- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IND VS AUS : పెర్త్‌లో పడేనా తొలి అడుగు.. నేటి నుంచి భారత్, ఆసిస్ తొలి టెస్టు షురూ
దిశ, స్పోర్ట్స్ : భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి వేళైంది. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా నేటి నుంచే తొలి మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌కు పెర్త్ వేదిక. ఈ సిరీస్ భారత్‌కు చాలా కీలకం. కివీస్ చేతిలో వైట్‌వాష్ నేపథ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ ఆశలు సంక్లిష్టమయ్యాయి. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ)2023-25 సర్కిల్‌లో టీమిండియాకు ఇదే చివరి సిరీస్. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకోవడానికి భారత్ ఉన్న ఏకైక మార్గం ఈ సిరీసే. ఐదు టెస్టుల సిరీస్‌ను 4 విజయాలు, ఒక్క డ్రాతో ముగిస్తేనే నేరుగా టైటిల్ పోరుకు అర్హత సాధించొచ్చు. ఒక్క మ్యాచ్ ఓడినా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిందే. కాబట్టి, ఈ సిరీస్‌లో ప్రతి మ్యాచ్ భారత జట్టుకు కీలకం. పెర్త్ మ్యాచ్‌లోనే భారత్ జైత్రయాత్ర మొదలుపెట్టాల్సిన అవసరం ఉన్నది. కెప్టెన్ రోహిత్ శర్మ దూరమవడం జట్టుకు భారీ దెబ్బే. హిట్‌మ్యాన్ గైర్హాజరులో స్టార్ పేసర్ బుమ్రాను జట్టును నడిపించనున్నాడు.
వారిపై స్పెషల్ ఫోకస్
సిరీస్‌లో విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, బుమ్రాపై అందరి దృష్టి ఉంది. గతంలో వీరు ఆసిస్ గడ్డపై అద్భుత ప్రదర్శన చేయడమే అందుకు కారణం. ఆసిస్‌లో కోహ్లీకి మంచి రికార్డు ఉంది.13 మ్యాచ్‌ల్లో 1352 రన్స్ చేశాడు. అందులో 6 శతకాలు, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2018-19 పెర్త్ వేదికగానే జరిగినా టెస్టులో భారీ సెంచరీతో కదం తొక్కాడు. అయితే, ఇటీవల కోహ్లీ ఫామ్‌లేమితో సతమతమవుతున్నాడు. ఆసిస్‌పై అతను ఫామ్ అందుకుంటే భారత్‌కు ఢోకా ఉండదు. మరోవైపు, భీకర ఫామ్‌లో ఉన్న పంత్ ఆసిస్ బౌలర్లకు సవాల్ విసరనున్నాడు. గత పర్యటనలో భారత్ సిరీస్ గెలవడంలో పంత్‌ది కీలక పాత్ర. మూడో టెస్టులో 97 పరుగులు, నాలుగో టెస్టులో 89 రన్స్‌తో సత్తాచాటాడు. ఈ సారి కూడా అతనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల బంగ్లాదేశ్, న్యూజిలాండ్ సిరీస్‌ల్లో రిషబ్ అదరగొట్టాడు. ఐదు మ్యాచ్‌ల్లో బంగ్లాపై శతకం బాదిన అతను.. కివీస్‌పై(99) తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. రెండు హాఫ్ సెంచరీలు కూడా చేశాడు. ఇక, బుమ్రా ఆసిస్ బ్యాటర్లకు సిరీస్ ప్రారంభానికి ముందే చెమటలు పట్టిస్తున్నాడు.ఆసిస్‌పై భారత స్టార్ పేసర్‌కు మంచి రికార్డే ఉంది. కంగారుల జట్టుపై 7 మ్యాచ్‌ల్లో 45 వికెట్లు తీశాడు. 2018-19 సిరీస్‌లో బుమ్రా 21 వికెట్లతో టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు.ఈ ఏడాది కూడా బుమ్రా భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఆడిన 9 మ్యాచ్‌ల్లో 41 వికెట్లు పడగొట్టాడు.
రోహిత్, గిల్ స్థానాలను భర్తీ చేసేదెవరు?
వ్యక్తిగత కారణాలతో కెప్టెన్ రోహిత్ శర్మ, గాయం కారణంగా శుభ్‌మన్ గిల్ తొలి టెస్టుకు దూరమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిద్దరి స్థానాలను ఎవరు భర్తీ చేస్తారన్నది? అందరిలోనూ నెలకొన్న ప్రశ్న. ఓపెనర్ యశస్వి జైశ్వాల్‌తో ఇన్నింగ్స్‌ను ఆరంభించడానికి కేఎల్ రాహుల్, అభిమన్యు ఈశ్వరన్ పోటీపడుతున్నారు. కేఎల్ రాహుల్ ఫామ్ లేమితో సతమతమవుతుండగా ఇటీవల ఆస్ట్రేలియా ఏతో సిరీస్‌లోనూ విఫలమయ్యాడు. అయితే, రోహిత్ స్థానాన్ని రాహులే భర్తీ చేస్తాడని ఇటీవల హెడ్ కోచ్ గంభీర్ వ్యాఖ్యానించాడు. అయితే, టీమ్ మేనేజ్‌మెంట్ అదే నిర్ణయానికి కట్టుబడి ఉందో లేదో చూడాలి. అదే జరిగితే 6వ స్థానంలో బ్యాటింగ్ దిగే రాహుల్ ఓపెనర్‌గా రానున్నాడు. గిల్ స్థానాన్ని యువ బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్‌తో భర్తీ చేయాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నది. అలాగే, సీమ్ బౌలింగ్ ఆప్షన్‌గా తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డికి తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే పడిక్కల్ నితీశ్ పెర్త్ మ్యాచ్‌తో టెస్టు అరంగేట్రం చేయనున్నారు.
వర్షం ముప్పు
ఆస్ట్రేలియాలో వర్షాలు పడుతున్నాయి.తొలి టెస్టుకు వర్షం ముప్పు పొంచి ఉన్నది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 20 శాతం వర్షం పడే అవకాశం ఉందని అక్యూ వెదర్ రిపోర్ట్ అంచనా వేసింది. సాయంత్రం వరకు పరిస్థితులు మెరుగయ్యే చాన్స్ ఉన్నట్టు పేర్కొంది.రాత్రి 11 గంటలకు 58 శాతం వర్షం పడనుందని తెలిపింది. వర్షం పడితే మరుసటి రోజు పిచ్ స్వభావం మారే అవకాశం ఉంద.
పేసర్లదే పిచ్
పెర్త్ స్టేడియం పిచ్ పేసర్లకు అనుకూలించనుంది. పిచ్ ఉపరితలం పేస్, బౌన్సీగా ఉంటుంది. కాబట్టి, బ్యాటర్లకు సవాల్ తప్పదు.అయితే, మొదటి రెండు రోజులు బ్యాటర్లు ప్రభావం చూపొచ్చు. ఆట సాగుతున్న కొద్దీ బౌన్స్‌ను రాబట్టే స్పిన్నర్లు మరింత ప్రభావం చూపగలరు.
ఆసిస్ 45.. భారత్ 32
టెస్టుల్లో భారత్‌పై ఆసిస్‌దే ఆధిపత్యం. ఇరుజట్లు 107 మ్యాచ్‌ల్లో తలపడగా ఆస్ట్రేలియా 45 విజయాలు సాధించింది. భారత్ 32 మ్యాచ్‌ల్లో నెగ్గింది. 29 మ్యాచ్‌లు డ్రా అవ్వగా.. ఒక మ్యాచ్ టై అయ్యింది. ఆసిస్ గడ్డపై 52 మ్యాచ్‌లు ఆడితే అందులో భారత్ 9 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. ఆస్ట్రేలియా 30 మ్యాచ్‌ల్లో నెగ్గా.. 13 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.
తుది జట్లు(అంచనా)
భారత్ : యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్, దేవ్‌దత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్, నితీశ్ కుమార్ రెడ్డి, అశ్విన్, ఆకాశ్ దీప్, బుమ్రా(కెప్టెన్), సిరాజ్.
ఆస్ట్రేలియా : నాథన్ మెక్‌స్వీనీ, ఉస్మాన్ ఖవాజా, లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, అలెక్స్ కేరీ, మిచెల్ మార్ష్, పాట్ కమిన్స్(కెప్టెన్), స్టార్క్, హాజెల్‌వుడ్, నాథన్ లియోన్.