ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు.. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు హైకోర్టు నోటీసు

by GSrikanth |
ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు.. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు హైకోర్టు నోటీసు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి ఎన్నికలను ఎప్పుడు నిర్వహిస్తారని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఏండ్ల తరబడి సర్పంచ్, ఉప సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ తదితర పోస్టులు ఖాళీగా ఉన్నా ఎందుకు ఎన్నికలు నిర్వహించడంలేదని ప్రశ్నించింది. న్యాయవాది రాపోలు భాస్కర్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు... రాష్ట్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసి సమగ్రమైన నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ పోస్టులు ఖాళీగా ఉన్నందున ప్రజలకు ప్రభుత్వం తరఫున సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందడంలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో మూడు జెడ్పీటీసీ, 94 ఎంపీటీసీ, 220 సర్పంచ్, 344 ఉప సర్పంచ్, 5,362 వార్డు సభ్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వేర్వేరు కారణాలతో ఇవి ఖాళీ అయ్యాయని, మూడేండ్లుగా భర్తీ కాకుండా ఉండిపోయాయని ఆ పిటిషన్‌లో రాపోలు భాస్కర్ పేర్కొన్నారు.

స్థానిక ఎన్నికల్లో గెలిచిన తర్వాత సకాలంలో ఖర్చును తెలియజేసే అఫిడవిట్ దాఖలు చేయనందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం వారిపై అనర్హత వేటు వేసిందని, మరికొన్ని చోట్ల అవిశ్వాస తీర్మానాలతో రాజీనామా చేయాల్సి వచ్చిందని, ఇంకొన్నిచోట్ల ఇతర కారణాలతో పదవి నుంచి తప్పించాల్సి వచ్చింది.. ఇలా అనేక రూపాల్లో ఈ పోస్టులు ఖాళీ అయ్యాయని పిటిషన్‌లో రాపోలు భాస్కర్ పేర్కొన్నారు. మూడేళ్ళుగా ఖాళీగా ఉన్న పోస్టులకు సైతం ఎన్నికల నిర్వహించడంలో రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి పెట్టలేదన్నారు. ప్రజలు ఎన్నుకున్న పోస్టులు ఖాళీగా ఉండడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయని, ప్రజలు వారి సమస్యలను చెప్పుకోడానికి ప్రతినిధి లేకుండా పోయారని పేర్కొన్నారు.

వెంటనే ఈ ఖాళీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేలా ఎన్నికల సంఘానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని, నోటిఫికేషన్ వెలువరించేలా ఆర్డర్ ఇవ్వాలని ఆ పిటిషన్‌లో రాపోలు భాస్కర్ కోరారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. ఎన్ని రోజుల్లో ఖాళీ పోస్టులకు ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్న విషయాన్ని కోర్టుకు తెలియజేయాలని ఆదేశించింది. పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాల్సిందిగా స్టేట్ ఎలక్షన్ కమిషన్‌కు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 27వ తేదీకి వాయిదా వేసింది.

Advertisement

Next Story

Most Viewed