రాష్ట్రంలో లైంగికదాడులు నిత్యకృత్యంగా మారాయి

by Sridhar Babu |
రాష్ట్రంలో లైంగికదాడులు నిత్యకృత్యంగా మారాయి
X

దిశ, సికింద్రాబాద్ : రాష్ట్రంలో లైంగికదాడులు నిత్యకృత్యంగా మారాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. లైంగికదాడికి గురై గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జైనూరు ఆదివాసి మహిళను శుక్రవారం మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పరామర్శించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో లైంగికదాడులు కొనసాగుతున్నాయన్నారు.

నాగర్ కర్నూల్ లో చెంచు మహిళ మీద, ఎల్బీనగర్ లో నాలుగు సంవత్సరాల చిన్నారిపై, పెద్దపల్లిలో ఆరు సంవత్సరాల అమ్మాయిపై, భూపాలపల్లిలో పోలీసు కానిస్టేబుల్ పై ఎస్సై లైంగికదాడులు వంటి ఘటనలను గుర్తు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందన్నారు. తొమ్మిది నెలల కాంగ్రెస్ పాలనలో ఎక్కడ చూసినా అత్యాచారం కేసులే నమోదయ్యాయని చెప్పారు.

అనంతరం సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందన్నారు. ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని, కేసీఆర్ హయాంలో రక్షణకు కేరాఫ్ అడ్రస్ గా రాష్ట్రాన్ని మార్చారని చెప్పారు. కొత్త డీజీపీ వచ్చిన రెండు నెలల్లోనే నిర్మల్, సనత్ నగర్, గోషామహల్, జైనూరులో నాలుగు మత కలహాలు జరిగాయన్నారు. రాష్ట్రంలో మహిళా భద్రత కరువైందని అవేదన వ్యక్తం చేశారు. కేంద్రం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed