్ణారెడ్డి, దాదేమియా, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed