మతిమరుపా..! రైతులు మర్చిపోయారని అనుకుంటున్నారా.. మంత్రి తుమ్మల ఆసక్తికర వ్యాఖ్యలు

by Shiva Kumar |
మతిమరుపా..! రైతులు మర్చిపోయారని అనుకుంటున్నారా.. మంత్రి తుమ్మల ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘రైతు భరోసా’ విధివిధానాలు ఏమిటి, ఎప్పుడిస్తారు, పంట వేసే ముందు ఇస్తారా, పంట వేశాక ఇస్తారా అని మాట్లాడటం చూస్తుంటే మతిమరుపు ఉందనుకోవాలా, లేక రైతులు మర్చిపోయారనుకుంటున్నారా అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాజీ బీఆర్ఎస్ మంత్రిని ప్రశ్నించారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలపై గురువారం మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నంత కాలం ఏ సమయంలో రైతుబంధు ఇచ్చారో ఎంతకాలం పాటు ఇచ్చారో, ఎన్ని పర్యాయాలు పూర్తిగా ఇవ్వకుండా ఆపేశారో లాంటి విషయాలన్ని తెలంగాణ రైతులకు తెలుసని అన్నారు.

2018లో వానాకాలం 128 రోజుల (4 నెలల 5 రోజులు) పాటు, యాసంగిలో 161 రోజులు, 2019 వానాకాలంలో 138 రోజులు, 2020 వానాకాలంలో 169 రోజులు, 2021-22 యాసంగిలో 84 రోజులు, 2022-23 యాసంగిలో 148 రోజులు, 2023 వానాకాలంలో కూడా 108 రోజుల పాటు రైతుబంధు నిధులు విడుదల చేసిన బీఆర్ఎస్, ఇప్పటి ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే కోడిగుడ్డు మీద ఈకలు ఏరుతున్నట్లు ఉందని ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వ హయాంలో రైతుబంధులో గుట్టలకు, రాళ్లురప్పలకు, పుట్టలకు, రియల్ ఎస్టెట్ వెంచర్లు వేసిన భూములకు, జాతీయ రహదారులకు, బంజరు భూములకు ఇచ్చి 12 విడతల్లో రూ.26,500 కోట్ల ప్రజాధనాన్ని దుబారా చేసిందని మండిపడ్డారు. అందుకే తమ ప్రభుత్వం ‘రైతుభరోసా’ను అలా కాకుండా ఒక ఆదర్శవంతమైన పథకంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటే, ఆ ప్రయత్నాన్ని హర్షించవలసింది పోయి, విమర్శలకు దిగడం వారి స్థాయిని దిగజార్చుకోవడమే అని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటికీ కట్టుబడి ఉందని, రైతు భరోసా విషయంలో ఇప్పటికే రైతుల అభిప్రాయాలను తీసుకొంటున్నామని అన్నారు. అదేవిధంగా రాష్ట్ర కేబినేట్ నియమించిన సబ్ కమిటీలో విధివిధానాలు తయారు చేసి త్వరలోనే ఆ పథకాన్ని అమలు చేస్తామని తుమ్మల తెలిపారు. ఇంకా తమ ప్రభుత్వాన్ని తులనాలడం మాని, ఎంతో అనుభవం గల మీలాంటి విజ్ఞులు కూడా నిర్ణయాత్మక సలహాలు, సూచనలు ఇస్తే తమ ప్రభుత్వం సద్విమర్శలను స్వీకరిస్తుందని, నియంతృత్వ పోకడల ప్రభుత్వం తమది కాదని మాజీ మంత్రి వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.

Next Story

Most Viewed