Special Story: అపచారమా.. కుంభకోణమా? లడ్డూ ప్రసాదంలో కల్తీపై అనుమానాలు

by Shiva |
Special Story: అపచారమా.. కుంభకోణమా? లడ్డూ ప్రసాదంలో కల్తీపై అనుమానాలు
X

ప్రపంచ వ్యాప్తంగా తిరుమల ఆలయానికి ఎంతో విశిష్టత ఉన్నది. ఆలయంలో నిర్వహించే ప్రతి కార్యక్రమం ఆగమశాస్త్ర నియమాల ప్రకారమే జరుగుతాయని భక్తుల విశ్వాసం. స్వామివారిపై భక్తులకు ఎంత విశ్వాసమో.. లడ్డూ ప్రసాదంపై అంతే ప్రీతి. నోరూరించే రుచి మాత్రమే కాదు.. అందులోని వాడే పదార్థాలు.. వాటి కొలతలు అన్నీ ప్రత్యేకమే. దశాబ్దాలుగా ఆ లడ్డూ పరిణామం మారుతున్నదే తప్ప.. రుచి మారదని భక్తుల నమ్మకం. ఇప్పుడు ఆ నమ్మకాన్నే దెబ్బతీయడాన్ని భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. తాము స్వామివారం ప్రసాదంగా కళ్లకద్దుకుని ఎంతో ఇష్టంతో తినే లడ్డులో జంతుకొవ్వులు కలిశాయన్న నివేదికలు భక్తులను ఉలిక్కిపడేలా చేశాయి.

స్వామి వారి సేవలో వీసమెత్తు తేడా రాకుండా చూడాల్సిన టీటీడీ బోర్డు.. స్వామివారికి నైవేద్యంగా ఇచ్చే లడ్డు కల్తీ అవుతున్నా ఎందుకు మౌనంగా ఉన్నదని భక్తులు నిలదీస్తున్నారు. వైసీపీ హయాంలో లడ్డూ తయారీ కోసం జంతు కొవ్వు వినియోగించారని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వివాదం రేపాయి. లడ్డూ కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్టు నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డ్‌ ఆఫ్‌ గుజరాత్‌ (ఎన్‌డీడీబీజీ) సీఏఎల్‌ఎఫ్‌ ల్యాబ్‌ కూడా నిర్ధారించడం తిరుమలలోనే కాదు యావత్ దేశంలోనే కలకలం సృష్టించింది. ఈ ఏడాది జూలైలో లడ్డూను ల్యాబ్‌కు పంపగా, అదే నెల 17న నివేదిక వచ్చిందని.. అందులో ఆవు నెయ్యిలో సోయాబీన్‌, పొద్దు తిరుగుడు, ఆలివ్‌, గోధుమ బీన్‌, మకజొన్న, పత్తి గింజలతోపాటు చేపనూనె, జంతుకొవ్వు, పామాయిల్‌, పంది కొవ్వు కలిశాయని తేలడంతో భక్తులు మండిపడ్డుతున్నారు. అసలు తిరుమల లడ్డు ప్రసాదంలో జరిగిన కల్తీ స్కామా? అనుకోకుండా జరిగిన అపచారమా? స్వామివారి భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసేలా చోటుచేసుకున్న ఈ ఘటనపై సమగ్ర కథనం. - అనిల్ శిఖా

విషయం ఎలా వెలుగుచూసింది?

ఆలయానికి వివిధ వస్తువులు సరఫరా చేసే కాంట్రాక్టర్లతో ఈవో శ్యామలరావు భేటీ అయిన సందర్భంలో ఆవు నెయ్యి కిలో ఎంతకు ఇస్తున్నారు? అనే చర్చ వచ్చింది. కాంట్రాక్టర్లు కిలో నెయ్యి రూ. 320 నుంచి రూ.424 మధ్య సరఫరా చేస్తున్నట్టు తెలియడంతో ఇంత తక్కువ ధరకు నెయ్యి సరఫరా చేయడం ఎలా సాధ్యమని సమావేశంలో ప్రశ్నలు తలెత్తాయి. వెంటనే ఆయన తిరుమలకు చేరుకున్న నెయ్యి ట్యాంకర్లను గుజరాత్ లోని ఆనంద్ పట్టణంలో ఉన్న జాతీయస్థాయిలో గుర్తింపు ఉన్న ప్రభుత్వ ఎన్‌డీడీబీ (నేషనల్‌ డైరీ డెవలప్‌మెంట్‌ బోర్డు) ల్యాబ్‌కు జూలై 6న రెండు, జూలై 12 న మరో రెండు ట్యాంకర్ల శాంపిళ్లను పంపారు. వారి నుంచి వచ్చిన నివేదికల్లో నెయ్యి సరఫరా చేస్తున్న ఐదు సంస్థల్లో ఏఆర్‌ ఫుడ్స్‌ కంపెనీ ప్రమాణాలు పాటించడంలేదని.. వారు సరఫరా చేస్తున్న నెయ్యిలో జంతువుల కొవ్వును కలిసినట్టు నివేదిక వచ్చింది.

ఆరోజు నుంచి ఈ విషయమై అంతర్గతంగా విచారణ కొనసాగుతూనే ఉన్నది. నాణ్యత ప్రమాణాలు లేవని తేలడంతో వెంటనే ఆ సంస్థ టెండర్లకు కూడా టీటీడీ రద్దు చేసింది. గత ప్రభుత్వ హయాంలో ఈ వ్యవహారాన్ని చూసీచూడనట్టు ఎందుకు వదిలేశారన్నది భక్తులు ప్రశ్నిస్తున్నారు. టీటీడీకి సొంత ల్యాబ్‌ లేకపోవడంతో సరఫరాదారుల నుంచి వచ్చిన నెయ్యిని పరీక్షించే అవకాశమే లేకుండా పోయింది. సరిగ్గా ఈ అంశమే సరఫరాదారులకు వరంగా మారింది. అయితే, తాజాగా ఈ అంశంపై ఈవో శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడంతో ప్రస్తుతం నాణ్యమైన లడ్డూ భక్తులకు అందుతుందని స్పష్టం చేశారు. నెయ్యి నాణ్యతను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి అడల్ట్రీ ల్యాబ్‌ టెస్ట్‌ ఇక్విప్‌మెంట్‌ను విరాళంగా ఇచ్చేందుకు ఎన్‌డీడీబీ ముందుకు వచ్చిందని తెలిపారు. ఈ మేరకు విదేశాల నుంచి సంబంధిత యంత్రాలు రావాల్సి ఉందన్నారు.

కల్తీ నెయ్యి సరఫరాలో దోషి.. ఏఆర్

లడ్డూ ప్రసాదంలో నెలకు దాదాపుగా 42వేల కిలోల నెయ్యి వాడతారు. ఈ నెయ్యిని సరఫరా చేసే కంట్రాక్టు పొందిన ఐదు కంపెనీల్లో ఏఆర్ డెయిరీ ప్రొడక్ట్స్ ఒకటి. ఈ కంపెనీ సరఫరా చేసిన నెయ్యిలోనే జంతు కొవ్వులు ఉన్నాయని ల్యాబ్ టెస్ట్ లో తేలింది. ఇది తమిళనాడులో ఉండగా.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీటీడీకి అత్యధికంగా నెయ్యి సరఫరా చేసింది. ఈ కంపెనీ బటర్ ఆయిల్‌ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుని నెయ్యిగా మార్చి ఆలయ పోటుకు సరఫరా చేసేదని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన టెండర్లలో కేజీ నెయ్యి రూ. 610 కిగానూ.. రివర్స్ టెండర్లలో రూ.424కి మాత్రమే సరఫరా చేస్తామని ఆ కంపెనీ అంగీకరించింది.

అంటే కేజీకి రూ.190కిపైగా తగ్గింపు ఇచ్చి టెండర్లు పొందిందనమాట. ఈ సంస్థకు టీటీడీకి నెయ్యి సరఫరా చేసేంత సామర్థ్యం లేదని అతి తక్కువ ధరకు టెండర్లు తీసుకుని కల్తీ నెయ్యిని సరఫరా చేసిందని వాదనలు వినిపిస్తు్న్నాయి. 2022లో టెండర్లలో రూ. 414 కు కోట్ చేసి.. రివర్స్ టెండర్లలో రూ. 337 కు దక్కించుకున్నట్లు రికార్డుల్లో స్పష్టంగా ఉన్నది. దీంతో ఏఆర్ డైరీ చుట్టూ వివాదం అల్లుకుంది. మరోవైపు స్వామివారి నిత్య కైంకర్యాల కోసం ప్రతిరోజు 60 కేజీల స్వచ్ఛమైన ఆవు నెయ్యిని వాడాల్సి ఉంటుంది. దీనిని ప్రత్యేకంగా గుజరాత్ రాష్ట్రంలోని గోశాలలనుంచి రూ.లక్ష వ్యయంతో కొనుగోలు చేస్తున్నట్లు టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి మీడియాకు వెల్లడించారు. ఆ నెయ్యి కేజీ రూ.1600కుపైగా ధర ఉన్నప్పుడు లడ్డూ ప్రసాదానికి వాడే నెయ్యి రూ.320 నుంచి రూ.424 మధ్య ఎలా వస్తుందన్న అంశంపై మాత్రం క్లారిటీ రావడం లేదు.

2021 మార్చి వరకు టీటీడీకి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్‌కు చెందిన నందిని బ్రాండ్ నెయ్యి సరఫరా అయ్యేది. 2021 మార్చి లో జరిగిన టెండర్లలో ఎల్-3 గా నిలిచింది. అయినా కూడా ఎల్​-1, ఎల్​-2 అనుమతితో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ తిరుమలకు అవసరైన నెయ్యిలో కేవలం 20 శాతం సప్లై చేసింది. యూపీకి చెందిన ప్రీమియర్ ఎల్-1 గా, ఎల్-2గా ఆల్ఫా కంపెనీలు నెయ్యి సరఫరా చేసేందుకు అర్హత పొందగా కేజీ నెయ్యి రూ. 424 లు ప్రకారం టీటీడీకి సప్లై చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే ఈ ధరకు తమకు గిట్టుబాటు కాదంటూ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్‌ టెండర్ ప్రక్రియలోనే పాల్గొనలేదు. టీటీడీకి నాణ్యమైన నెయ్యిని అంత తక్కువ ధరకు సరఫరా చేయలేమని ఫెడరేషన్‌ తేల్చి చెప్పింది. దీంతో తక్కువ ధరకు నాసిరకం నెయ్యి కొనుగోలు చేస్తుందంటూ టీటీడీపై నాడే ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఏఆర్​ డెయిరీ వివరణ

తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి సరఫరా చేశారనే ఆరోపణలపై ఏఆర్ డెయిరీ స్పందించింది. నాణ్యత నిర్ధారణ పరీక్షల తర్వాతే టీటీడీకి నెయ్యిని సరఫరా చేశామని తెలిపింది. తాము సరఫరా చేసిన నెయ్యిలో ఎలాంటి కల్తీ, నాణ్యతా లోపం లేదని స్పష్టం చేసింది. జూన్, జులై నెలల్లోనే నెయ్యి సరఫరా చేశామన్న ఏఆర్ డెయిరీ.. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యిని సరఫరా చేయడం లేదని పేర్కొన్నది.

తిరుమలకు సరఫరా చేసిన నెయ్యిలో ఉన్న విలువలు.. ఉండాల్సిన విలువలు

ఎస్ వాల్యూ ఉండాల్సిన మోతాదు

1 86.62 98.05 - 101.95

2 106.89 99.42 - 100.58

3 22.43 95.90 - 104.10

4 117.42 97.96 - 102.04

5 19.72 95.68 - 104.32

ల్యాబ్ ​రిపోర్టులో సంచలన విషయాలు

నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు ఎన్‌డీడీబీ(నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డు ల్యాబొరేటరీ) ల్యాబ్ నిర్ధారించింది. ఈ ల్యాబ్ గుజరాత్‌లోని ఆనంద్‌లో ఉంది జూలై 8న శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించగా జూలై 17న ఎన్డీడీబీ సీఏఎల్‌ఎఫ్ ల్యాబ్ నివేదిక ఇచ్చింది. తిరుమలలో ఉపయోగించిన నెయ్యికి సంబంధించి ఈ ల్యాబ్ పంపించిన టెస్టు రిపోర్టులో నెయ్యి కల్తీ అయినట్లు తేలింది. నాణ్యమైన నెయ్యి ఎస్ వాల్యూ 95.68 నుంచి 104.32 మధ్య ఉండగా.. ఒక శాంపిల్ నెయ్యి ఎస్ వాల్యూ 19.72గా వచ్చింది. సోయాబీన్, సన్‌ఫ్లవర్, ఆలివ్, ర్యాప్‌సీడ్, లిన్‌సీడ్, గోధుమ జెర్మ్, మొక్కజొన్న జెర్మ్, పత్తి గింజలు, ఫిష్ ఆయిల్, కొబ్బరి, పామ్ కెర్నాల్ ఫ్యాట్, పామ్ ఆయిల్, బీఫ్ టాలో, లార్డ్ (Lard) లాంటి పదార్థాలతో నెయ్యిని, నూనెలను కల్తీ చేసేందుకు ఆస్కారం ఉందని ఎన్‌డీడీబీ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ జాబితాలో ఫిష్ ఆయిల్, బీఫ్ టాలో, లార్డ్ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. బీఫ్ టాలో అనేది గొడ్డు మాంసం నుంచి తయారు చేసే పదార్థం కాగా.. లార్డ్ అనేది పందులు, ఇతర జంతువుల కొవ్వుల నుంచి తయారుచేసే పదార్థం కావడం భక్తులు జీర్ణించుకోలేని అంశంగా మారింది.

మండిపడుతున్న అర్చకులు

గతంలో ఎన్నో సార్లు తిరుమలలో ప్రసాదాల నాణ్యత పైన టీటీడీ చైర్మన్‌తో పాటు, ఈవో దృష్టికి తీసుకువెళ్లానని కానీ ఎలాంటి ప్రయోజనం లేదని టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న వారు లేరన్నారు. పవిత్రమైన ఆవు నెయ్యిని కల్తీ చేసి శ్రీవారి ప్రసాదాలలో వినియోగించడం దారుణమైన అపచారమని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఐదు సంవత్సరాలు నిరభ్యంతరంగా ఈ మహా పాపం జరిగిపోయిందన్నారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అయోధ్య రామ మందిరం ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ డిమాండ్ చేశారు. చేప నూనె, జంతువుల కొవ్వు తిరుమల లడ్డూల తయారీలో కలిసినట్లు నివేదికల్లో రావడం.. సనాతన ధర్మంపై జరిగిన కుట్ర అని ఆరోపించారు. ఈ కుట్ర దేశం లోపల జరిగిందా? బయటిశక్తులు ఏమైనా ఉన్నాయా? అన్నది తేల్చాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. టీటీడీ లడ్డూ ప్రసాదంలో పశువుల కళేబరాల నూనె వాడి అపవిత్రం చేయడం సహించరాని విషయమని చిలుకూరు బాలాజీ ఆలయన ప్రధాన అర్చకులు రంగరాజన్ అన్నారు. లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిపుణులతో కమిటీ వేసి నిజనిజాలు తేల్చాలని ప్రభుత్వాలను కోరారు.

లడ్డూ ప్రసాదం చరిత్ర ఇలా..

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామికి నైవేద్య ప్రియుడు అనే పేరుంది. అందుకే ఆయన పలు ప్రసాదలను సమర్పిస్తారు. స్వామివారికి ఎన్ని ప్రసాదాలు సమర్పించినా లడ్డూకు ఉన్న ప్రాధాన్యత వేరు. స్వామివారికి ప్రియమైన నైవేద్యంగానూ., భక్తులకు అత్యంత ప్రీతికరమైన ప్రసాదంగానూ లడ్డూలు ప్రాచుర్యం పొందాయి. 1803 నుంచి శ్రీవారి ఆలయంలో అప్పటి మద్రాసు ప్రభుత్వం శ్రీవారి ఆలయంలో ప్రసాదాలు విక్రయించడం ప్రారంభించినట్లు చరిత్ర చెబుతోంది. ఇలా అనేక విధాలుగా మారుతూ వచ్చిన ప్రసాదాల స్వరూపం చివరకు 1940లో తిరుపతి లడ్డూగా స్థిరపడింది. మొదట్లో ధర కూడా ఎనిమిది అణాలే ఉండేది. అలా లడ్డూలు 2, 5, 10, 15 రూపాయల నుంచి 25 రూపాయలకు ప్రస్తుతం ఒక్కో లడ్డును రూ. 50కి టీటీడీ విక్రయిస్తున్నది.

తిరుపతి లడ్డూకు పేటెంట్​

'తిరుపతి లడ్డు'కు భౌగోళిక కాపీరైట్ (పేటెంట్) హక్కు కూడా లభించింది. దీని వలన తిరుమలలో తయారయ్యే లడ్డు ప్రసాదంపై తిరుమల తిరుపతి దేవస్థానానికి పూర్తి హక్కులు సంక్రమిస్తాయి. దీనివల్ల ఇలాంటి లడ్డును తయారుచేయడానికి గాని, దాని పేరును వినియోగించుకునేందుకు కాని ఇతరులకు ఎలాంటి అవకాశం ఉండదు. ఈ భౌగోళిక హక్కు కోసం తిరుమల తిరుపతి దేవస్థానం జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ చైన్నైలోని కార్యాలయంలో దరఖాస్తు చేసింది. దానిని పరిశీలించిన కార్యాలయం భౌగోళిక కాపీరైట్ ను నిర్ధారిస్తూ ధ్రువీకర పత్రాన్ని జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ కార్యాలయానికి చెందిన అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆఫ్ ట్రేడ్ మార్క్ జీఎల్ వర్మ టీటీడీ అధికారులకు అందజేశారు.

పోటు(లడ్డూ తయారీ శాల)

తిరుమల ఆలయంలో వాస్తు ప్రకారం ఆగ్నేయంగా ఆలయంలో నిర్మించినచోట పోటు ప్రసాదాలు తయారుచేస్తారు. తయారైన ప్రసాదాలను శ్రీనివాసుని తల్లి వకుళమాత విగ్రహం వద్దకు తీసుకెళ్తారు. అక్కడ ఆమె ముందు ఉంచిన తర్వాత స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీ. లడ్డు, వడలు మొదలైన పనియారాలు ఆలయంలో సంపంగి ప్రాకారం ఉత్తరభాగాన తయారుచేస్తారు. వాటిని కూడా తల్లికి చూపించాకే స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు.

దిట్టం

శ్రీవారి ఆలయంలో లడ్డూల తయారీకి వాడవలసిన సరుకుల మోతాదును ‘దిట్టం’ అంటారు. దీనిని తొలిసారిగా టీటీడీ పాలక మండలి 1950 లో నిర్ణయించింది. పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా దిట్టాన్ని పెంచుతూ వచ్చారు. ప్రస్తుతం 2001లో సవరించిన దిట్టాన్ని అనుసరిస్తున్నారు. దీనినే పడితరం దిట్టం స్కేలు అని పిలుస్తున్నారు. పడి అంటే 51 వస్తువులు. పడికి కావలసిన వస్తువుల దిట్టం ఉంటుంది. ఆ ప్రకారం ఉగ్రాణం (శ్రీవారి స్టోర్) నుంచి వస్తువులు ఇస్తారు. దీని ప్రకారం ఒకసారి 5100 లడ్డూలు మాత్రమే తయారుచేయడానికి కావాల్సిన దిట్టాన్ని అనుసరిస్తారు.

Next Story

Most Viewed