గ్రూప్-1కు వీడని గ్రహణం

by karthikeya |   ( Updated:2024-10-21 04:54:06  )
గ్రూప్-1కు వీడని గ్రహణం
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నప్పుడల్లా ఏదో ఒక వివాదం వెంటాడుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో 2011లో గ్రూప్-1 పరీక్షలు సజావుగా జరిగి రిక్రూట్‌మెంట్ సైతం కంప్లీట్ అయింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత పోస్టుల భర్తీ కోసం ప్రయత్నాలు జరిగినా సక్సెస్ కాలేదు. చివరకు 2022 ఏప్రిల్ 26న స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ వెలువడింది. ఇప్పటికి మూడుసార్లు ప్రిలిమ్స్ జరిగినా మెయిన్స్ ఎగ్జామ్ సమయానికి ఏదో ఒక వివాదం ముంచుకొచ్చి నిర్వహణ సందిగ్ధంలో పడుతున్నది. తాజాగా సైతం జీవో 29 ఇష్యూతో షెడ్యూలు ప్రకారం పరీక్షలు జరుగుతాయో లేవో అనే కన్‌ఫ్యూజన్ అభ్యర్థులను వెంటాడుతున్నది. మరికొన్ని గంటల్లో (అక్టోబరు 21న) పరీక్షల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం, పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని ఏర్పాట్లతో సిద్ధమవుతున్నా.. సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ విచారణతో ఏం ముప్పు ముంచుకొస్తుందోననే అనుమానం వ్యక్తమవుతున్నది.

13 ఏండ్లుగా..

తెలంగాణ ఏర్పడిన తర్వాత అనేక రకాల పోటీ పరీక్షలు అటు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా... ఇటు మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా... ఇంకోవైపు స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా.. మరోవైపు ట్రాన్స్ కో, జెన్ కో ద్వారా జరిగాయి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షల్లో కొన్ని సక్సెస్‌ఫుల్‌గా జరిగినా గ్రూప్-1 విషయంలో మాత్రం దాదాపు 13 ఏండ్లుగా ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి... అన్న చందంగా తయారైంది. గడిచిన పదేండ్లలో వెలువడింది ఒక్క నోటిఫికేషనే అయినా మూడుసార్లు ప్రిలిమ్స్ పరీక్షలు జరిగాయి. ఫస్ట్ టైమ్ మెయిన్స్ ఎగ్జామ్‌కు గ్రౌండ్ రెడీ అయింది. కానీ చివరి నిమిషం వరకూ పరీక్షలు జరుగుతాయో లేవోననే సందేహం అభ్యర్థులను వెంటాడుతున్నది. పరీక్షలను వాయిదా వేయాలంటూ అభ్యర్థులు ర్యాలీలు తీయడం, విపక్షాలైన బీజేపీ, బీఆర్ఎస్ ఇందుకు మద్దతు, సంఘీభావం తెలుపుతుండంతోపాటు సుప్రీంకోర్టులో పిటిషన్ విచారణకు వస్తుండడంతో సందిగ్ధం నెలకొన్నది.



2022లో ఫస్ట్ నోటిఫికేషన్

తెలంగాణ ఏర్పడిన తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 ఫస్ట్ నోటిఫికేషన్‌ను 2022లో విడుదల చేసింది. షెడ్యూలు ప్రకారం నిర్వహించిన ప్రిలిమ్స్ ఎగ్జామ్స్‌కు దాదాపు 2.80 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యరు. ఆ తర్వాత పేపర్ లీకేజీ అయిందనే బాంబు లాంటి వార్త రావడంతో పలు స్థాయిల్లో దర్యాప్తు జరిగిన అనంతరం పరీక్షలను రద్దు చేస్తున్నట్టు కమిషన్ ప్రకటించింది. రెండోసారి ప్రిలిమ్స్‌ను గతేడాది జూన్‌లో నిర్వహించింది. బయోమెట్రిక్ విషయంలో సరైన నిబంధన పాటించలేదని, ఓఎంఆర్ షీట్స్‌పైన హాల్ టికెట్ నంబర్ లేదనే కారణంతో అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా కమిషన్ వైఫల్యం బట్టబయలైంది. దీంతో ఆ పరీక్షలను మరో సారి రద్దయ్యాయి.

కమిషన్ ప్రక్షాళన..

ఇంతలో అసెంబ్లీ ఎన్నికలు జరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. పరీక్షల నిర్వహణలో పబ్లిక్ సర్వీస్ కమిషన్‌పై నిరుద్యోగుల్లో నెలకొన్న ఆందోళనను పరిగణనలోకి తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం దాని ప్రక్షాళనపై ఫోకస్ పెట్టింది. ఐపీఎస్ అధికారి (రిటైర్డ్) మహేందర్‌రెడ్డి అధ్యక్షతన కొత్త కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 19న 563 గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆ ప్రకారం జూన్ 9న ప్రిలిమ్స్ పరీక్షలు పూర్తయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో (నెం. 29) ప్రకారం 1:50 నిష్పత్తిలో మెయిన్స్ పరీక్షలకు క్వాలిఫై అయినవారి జాబితాను కమిషన్ రిలీజ్ చేసింది. ‘ప్రాథమిక కీ’, ‘తుది కీ’ అనంతరం మెయిన్స్ ఎగ్జామ్స్‌కు అర్హులైనవారితో సెలెక్షన్ లిస్టును ప్రకటించి ఈ నెల 21-27 మధ్య పరీక్షలను నిర్వహించేలా షెడ్యూలు విడుదల చేసింది. జీవోలో రిజర్వేషన్ల అంశాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పలువురు అభ్యర్థులు పిటిషన్లు దాఖలు చేయగా జస్టిస్ పుల్లా కార్తీక్ విచారణ చేపట్టి మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయడం కుదరదని, యధావిధిగా జరుగుతాయని తీర్పునిచ్చారు. దీనిని సవాల్ చేస్తూ హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు కాగా చీఫ్ జస్టిస్ అలోక్ ఆరథే, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ కూడా సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్ధించింది. మెయిన్స్ షెడ్యూలు ప్రకారం జరుగుతాయని, చివరి నిమిషంలో వాయిదా వేయడం లేదా జీవోను రద్దు చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది.

సుప్రీంకోర్టుకు..

హైకోర్టు తీర్పులను సవాలు చేస్తూ అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో నేడు ఉదయం విచారణకు రానున్నది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి మెయిన్స్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. నిమిషాల వ్యవధిలో సుప్రీంకోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇస్తుందన్న టెన్షన్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల్లో నెలకొన్నది. గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం పదేండ్లలో నోటిఫికేషన్లు విడుదలవ్వడమే తప్ప రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ముందుకు కదలడం లేదు. ప్రతిసారీ ఏదో ఒక వివాదం ముసురుకుంటున్నది. ఇప్పుడైనా ప్రణాళిక ప్రకారం జరుగుతుందో లేదో తెలియని అనిశ్చితి నెలకొన్నది. పబ్లిక్ సర్వీస్ కమిషన్, ప్రభుత్వం, హైకోర్టు... ఇవన్నీ పరీక్షలు యధావిధిగా జరుగతాయనే పేర్కొంటున్నాయి. మరికొన్ని గంటల్లో దీనిపై ఉత్కంఠ తొలగనున్నది.

Advertisement

Next Story

Most Viewed