పంచాయతీ అనుమతి లేఅవుట్లపై గత సర్కారు పేచీ.. ఇల్లీగల్ సేల్స్‌తో ‘ఇన్కమ్ లాస్’!

by Rajesh |
పంచాయతీ అనుమతి లేఅవుట్లపై గత సర్కారు పేచీ.. ఇల్లీగల్ సేల్స్‌తో ‘ఇన్కమ్ లాస్’!
X

దిశ, తెలంగాణ బ్యూరో: పంచాయతీ ఆఫీసర్లు, ప్రజాప్రతినిధుల సంతకాలతో పర్మిషన్ తీసుకొని ఏర్పాటు చేసిన లే అవుట్లను గత ప్రభుత్వం ఇల్లీగల్ అని ప్రకటించింది. అప్పటి సీఎస్ సోమేశ్ కుమార్ ఒక్క జీవో జారీ చేసి రిజిస్ట్రేషన్లను ఆపివేయించారు. దీంతో తమ ప్లాట్లు, లే అవుట్లను క్రమబద్ధీకరించాలంటూ లక్షలాది మంది దరఖాస్తు చేసుకోగా.. ఒకసారి రిజిస్ట్రేషన్ కు నోచుకున్న ప్లాట్లను సేల్ చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మిగతా వాటిని పెండింగులో ఉంచారు. దీంతో నాలుగేండ్ల నుంచి లక్షలాది మంది ఎన్నో ఇబ్బందులు పడుతుండగా.. ప్రభుత్వ ఆదాయానికీ గండిపడుతున్నది. మరోవైపు వీటికి సంబంధించి ఇల్లీగల్స్ సేల్స్ నడుస్తున్నట్లు తెలుస్తున్నది.

ఒకే వెంచర్‌లో డిఫరెంట్ ప్లాట్లు

అవే రోడ్లు, అదే డ్రైనేజీ.. కానీ గత సర్కారు హయాంలో విడుదలైన జీవోతో ఒకే వెంచర్ లో ప్లాట్లు రెండు రకాలుగా మారిపోయాయి. ఒకసారి అమ్మేసినవేమో లీగల్ గా.. అప్పటి వరకు అమ్ముడుపోనివేమో ఇల్లీగల్ మారాయి. దీంతో లక్షల్లో ప్లాట్లు రిజిస్ట్రేషన్లకు నోచుకోకుండా పోయాయి. రియల్ ఎస్టేట్ బూమ్ లో ఈ ప్లాట్లు కనీసం రెండు, మూడు సార్లు రీసేల్ అయి ఉండేవి. దీంతో ఖజానాకు వచ్చే స్టాంప్ డ్యూటీ రూపంలో వేల కోట్ల ఆదాయం వచ్చి ఉండేది. అయితే సోమేశ్ కుమార్ ఆదేశాలతో పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్లు నిలిచిపోలేదు. దొడ్డిదారిన కొందరు సబ్ రిజిస్ట్రార్లు మిగిలిన ప్లాట్లకు సేల్ డీడ్స్ చేశారు. కొందరు సస్పెన్షన్ కు కూడా గురయ్యారు.

ఎల్ఆర్ఎస్‌కు నో చాన్స్

ఒక్కసారి కూడా విక్రయించని ప్లాట్లపై ఇప్పటికీ పేచీ కొ నసాగుతున్నది. అటు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పరిశీలించకపోవడం, ఇటు ఆ ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు చేయకపోవడంతో అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టిన రియల్టర్లు, ప్లాట్ల యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి జిల్లాలో పంచాయతీ సెక్రెటరీ, సర్పంచుల సంతకాలతో చేపట్టిన వెంచర్లు లెక్కలేనన్ని ఉన్నాయి. ఆ సంతకాలు పెట్టిన ఉద్యోగులు, మాజీ సర్పంచులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు కానీ రూ.లక్షలు పోసి ప్లాట్లు చేసిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తమ ప్లాట్లు, లే అవుట్లను క్రమబద్ధీకరించాలని ఏకంగా 26.59 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. కనీసం వీటిని పరిశీలించి లెక్క తేలిస్తే ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుందని రియల్ ఎస్టేట్ వర్గాలు సూచిస్తున్నాయి.

కోర్టులో కేసుల నేపథ్యంలో దరఖాస్తుల పరిశీలనను నిలిపివేశారు. కానీ అదే ప్లాట్లకు 14.5 శాతం మార్కెట్ విలువ చెల్లిస్తే మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నారని రియల్టర్లు చెబుతున్నారు. ఎల్ఆర్ఎస్ కు చాన్స్ ఇవ్వకుండా, సేల్ డీడ్స్ చేయకుండా పెండింగులో ఉంచడం ద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నది. ఈ నిలుపుదలతో మిగిలిన ప్లాట్ల స్థలం తిరిగి హెచ్ఎండీఏ/డీటీసీపీ నుంచి అనుమతులు తీసుకునే చాన్స్ కూడా లేదు. అయితే ఈ అంశం తన దృష్టిలో ఉందని, త్వరలోనే పరిష్కారం చూపిస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఇటీవల మీడియాతో చెప్పడం గమనార్హం.

అమ్మకానికి కొత్తదారులు

పంచాయతీ లే అవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లను నిషేధించడంతో రియల్టర్లు, వారికి భూములను అమ్మిన రైతులు, ఆ ప్లాట్లు కొనేందుకు అగ్రిమెంట్లు కుదుర్చుకున్న వేలాది మంది కొత్తదారులు వెతుకుతున్నారు. అప్పటికే ఏండ్లు గడుస్తుండడంతో పెట్టుబడులకు వడ్డీలు కట్టలేక లాభాలు లేకపోయినా పెట్టుబడి వరకు వచ్చినా ఫర్వాలేదన్న ఆలోచనలో ఉన్నారు. ఈ క్రమంలోనే కొన్ని జిల్లాల్లో పంచాయతీ లేఅవుట్లను గుంటల లెక్కన సాగు భూములుగా అమ్మేశారని సమాచారం. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ వంటి ఉమ్మడి జిల్లాల్లోనూ మిగిలినపోయిన ప్లాట్లను సాగు భూములుగా తహశీల్దార్ల/జాయింట్ రిజిస్ట్రార్ల దగ్గర రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారని తెలిసింది. ఎలాగూ కొన్ని వెంచర్ల స్థలాలు రెవెన్యూ రికార్డుల్లో సాగు భూములుగానే ఉన్నాయి.

నాలా కన్వర్షన్ కాని భూముల వరకు సదరు రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు వచ్చాయి. ఈ క్రమంలో రియల్టర్లు, రైతుల మధ్య అమ్మకాల ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ప్లాట్లను అగ్రిమెంట్లు చేసుకున్న వారికి అదే స్థలాన్ని గుంటల లెక్కన విక్రయించినట్లు తెలిసింది. ఇప్పటికే పలు గ్రామాల్లో ఈ మేరకు దందాకు తెర తీశారు. అయితే ఈ ప్రక్రియలో ఎవరినీ తప్పు పట్టేటట్లు లేదు. ఎలాగూ గుంట భూమి కూడా రిజిస్ట్రేషన్ల చేసే సదుపాయం సాగు భూముల రిజిస్ట్రేషన్ల విధానంలోనే ఉంది. దీంతో స్లాట్ బుక్ చేసుకొని ప్లాట్లను గుంటల లెక్కన అమ్మేసి పట్టాదారు పాసు పుస్తకాలు పొందుతున్నారు. ప్లాట్ల కొనుగోలుదారుడు కూడా రైతుగా మారుతున్నాడు. ఆయనకూ రైతుబీమా వచ్చే చాన్స్ ఏర్పడింది.

దొడ్డిదారిన రిజిస్ట్రేషన్లు

మేడ్చల్ జిల్లా రాజబొల్లారంలో గోదావరి గ్రీన్ ఫామ్స్ పేరిట సర్వే నం.197, 198/అ, 198/ఆ, 198/ఇ, 198/ఈ, 202/ఈ, 202/రు, 256 ల్లో 69696 గజాల్లో లే అవుట్ వేశారు. అది కూడా గోదావరి గ్రీన్ ఫామ్స్ పేరిట ఉన్నది. ఫలానా ప్లాట్ 400 గజాలు. ప్రాపర్టీ విలువ రూ.8.40 లక్షలు మాత్రమే. దీనికి రెండువైపులా 30 ఫీట్ల రోడ్లు ఉన్నాయి. మరో రెండువైపులా ప్లాట్లు ఉన్నాయంటూ షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీలో పేర్కొన్నారు. గజం ధర మార్కెట్ విలువ రూ.2100. దాని ప్రకారం స్టాంపు డ్యూటీ చెల్లించారు. గోదావరి కన్ స్ట్రక్షన్ కంపెనీ తరపున మేనేజింగ్ పార్టనర్ తమ్మిశెట్టి నాగరాజు ప్లాట్లు అమ్మేస్తుంటే మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ సేల్ డీడ్స్ చేశారు. ఇందులో నాలా కన్వర్షన్ చేశారని పేర్కొన్నారు. ఇందులో ప్లాట్ల నంబర్లతో సహా ఉన్నది.

పైగా ఆటోమెటిక్ మ్యుటేషన్ కావడం వల్ల వ్యవసాయేతర ప్లాట్ గా రాజబొల్లారం గ్రామ పంచాయతీలో రికార్డుల ఎంట్రీ జరిగిపోతున్నది. దానికి అసెస్మెంట్ కూడా ఆటోమెటిక్ గా జనరేట్ అవుతున్నది. ఇలా ఒకటీ రెండు కాదు.. వందల్లో ట్రాన్సాక్షన్ పూర్తి చేశారు. ఇక్కడ మరి ప్లాట్లుగా అమ్మేస్తున్నారు కదా.. హెచ్ఎండీఏ, రెరా అనుమతులు ఏవి అన్న ప్రశ్నలేవీ సబ్ రిజిస్ట్రార్ నుంచి రావడం లేదు. నాలా కన్వర్షన్ చేసిన తర్వాత హెచ్ఎండీఏ, రెరా అనుమతులు లేకుండా, ప్లాట్ నంబరు వేసి రిజిస్ట్రేషన్ చేయడం చట్ట వ్యతిరేకం. దొడ్డిదారిన రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయనడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే.

ఖజానాకు గండి

-నారగోని ప్రవీణ్ కుమార్, అధ్యక్షుడు. తెలంగాణ రియల్టర్ల సంఘం

గత ప్రభుత్వం అడ్డగోలు జీవోలు జారీ చేసి కొన్ని ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై నిషేధం విధించడంతో ప్రభుత్వ ఖజానాకు నాలుగేండ్లుగా గండిపడుతున్నది. ఇకనైనా రిజిస్ట్రేషన్లు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులను కోరాం. ప్రతి జిల్లాలోనూ వేలాది మంది ఈ నిలుపుదల ద్వారా ఇబ్బందులు పడుతున్నారని చెప్పాం. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాం.



Next Story