ఆదాయ మార్గాల అన్వేషణలో సర్కార్.. ఆలయ భూములపై స్పెషల్ ఫోకస్

by karthikeya |
ఆదాయ మార్గాల అన్వేషణలో సర్కార్.. ఆలయ భూములపై స్పెషల్ ఫోకస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దేవాలయ భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనున్నది. ఆలయ భూముల పరిరక్షణలో భాగంగా వీటి నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు సమాచారం. ఫస్ట్ ఫేజ్‌లో ఐదు జిల్లాల్లోని 231 ఎకరాల్లో, సెకండ్ ఫేజ్‌లో రెండు జిల్లాల్లో 21.34 ఎకరాల్లో ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఈ ప్లాంట్లతో ఎన్ని మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని సాధించొచ్చనేది త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నట్లు సమాచారం. ఇది సక్సెస్ అయితే రాష్ట్రంలోని అన్ని దేవాలయాల భూముల్లోనూ ఏర్పాటు చేయనున్నారు.

ఫస్ట్ ఫేజ్‌లో 5 జిల్లాలు.. 284.09 ఎకరాల్లో

తొలి విడుతలో రాష్ట్రంలోని సిద్దిపేట, మెదక్, నిర్మల్, నిజామాబాద్, నల్లగొండలోని 231.05 ఎకరాల్లో ప్లాంట్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించింది. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని ముసత్యాల గ్రామంలోని వేణుగోపాలస్వామి ఆలయానికి చెందిన 9.06 ఎకరాల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని లక్ష్మీనారాయణస్వామి ఆలయానికి చెందిన 100 ఎకరాల్లో, నిర్మల్ జిల్లా భైంసాలోని గోశాలకు ఉన్న 96.36 ఎకరాల్లో, నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పరిధిలోని 9.10 ఎకరాల్లో, నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం బిజ్లాపురం లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి చెందిన 15.33 ఎకరాల్లో సోలార్ ప్లాంట్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

ఫేజ్-2లో 21.34 ఎకరాలు

రెండో విడుతలో మహబూబాబాద్, హన్మకొండ జిల్లాలోని నాలుగు ఆలయాలకు చెందిన 21.34 ఎకరాల్లో సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూర్ మండలం మటెడు గ్రామంలోని రామలింగేశ్వరస్వామి ఆలయానికి చెందిన 20 గంటల్లో, ఇదే జిల్లా మరిపెడ మండలం అబ్బాయిపాలెంలోని అగస్తేశ్వరస్వామి ఆలయానికి చెందిన 14.25 ఎకరాల్లో, మహబూబాబాద్‌లోని శివాలయానికి ఉన్న 3.29 ఎకరాల్లో ప్లాంట్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. హన్మకొండ జిల్లాలోని రంగనాధర్వాజ(చిన్నకోవెల) సీతారామచంద్రస్వామి ఆలయానికి ఉన్న మూడెకరాల్లో పవర్ ప్లాంట్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

మహిళా బృందాలకు లీజుకు ప్రతిపాదనలు

ఆలయ భూములను స్వశక్తి మహిళా సంఘాలకు లీజుకు ఇచ్చి సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టేలా ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తుంది. దీంతో మహిళా సంఘాలను సైతం ఆర్థికంగా బలోపేతం చేయాలని, మరోవైపు ఆలయాలకు సైతం ఆదాయం సమకూరుతుందని అధికారులు పేర్కొంటున్నారు. టెండర్లు పిలిచి పోటీతత్వాన్ని పెంచి ఆదాయం రాబట్టేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం కొన్ని భూములను ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇచ్చింది. వారి గడువు ముగిస్తే వాటిని సైతం స్వాధీనం చేసుకొని వాటిలోనూ సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టేందుకు కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం.

ఆలయ భూముల ఆక్రమణలకు చెక్ పెట్టేలా..

రాష్ట్రంలో మొత్తం 91,827 ఎకరాలు ఉండగా.. అందులో 25వేల ఎకరాలు కబ్జాకు గురయ్యాయి. ఇక మీదట భూములు ఆక్రమణలు గురికాకుండా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా జియోట్యాగింగ్ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు 34,092.00 వేల ఎకరాలకు పైగా జియో ట్యాగింగ్ పూర్తి చేసింది. భూముల పరిక్షణకు ప్రొటెక్షన్ సెల్‌ను సైతం ఏర్పాటు చేసింది. దీనిని ప్రభుత్వం నిత్యం మానిటరింగ్ చేస్తుంది.

ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నాం

ఆలయ భూములు ఆక్రమణకు గురికాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. అందులో భాగంగా భూములతో ఆదాయాన్ని ఎలా ఆర్జించవచ్చనే మార్గాలను అన్వేషిస్తున్నాం. 5 జిల్లాల్లోని 231 ఎకరాల ఆలయ భూముల్లో తొలి విడుతలో సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వం సైతం కొన్ని ఎకరాల్లో ప్లాంట్లు ఏర్పాటు చేసి ఆ బాధ్యతలను సంబంధిత ఆలయాలకు అప్పగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది. మహిళా సంఘాలను సైతం ఆర్థిక పరిపుష్టి చేసేందుకు భూములు లీజుకిచ్చి వారితో పవర్ ప్లాంట్ నిర్మాణం చేయాలని భావిస్తున్నది. ప్రైవేటు సంస్థల ద్వారా పవర్ ప్లాంట్ల నిర్మాణాలను ప్రోత్సహించాలని అనుకుంటున్నారు.

- మంత్రి కొండా సురేఖ

Advertisement

Next Story

Most Viewed