- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రైతుకు భరోసా
దిశ, మేడ్చల్ బ్యూరో : రైతు భరోసా పథకం దరఖాస్తుల స్వీకరణ కోసం అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది. రైతు భరోసాను రైతు బంధు మాదిరిగా భూ రికార్డుల ఆధారంగా కాకుండా.. సాగు భూమి లెక్కల ఆధారంగా అందించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు సాగు చేస్తున్న భూములపై సర్వే పూర్తి చేసినట్లు సమాచారం. అధికారులు చేసిన సర్వేతోపాటు శాటిలైట్ ఆధారంగా సాగు చేస్తున్న భూములకు మాత్రమే రైతు భరోసా ఇచ్చేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
సాగు లేని భూములకు బంద్.
రైతు బంధు పేరిట గత బీఆర్ఎస్ సర్కార్ మేడ్చల్ జిల్లాలో రూ. కోట్లు దుబారా చేసింది. రైతులను ఆదుకుని, ఆత్మహత్యలు నివారించేందుకు సాగుభూములకు మాత్రమే పెట్టుబడి సాయం ఇవ్వాల్సి ఉండగా, సాగులో లేని బంజరు భూములకు , రాళ్లు రప్పలకు , గుట్టలకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు, ఔటర్ రింగు రోడ్డులో సేకరించిన భూములకు, విద్యా సంస్థలు, కంపెనీలు, గ్రామాలకు, కాలనీలకు రోడ్లకు వివిధ ప్రాజెక్ట్ ల కింద గతంలో సేకరించిన భూములకు కూడా రైతు బంధు కింద కోట్లకు కోట్లు చెల్లించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల వ్యవసాయ శాఖ తో ఫీల్డ్ సర్వే చేయించి నివేదిక తెప్పించుకోగా రూ. కోట్లు దుర్వినియోగమైనట్లు తేలింది.
దుబారా ఇలా...
జిల్లాలో 40,960 రైతులకు (పట్టాదారు పాసుపుస్తకాలు) సంబంధించి 77,984 ఎకరాల భూములు ఉన్నాయి. అయితే ప్రతి ఏటా వానాకాలం సీజన్ లో 25 వేల ఎకరాలు, యాసంగి సీజన్ లో 20 వేల ఎకరాల్లో వివిధ పంటలు వేస్తున్నట్లు వ్యవసాయ శాఖ రికార్డులు చెబుతున్నాయి.ఈ లెక్కన జిల్లాలో 50 శాతం భూముల్లో పంట సాగు కావటం లేదని తెలుస్తోంది. గత బీఆర్ఎస్ సర్కారు మాత్రం రైతు బంధు పథకం కింద 40,960 మంది రైతులకు సంబంధించిన భూ రికార్డుల ప్రకారం 77,984 ఎకరాలకు ఒక్కో ఎకరాకు రూ. 5 వేల చొప్పున రూ.38.99 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసింది. జిల్లాలో ప్రస్తుత యాసంగి సీజన్ లో 19,756 ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేస్తున్నట్లు వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు.
అయితే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు ఎకరాకు రూ.7,500 చొప్పున రైతు భరోసా పథకం స్కీం కింద సాగు చేస్తున్న 19,756 ఎకరాలకు కేవలం రూ.14.81 కోట్లు మాత్రమే చేల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన దాదాపు రూ.24 కోట్లు ఆదా అవుతోంది. రైతు బంధు స్కీంను 2018 ఖరీఫ్ లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించింది. సీజన్ ల వారీగా సాగైన భూములకు మాత్రమే రైతు బంధు సాయం ఉంటుందని అప్పటి సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇందుకోసం ప్రతి సీజన్ లో అగ్రికల్చర్ ఆఫీసర్లతో సర్వే చేయించి, ఆ వివరాల ప్రకారమే రైతు బంధు పైసలు వేస్తామని చెప్పారు. కానీ అగ్రికల్చర్ ఆఫీసర్ల రిపోర్టులతో సంబంధం లేకుండా రైతు బంధు జమ చేస్తూ వచ్చారు. ఇలా ఒక మేడ్చల్ జిల్లాలోనే రూ. వందల కోట్లు రైతు బంధు పేరిట దుబారా అయ్యాయి.
పక్కాగా రైతు భరోసా..
రైతు బంధు లో జరిగిన దుర్వినియోగానికి అడ్డు కట్ట వేసి, అర్హులైన రైతులకు, సాగులో ఉన్న భూములకే రైతు భరోసా అందించేందుకు ప్రస్తుత ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇందులో భాగంగానే పెట్టు బడి సాయానికి ఎలాంటి గైడ్ లైన్స్ ఉంటే బాగుంటుందో సలహాలు, సూచనలు స్వీకరించింది. సంక్రాంతికి రైతు భరోసా అమలు చేయాలని సర్కారు సంకల్పిస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మేడ్చల్ జిల్లాలో రైతు భరోసా పథకం కోసం సాగు చేసే రైతుల వద్ద నుంచి ఈ నెల 5,6,7వ తేదీలలో దరఖాస్తులు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.