- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bonalu: బోనమెత్తిన గోల్కొండ.. చేనేత చీరలో దర్శనమివ్వనున్న అమ్మవారు
దిశ ప్రతినిధి , హైదరాబాద్ : Bonalu Has been Started In Hyderabad| తెలంగాణలో ఆషాడమాస బోనాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. కొవిడ్ కారణంగా 2020లో బోనాల ఉత్సవాలు నిర్వహించకపోగా గత సంవత్సరం కరోనా కేసులు తగ్గడంతో ప్రభుత్వం బోనాలను వైభవంగా నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఏడు కూడా అంగరంగ వైభవంగా ఆషాడ మాస బోనాల కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా రూ. 15 కోట్ల నిధులను బోనాల ఉత్సవాలకు మంజూరు చేసింది . తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢమాసం బోనాల జాతర సమయంలో కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతుండడంతో కరోనా రూల్స్ పాటిస్తూ బోనాల ఉత్సవాలను నిర్వహించాలని ప్రభుత్వం సంకల్పించింది.
ప్రభుత్వ ఏర్పాట్ల మధ్య బోనాల మొదటి రోజున రాష్ట్ర ప్రభుత్వం పక్షాన డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి , మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు శ్రీ జగదాంబ మహంకాళి అమ్మవారికి లంగర్ హౌస్ చౌరస్తాలో వేద మంత్రాల నడుమ అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించి ఊరేగింపును ప్రారంభించడంతో బోనాల సందడి మొదలైంది. రథం, తొట్టెల ఊరేగింపు ప్రారంభమై గోల్కొండ కోటలోని ఆలయం వరకు కొనసాగింది. లంగర్ హౌస్ చౌరస్తా నుంచి గోల్కొండ కోట వరకు దారి పొడవునా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం మీద 35 మంది పోతురాజులతో బాజా భజంత్రీలు, శివసత్తుల విన్యాసాల నడుమ గోల్కొండ బోనాలు మొదలయ్యాయి. జూలై 5వ తేదీన అమ్మ వారి కళ్యాణాన్ని పురస్కరించుకుని చేనేత చీరలో దర్శనం ఇవ్వనున్నారు. ఇందుకోసం పోచంపల్లిలో మగ్గంపై ప్రత్యేకంగా చేనేత కళాకారులతో చీరను నేయించి సుమారు వారం రోజుల పాటు రంగులు అద్దారు.
ఉత్సవ విగ్రహాలకు ఘనంగా పూజలు..
గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఆలయంలో బోనాల పండుగల కోసం ఊరేగించే ఉత్సవ విగ్రహాలకు ఆలయ కమిటీ సభ్యుడు, ప్రధాన అర్చకుడు అనంతాచారి ఇంట్లో ఘనంగా పూజలు నిర్వహించారు. అక్కడి నుండి విగ్రహాలను దిగంబర్ పంతులు ఇంటికి తీసుకువెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. గోల్కొండ చోటా బజార్, బడాబజార్ ప్రాంతాల మీదుగా విగ్రహాలు అమ్మవారి ఆలయానికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు పాల్గొని అమ్మవారికి హారతి ఇచ్చి స్వాగతం పలికారు. ఉత్సవ విగ్రహాలు ఊరేగింపుగా తరలుతున్న సమయంలో పలువురు మహిళలు పోటీ పడి సాక పోశారు. గోల్కొండ కోట ప్రవేశ ద్వారం వద్ద పోతురాజుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కోటలోకి తొట్టెల, పూజారి కుటుంబ సభ్యులు తెచ్చిన బోనాలతో అమ్మవారి రథం ప్రవేశించింది. కోటపై సుమారు 350 మెట్ల పై నున్న అమ్మవారి ఆలయానికి విగ్రహాల తరలింపుతో తొలిరోజు బోనాలు ఉత్సవాలు మొదలయ్యాయి. 28 కులవృత్తుల వారు అమ్మవారికి పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని ఆలయ కమిటీ చైర్మన్ వావిలాల మహేశ్వర్ వెల్లడించారు.
తొలి బోనం..
నగరంలోని చారిత్రత్మక గోల్కొండ కోటలో తొలిబోనం జరిగింది. కోట లోని శ్రీ జగదాంబిక మాత ఆలయంలో బోనం, తొట్లెల సమర్పించారు. కరోనా భయం పూర్తిగా తొలగక పోవడంతో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. తొలి రోజు బోనాలకు సుమారు లక్ష మంది వరకు హాజరై ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ అమ్మ వారి దర్శనం క్యూ లైన్ నుండే చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. బోనంతో వచ్చే భక్తులకు క్యూ లైన్లో కాకుండా ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా స్థానికంగా ఉండే మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి పచ్చి కుండతో అమ్మ వారికి తొలి బోనం సమర్పించారు.
దారి పొడవునా సీసీ కెమెరాలతో నిఘా..
గోల్కొండ బోనాలకు పోలీసు శాఖ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా లంగర్ హౌస్ నుండి గోల్కొండ కోట వరకు సుమారు 300, కోట లోపల కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా పెట్టారు. బోనాల సందర్భంగా గోల్కొండ పరిధిలో 700 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. వెస్ట్‌జోన్ డీసీపీ జోయల్ డేవిస్ ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు, సిబ్బంది బోనాల భద్రతను సమీక్షిస్తున్నారు. లంగర్ హౌస్‌తో పాటు గోల్కొండ పరిసర ప్రాంతాల్లో అనుమానితులపై నిఘా పెట్టారు. రౌడీ షీటర్లకు ఇప్పటికే కౌన్సిలింగ్ ఇచ్చారు. తొట్టెల ఊరేగింపు కొనసాగిన బంజారా దర్వాజా, ఫతే దర్వాజా ప్రాంతాల్లో భద్రత పటిష్టం చేశారు. జంక్షన్లలో పోలీస్ పికెట్లు పెట్టారు. గురువారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు రామ్‌దేవ్ గూడ, మక్కి దర్వాజ, లంగర్ హౌస్, ఫతే దర్వాజ, సెవెన్ టూంబ్స్ రూట్ల నుంచి గోల్కొండ కోటకు వెళ్లే దారిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బారికేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ డైవర్షన్స్ చేశారు.వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనం, బోనం సమర్పించేందుకు వచ్చే భక్తులు మాస్కు తప్పనిసరి ధరించాలనే నిబంధన పెట్టారు.
కోటలో హెల్త్ క్యాంపులు..
గోల్కొండ బోనాల సందర్భంగా కోట లోపల హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వెంకటి తెలిపారు. ఆలయం వద్ద ప్రత్యేక వైద్య శిభిరాలు, అంబులెన్స్ లను అందుబాటులో ఉంచారు. నగరం నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి కూడా పెద్ద ఎత్తున బోనాల ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ప్రభుత్వం కేటాయించిన నిధులు ఖర్చు చేసి తగిన ఏర్పాట్లు చేశారు. ఉత్సవాలను భక్తులు వీక్షించే విధంగా ప్రధాన ప్రాంతాలలో ఎల్ఈడీ స్క్రీన్ లు, త్రీడీ మ్యాపింగ్ తో పాటు ఆలయాల వద్ద ప్రత్యేకంగా స్టేజీలు ఏర్పాటు చేసి సాంస్కృతిక శాఖ కార్యక్రమాలుప్రదర్శించారు. భక్తులు తోపులాటకు గురికాకుండా పటిష్టమైన బారికేడ్లు, భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటుతో పాటు సీసీ కెమెరాల ద్వారా శాంతి భద్రతలను పర్యవేక్షించేందుకు పోలీస్ శాఖ చర్యలు తీసుకుంది. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా ఉండేందుకు మొబైల్ ట్రాన్స్ ఫార్మర్లు అందుబాటులో ఉంచారు.
వాహనాల పార్కింగ్ ఎక్కడంటే..
గోల్కొండ కోటలో బోనాలకు వాహనాలలో వచ్చే వారు తమ వాహనాలను రామ్దేవ్ గూడ, మక్కి దర్వాజ నుంచి వచ్చే బైక్లు మిలటరీ సెంట్రీ పాయింట్ దగ్గర, కార్లను అషుర్ ఖానాలో పార్కింగ్ చేయాలి. లంగర్‌హౌస్ నుంచి వచ్చే బైక్లు, ఆటోలు హుడా పార్కు వద్ద, కార్లు సలార్ ఫుట్ బాల్ గ్రౌండ్లో , సెవెన్ టూంబ్స్ నుంచి వచ్చే బైక్లు, ఆటోలు ప్రియదర్శిని స్కూల్, ఏరియా హాస్పిటల్, గోల్కొండ బస్టాప్ వద్ద, కార్లను సలార్ ఫుట్ బాల్ గ్రౌండ్లో పార్కింగ్ చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.