భారత విద్యార్థులకు ఫీజుల్లో రాయితీలు ఇవ్వండి..

by Kalyani |
భారత విద్యార్థులకు ఫీజుల్లో రాయితీలు ఇవ్వండి..
X

దిశ, సికింద్రాబాద్: విద్యా పరిశోధన రంగాల్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవటంతో పాటు భారత విద్యార్థులకు ఫీజుల్లో రాయితీలు ఇచ్చే దిశగా ఆలోచించాలని యూకే ప్రొఫెసర్లను ఓయూ వీసీ ప్రొఫెసర్ దండెబోయిన రవిందర్ యాదవ్ కోరారు. యూకేలోని విశ్వవిద్యాలయాల సహకారంతో ఆధునిక అభివృద్ధికి అనుగుణంగా పాఠ్య ప్రణాళికలో మార్పుల కోసమై తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిర్వహిస్తున్న సదస్సుకు యూకే ప్రొఫెసర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించి వర్సిటీ ఈసీ హాల్ లో మంగళవారం సమావేశమయ్యారు. అబెరిస్ట్‌విత్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ తిమోతీ వుడ్స్, ఉద్యోగ, ఉపాధి, కేరీర్ విభాగ అధిపతి ఎంఎస్ బెవర్లీ హెర్రింగ్, బంగోర్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ నికోల క్యాలో, టీచింగ్ అండ్ లెర్నింగ్ విభాగ డైరెక్టర్ డాక్టర్ అమా బస్సీ ఇయో ఈ సమావేశంలో పాల్గొన్నారు.

అంతర్జాతీయ విద్యార్థుల ఎక్చేంజీలో భాగంగా భారతీయ విద్యార్థులకు ఫీజుల తగ్గింపు, నిధుల అవకాశాలపై ఓయూ వీసీ ప్రొఫెసర్ రవిందర్ ప్రతిపాదనలను పరిశీలిస్తామని ప్రొఫెసర్ తిమోతీ వుడ్స్ హామీ ఇచ్చారు. సైబర్ సెక్యూరిటీ, ఏఐ, సోషియాలజీ అనుబంధ రంగాల్లో సహకారానికి పుష్కలంగా అవకాశాలున్నాయని ప్రొపెసర్ నికోలా క్యాలో తెలిపారు. డేటా అనలిటిక్స్ అద్భుతమైన భవిష్యత్తు ఉందని ఆ దిశగా ఒప్పందాలు చేసుకునేలా దృష్టి సారించాలని డాక్టర్ అమా బస్సీ ఇయో వివరించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా చురుకైన వ్యవస్థలను ఏర్పాటు చేయటం గురించి ఎం ఎస్ బెవర్లీ హెర్రింగ్ తెలిపారు. సమావేశంలో ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, ఓఎస్డీ ప్రొఫెసర్ రెడ్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed