Ideal breakfast : ఐడియల్ బ్రేక్ ఫాస్ట్‌..! ఏ విధంగా మేలు చేస్తుంది?

by Javid Pasha |   ( Updated:2025-01-03 14:06:44.0  )
Ideal breakfast : ఐడియల్ బ్రేక్ ఫాస్ట్‌..! ఏ విధంగా మేలు చేస్తుంది?
X

దిశ, ఫీచర్స్ : బ్రేక్ ఫాస్ట్.. మనం ఆరోగ్యంగా ఉండటంలో ఏరోజుకారోజు ముందుగా తీసుకునే ఈ అల్పాహారం ముఖ్యపాత్ర పోషిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఏదో తిన్నామా లేదా అన్నట్లుగా ఏదో ఒకటి తినేయడమో, అసలు తినకపోవడమో మంచిది కాదంటున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గృహిణులు బ్రేక్ ఫాస్ట్‌ను స్కిప్ చేయకూడదని సూచిస్తున్నారు. అయితే ఆరోగ్యంగా ఉండటంలో ‘ఐడియల్ బ్రేక్ ఫాస్ట్’ అద్భుతంగా పనిచేస్తుందని స్పానిష్ పరిశోధకుల తాజా అధ్యయనంలో వెల్లడైంది.

శరీరానికి అవసరమయ్యే సమతుల్యమైన పోషకాలతో కూడిన అల్పాహారాన్నే ‘ఐడియల్ బ్రేక్ ఫాస్ట్‌’గా పేర్కొంటున్నారు పరిశోధకులు. ఇందులో కేలరీల విషయానికి వస్తే.. రోజువారీగా కనీసం 20 నుంచి 30 శాతం ఉండాలని చెబుతున్నారు. ముఖ్యంగా లీన్ ప్రోటీన్లు, హెల్తీ ఫ్యాట్స్, ఫ్రూట్స్, తృణధాన్యాలు, కూరగాయలు వంటివి మాత్రమే ఎక్కువగా తీసుకుంటూ, జంక్ ఫుడ్స్, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండటం ఐడియల్ బ్రేక్ ఫాస్ట్‌ ప్రధాన ఉద్దేశం. కాగా ఇది ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడానికి పరిశోధకులు 55 నుంచి 75 ఏండ్ల లోపు వయస్సు గల 383 మందిపై అధ్యయనం నిర్వహించారు.

ఐడియల్ బ్రేక్‌ఫాస్ట్ (Ideal breakfast) ప్రభావాన్ని పరిశీలించిన రీసెర్చర్స్ లో కేలరీలతో కూడిన బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్న వారి ఆరోగ్యం ఫలితాలు అధ్వాన్నంగా ఉన్నట్లు, అట్లనే వీరిలో కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా పెరుగుతున్నట్లు గుర్తించారు. అయితే సమతుల్య పోషకాలు కలిగిన ‘ఐడియల్ బ్రేక్ ఫాస్ట్’ మాత్రం ఇందుకు భిన్నంగా ఎంతో మేలు చేస్తున్నట్లు గుర్తించారు. అలాగే వయస్సు పెరిగే కొద్దీ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడంలో ఐడియల్ బ్రేక్ ఫాస్ట్ సహాయపడుతున్నట్లు కనుగొన్నారు. కాబట్టి ప్రతిరోజూ సమతుల్య పోషకాలు కలిగిన అల్పాహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. గుండె జబ్బులు, మధుమేహం సహా పలు దీర్ఘకాలిక అనారోగ్యాల నివారణలో ఇది సహాయపడుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా తరచుగా ఫిజికల్ యాక్టివిటీస్ కలిగి ఉండేవారు బ్రేక్ ఫాస్ట్‌ను స్కిప్ చేయకూడదని పరిశోధకులు అంటున్నారు.

*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story