దాడిని నివారించాల్సిన డీఎస్పీ...స్పాట్ లో ఉండకుండా దూరంగా ఉన్నట్లు గుర్తింపు...?

by Kalyani |
దాడిని నివారించాల్సిన డీఎస్పీ...స్పాట్ లో ఉండకుండా దూరంగా ఉన్నట్లు గుర్తింపు...?
X

దిశ, సిటీక్రైం : వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనకు సంబంధించి పరిగి డీఎస్పీ కరుణాసాగర్ రెడ్డిని మూడు రోజుల కిందట పోలీసు ఉన్నతాధికారులు బదిలీ చేశారు. ఈ విషయం సోమవారం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం అదనపు డిఎస్పీగా ఉన్న శ్రీనివాస్ ను పరిగి డీఎస్పీ గా నియమించారు. కరుణాసాగర్ రెడ్డిని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. ఈ లచగర్ల ఘటనలో అరెస్టైన పంచాయతీ సెక్రటరీ రాఘవేంద్ర ను కూడా జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. రాఘవేంద్ర లగచర్ల ఘటనలో ఏ-26 వ నిందితుడిగా అరెస్టు అయి రిమాండ్ లో ఉన్నాడు. రైతులను అధికారుల మీదకు ఉసిగొల్పడంలో రాఘవేంద్ర కూడా కీలకంగా వ్యవహరించాడనే ఆరోపణ లతో పాటు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో కూడా ఈ విషయం బయటపడింది.

దాడి జరుగుతున్న సమయంలో కనిపించని డీఎస్పీ కరుణాసాగర్ రెడ్డి

లగచర్ల సంఘటన పై దర్యాప్తు చేస్తున్న ఉన్నతాధికారులకు పరిగి డీఎస్పీ కరుణాసాగర్ రెడ్డి వ్యవహరించిన తీరు తీవ్ర అసహనానికి గురి చేసిందని తెలుస్తోంది. కలెక్టర్ తో పాటు ఇతర రెవెన్యూ అధికారులు తన డివిజన్ పరిధిలోని లగచర్లకు వెళ్ళిన సందర్భంలో అక్కడ ముందు ఉండి అన్ని చురుకుగా వ్యవహరించాల్సి డీఎస్పీ పోలీసులకు లభించిన ఫుటేజ్ లో కెమెరా కంటికి కూడా కనిపించకుండా ఉన్నారని తేలింది. కలెక్టర్, ఇతర రెవెన్యూ అధికారుల పై దాడి జరుగుతున్న సమయంలో దానిని అడ్డుకుని చాకచక్యంగా నివారించాల్సిన డీఎస్పీ అక్కడ లేకుండా దూరంగా ఉన్నట్లు ఉన్నతాధికారుల విచారణలో తేలిందని సమాచారం.

తాండూరు, వికారాబాద్ డిఎస్పిలు తమ వంతు ప్రయత్నంగా దాడిని నివారించేందుకు విశ్వప్రయత్నాలు చేసినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. అయితే స్థానిక డీఎస్పీ లేకపోవడంతో ఉన్నతాధికారులు కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే పోలీసులు అధికారిగా దాడి జరుగుతున్న సమయంలో ముందు ఉండాల్సింది పోయి తానే పక్కకు ఉంటే పరిస్థితులు ఎలా సద్గుమణుగుతాయని , పరిస్థితిని ఎదుర్కోవాల్సింది పోయి అక్కడి నుంచి తప్పించుకునే విధంగా దూరంగా ఉండటాన్ని ఉన్నతాధికారులు తప్పుబట్టినట్లు వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే అతనిని పరిగి డిఎస్పి పోస్టింగ్ నుంచి బదిలీ చేసినట్లు స్పష్టమవుతోంది.

సురేశ్ పరారీకి సహకరిస్తున్న వారిపై చర్యలు

లగచర్ల ఘటనలో కీలక నిందితుడు బొగమోని సురేశ్ ను పట్టుకునేందుకు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ తో పాటు మొత్తం ఐదు టీంలను రంగంలోకి దింపినట్లు మల్టీ జోన్ -2 ఐజి సత్యనారాయణ తెలిపారు. సురేశ్ ను తప్పించి అతనిని దాచిపెట్టేందుకు ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరి పై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయన్నారు. సురేశ్ ను ఈ ఘటనకు స్కెచ్ వేసిన వారే దాచిపెట్టారని అనుమానిస్తున్నామన్నారు. ఏది ఏమైనా త్వరలోనే సురేశ్ ను అరెస్టు చేసి ఇన్ని రోజుల పాటు అతనిని దాచిపెట్టిన వారితో పాటు పరారీకి అతనికి సహకరించిన వారందరీ గుట్టును బయటపెడతామన్నారు

Advertisement

Next Story

Most Viewed