సుడాన్ బాబుకు పునర్జన్మనిచ్చిన నీలోఫర్ వైద్యులు..

by Kalyani |
సుడాన్ బాబుకు పునర్జన్మనిచ్చిన నీలోఫర్ వైద్యులు..
X

దిశ, కార్వాన్ : ఆఫ్రికా సుడాన్‌ కు చెందిన ఓ పసి బిడ్డకు నీలోఫర్ ఆసుపత్రిలో వైద్యులు పునర్జన్మను ప్రసాదించారు. అత్యంత విషమ పరిస్థితుల్లో ఉన్న బాబుకు ట్రీట్‌మెంట్ అందించి, రోగాన్ని పూర్తిగా నయం చేశారు. సుమారు నెల రోజుల పాటు నీలోఫర్‌‌లో పూర్తి ఉచితంగా వైద్యం అందించారు. వివరాల్లోకి వెళ్ళితే. ఆఫ్రికా సుడాన్‌ దేశానికి చెందిన సైదా అబ్దేల్ వహాద్(43) దంపతులు ఐవీఎఫ్ ద్వారా బిడ్డను కనేందుకు ఏడాది క్రితం హైదరాబాద్‌కు వచ్చారు. ఇక్కడి ఓ కార్పొరేట్ హాస్పిటల్‌లో ఐవీఎఫ్ చేయించుకోగా, నెల రోజుల క్రితం మహిళ మగ పిల్లాడికి జన్మనిచ్చింది. బాబుకు పుట్టుకతోనే బ్లడ్ ఇన్ఫెక్షన్, బ్రెయిన్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టుగా డాక్టర్లు గుర్తించారు. లంగ్స్‌లోనూ సమస్య ఉన్నట్టుగా తేల్చారు. బాబు పరిస్థితి విషమంగా ఉండడంతో 6 రోజుల పాటు ఐసీయూలో ఉంచి ట్రీట్‌మెంట్ అందించారు. సుడాన్ దంపతుల వద్ద డబ్బులు పూర్తిగా అయిపోవడంతో, బాబును నీలోఫర్‌‌కు రిఫర్ చేశారు. ఆ బాబును అడ్మిట్ చేసుకున్న నీలోఫర్ డాక్టర్లు, నెల రోజుల పాటు పూర్తి ఉచితంగా చికిత్స అందించారు.

బాబు తల్లిదండ్రులకు భోజన వసతి ఏర్పాటు చేశారు. బాబు పూర్తిగా కోలుకోవడంతో, మంగళవారం డిశ్చార్జ్ చేశామని నియొనాటలజిస్ట్‌, డాక్టర్ స్వప్న తెలిపారు. తన బిడ్డను బతికించిన డాక్టర్లకు సుడాన్ మహిళ (43 ఏండ్లు) కృతజ్ఞతలు తెలియజేశారు. తనకు ఇప్పటికే 5 సార్లు అబార్షన్ అయిందని, ఎన్నో ఏండ్లు పిల్లల కోసం తపించామని ఆమె తెలిపారు. ఐవీఎఫ్‌ ద్వారా పిల్లల్ని కనే అవకాశం ఉందని తెలిసి హైదరాబాద్‌కు వచ్చామని తెలిపారు. అయితే డెలివరీ తర్వాత బాబు పరిస్థితి విషమించిందని, చావు బతుకుల్లో ఉన్న తన బిడ్డకు నీలోఫర్ వైద్యులు పునర్జన్మను ప్రసాదించారన్నారు. విషమ పరిస్థితిలో ఉన్న బాబుకు ట్రీట్‌మెంట్‌ అందించిన డాక్టర్లు డాక్టర్ స్వప్న ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ నియోనాటాలజీ, డాక్టర్ మాధురి అసిస్టెంట్ ప్రొఫెసర్ బృందాన్ని, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్ రవి కుమార్, హల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ఆర్‌‌వి. కర్ణన్ అభినందించారు.

Advertisement

Next Story